ఉన్నతంగా నిలిచిన ఉన్నత న్యాయస్థానం

Kommineni Srinivasa Rao Article On Supreme Court Of India - Sakshi

విశ్లేషణ

దాదాపు ఏడాది కాలం పాటు ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆదేశాలు ఇచ్చిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. హైకోర్టుపై ప్రభుత్వం యుద్ధం చేస్తుందా, హైకోర్టును మూసివేస్తారా అని ప్రశ్నించడం, ప్రభుత్వం దివాళా తీసిందా అని వ్యాఖ్యానించడం... ఇవన్నీ తెలుగుదేశం అనుకూల మీడియా హైలైట్‌ చేయడం నిత్యకృత్యంగా మారింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తాననీ, దీనికి సంబంధించిన ఆధారాలతో కూడిన పిటిషన్‌ వేయండనీ చెప్పడమూ ఆశ్చర్యం కలిగించింది. ఈ దశలో రాజ్యాంగం విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు తీర్పు ఆందోళనకరంగా ఉందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య న్యాయవ్యవస్థను అంతర్గతంగా రిపేరు చేయడానికి ప్రయత్నం జరుగుతోందన్న ఆశ కలిగించింది.

సుప్రీంకోర్టు మీద గౌరవం పెరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశంపై స్టే ఇవ్వడమే కాకుండా, ఆ తీర్పును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హైకోర్టు గమనంలోకి తీసుకోదగినవిగా ఉన్నాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో, ప్రజల స్వేచ్ఛను పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా ఉందన్న భావన ఇలాంటి తీర్పుల ద్వారా వెల్లడవుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక రాష్ట్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థ నుంచి ఎలాంటి సమస్య లను ఎదుర్కుంటున్నది గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు అర్థం అయివుండాలి. హెబియస్కార్పస్‌ పిటిషన్లకు సంబంధించిన కేసు విచారణలో ఏపీ హైకోర్టు జడ్జీ జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ అసలు కేసును పక్కనబెట్టి రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తాననీ, దీనికి సంబంధించిన ఆధారాలతో కూడిన పిటిషన్‌ వేయండని పిటిషనర్లకు చెప్పడమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

సంబంధిత కక్షిదారుడు రాజ్యాంగ పరిరక్షణపై పిటిషన్‌ వేసి ఉంటే, దాని అర్హతను బట్టి న్యాయమూర్తి విచారణ చేపట్టి ఉంటే తప్పు లేదు. కానీ ఆయనే స్వయంగా ఒక అభిప్రా యానికి వచ్చి, ఆ రకమైన విచారణ చేపట్టడం సుప్రీంకోర్టును కూడా ఆశ్చర్యపరచింది. ఇలాంటి ఆందోళనకరమైన ఆదేశాలను గతంలో ఎప్పుడైనా చూశామా అని స్వయంగా చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే వ్యాఖ్యానించారంటే ఏపీ ప్రభుత్వం పట్ల ఏపీ హైకోర్టు ఎలాంటి ధోరణితో ఉందో సుప్రీంకోర్టు వారికి తెలిసి ఉండాలి. రాజ్యాంగ విచ్ఛిన్నం అన్నది నిర్ణయించడానికి కోర్టులకు ఉన్న పరిధి ఏమిటని, అందుకు వేరే ఏర్పాట్లు రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన వ్యాఖ్యా నించడం పద్ధతిగా ఉంది. విచిత్రం ఏమిటంటే ఏపీ ప్రభుత్వ ఆడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ గానీ, ఇతర ప్రభుత్వ న్యాయవాదులు ఎస్‌.ఎస్‌. ప్రసాద్, సుమన్‌ వంటివారు గానీ ఎంత మొత్తు కున్నా జడ్జీ వినిపించుకోకుండా తాను విచారణ చేపట్టి తీరుతానని చెప్పడం, తాను తీర్పును రిజర్వ్‌ చేస్తానని అనడం వంటి ఘట్టాలు జరిగాయి.

ఒక దశలో గౌరవ న్యాయమూర్తి ప్రభుత్వ వాదనలు పూర్తిగా వినకుండా ఆదేశాలు ఇస్తే, అది రాజకీయ ఉద్దేశాలతో కూడినదని ఆపాదించవలసి వస్తుందని ప్రభుత్వ న్యాయవాది ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ హెచ్చరిం చారు. అయినా న్యాయమూర్తి ససేమిరా అన్నారు. చివరికి అసలు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఈ కేసులు విచారించరాదంటూ ప్రభుత్వంవారు పిటిషన్‌ వేశారు. ఇలాంటి పిటిషన్‌ వేయాల్సిన పరిస్థితి రావడం గౌరవ హైకోర్టువారికి గానీ, గౌరవ న్యాయ మూర్తులకు గానీ ఏం శోభనిస్తాయి? ఈలోగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం ద్వారా ప్రభు త్వం ఉపశమనం పొందిందని చెప్పాలి.

ఏపీ హైకోర్టువారు ఎందుకో మొదటి నుంచీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై కొంత వ్యతిరేక భావంతో ఉన్నారా అన్న అభిప్రాయం జనబాహుళ్యంలోకి వెళ్లింది. సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి వంటి వారు రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, హైకోర్టే ప్రతి పక్షంగా ఉందని వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న జస్టిస్‌ జె.కె.మహేశ్వరి కూడా పలు అంశాలపై స్పందించిన తీరు, తీర్పులు ఇచ్చిన వైనం అనేకం వివాదాస్పదం అయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఏకంగా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో సహా నలుగురు జడ్జీలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి రెండు నెలల కిందట ఫిర్యాదు చేసి వచ్చారు. ఆ విషయాన్ని ఆయన బహిర్గతం చేయ డం పెద్ద సంచలనం అయింది. ఒక తాగుబోతు డాక్టర్‌ విశాఖ రోడ్డుపై అల్లరి చేస్తుంటే పట్టుకున్న కానిస్టేబుల్‌పై సీబీఐ విచారణకు ఆదేశించడం ఆశ్చర్యపరిచింది.

సీబీఐ విచారణ వేయాల్సినంత అంశం ఏముందని ప్రశ్నించిన పలువురిపై కోర్టు ధిక్కారం అంటూ హూంకరించారు. కొందరు దూషణలకు పాల్పడి ఉండవచ్చు. వారిపై చర్య తీసుకోవడం తప్పు కాదు. కానీ పద్ధతిగా ఆ తీర్పుపై విశ్లేషించిన వాళ్లకు కూడా ధిక్కార నోటీ సులు ఇవ్వడం ద్వారా భావస్వేచ్ఛకు హైకోర్టు వారే అడ్డంకులు సృష్టిస్తే ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. ఏపీలో 34 మంది జడ్జీలకు నాయకత్వం వహించే చీఫ్‌ జస్టిస్‌ను ఇద్దరో, ముగ్గురో జడ్జీలు ఉండే సిక్కింకు బదిలీ చేయడాన్ని ఎలా చూడాలన్న దానిపై పలు విశ్లేషణలు వచ్చాయి. జగన్‌ లేఖ ప్రభావం పడిందని కొన్ని ఆంగ్ల పత్రికలు రాస్తే, సాధారణ బదిలీలలో భాగమేనని మరికొందరు అభిప్రాయ పడ్డారు. 

దాదాపు ఏడాది కాలం పాటు ఏపీ హైకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా ఆదేశాలు ఇస్తూ వచ్చారన్న అభిప్రాయం ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందినవారు న్యాయ వ్యవస్థ తమ జేబులో ఉందన్న చందంగా పిటిషన్లు వేయడం, అవి చకచకా విచారణకు రావడం పలు వురు న్యాయ నిపుణులకు విస్మయం కలిగించేది. కరోనా సంక్షోభం ఆరంభం అయిన రోజుల్లో ౖవైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పేదలకు బియ్యం, కూరగా యలు వంటి సరుకులు సాయం చేయడానికి వెళితే వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టువారు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కరోనా నియమాల ఉల్లంఘన కేసు రాగానే చట్టం ప్రకారం సంబంధిత డీజీపీకి ఫిర్యాదు చేయండని చెప్పడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక పత్రికవారు న్యాయ మూర్తుల టెలిఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయని ఒక చెత్త వార్త రాస్తే, దాని సంగతి తేలుస్తా మంటూ ఎవరెవరికో నోటీసులు ఇచ్చారు తప్ప అసలు వార్త రాసిన పత్రికకు నోటీసు ఇవ్వలేదు.

స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ దగ్ధం కేసులో డాక్టర్‌ రమేష్‌ను అరెస్టు చేస్తే, తాము కలెక్టర్‌పై చర్యలకు ఆదేశిస్తామని ఆశ్చర్యకరమైన వాదనను గౌరవ జడ్జీ ఒకరు తెచ్చారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐ స్కాములో అరెస్టు అయితే, ఆయనకు పైల్స్‌ ఉన్నాయన్న కారణంగా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్ప చేశారు. ఆ తర్వాత ఆయనకు వ్యాధి తగ్గిందని వైద్యులు నిర్ధారించి జైలుకు పంపిస్తే, కనీసం వైద్య నిపుణుల సలహా తీసుకో కుండా మరో గౌరవ న్యాయమూర్తి కార్పొరేట్‌ ఆస్పత్రికి అచ్చెన్నాయుడును తరలిస్తూ ఆదేశాలు ఇచ్చిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఆంగ్ల మీడియం కేసులో కానీ, పేదల ఇళ్ల స్థలాల విషయంలో కానీ హైకోర్టులో వెలువడిన కొన్ని తీర్పులపై ప్రజల్లో చాలా విమర్శలు వచ్చాయి. ఒక జడ్జీగారైతే హైకోర్టుపై ప్రభుత్వం యుద్ధం చేస్తుందా అనడం, హైకోర్టును మూసివేస్తారా అని ప్రశ్నించడం, ప్రభుత్వం దివాళా తీసిందా అని వ్యాఖ్యానించడం... ఇవన్నీ తెలుగుదేశం మీడియా హైలైట్‌ చేయడం నిత్యకృత్యంగా మారింది. 

అదే సమయంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చేసిన సీరియస్‌ వ్యాఖ్యలను మాత్రం దాచిపుచ్చే ధోరణితో తెలుగుదేశం అనుకూల మీడియా చేసిన ప్రయత్నం నగ్నంగా కనిపించింది. ఒక వైపు రాజ కీయ నేతలపై ఏడాదిలో కేసులు తేల్చి వేయాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, మరోవైపు న్యాయవ్యవస్థ లోని వారిపై అవినీతి కేసులు వస్తే వాటి వివరాలు వెల్లడించవద్దని మీడియాకు గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చిన తీరు మరో పెద్ద సంచలనం అయింది. దాన్ని కూడా సుప్రీంకోర్టు తొలగించడం హర్షణీయం. ఈ దశలో చీఫ్‌ జస్టిస్‌ బదిలీ అయిన తీరు, రాజ్యాంగం విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు తీర్పు ఆందోళన కరంగా ఉందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య... ఇవన్నీ న్యాయవ్యవస్థను అంతర్గతంగా రిపేరు చేయడానికి కొంత ప్రయత్నం జరుగు తోందన్న ఆశ  కలిగించాయి.

ఈ దేశంలో న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుతుందా అన్న సంశయం చాలామందికి ఉంటుంది. కొన్ని కేసుల్లో అయినా తప్పక న్యాయం నిలబడుతుందని ఉన్నత న్యాయ స్థానం నిరూపించింది. అందుకు కోర్టువారికి అభినందనలు తెలపాలి. న్యాయ వ్యవస్థ ప్రభు త్వంలోని లోపాలు, తప్పులను ఎత్తి చూపడం తప్పు కాదు. కానీ ప్రభుత్వం ఏంచేసినా ఆపాలన్న ధోరణి హైకోర్టుకు ఉందన్న అభిప్రాయం ప్రబల డం సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా ధర్మమూర్తులు అయిన న్యాయమూర్తులు ధర్మ బద్ధంగా, న్యాయబద్ధంగా ఉండి గొప్పపేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిద్దాం.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు   
కొమ్మినేని శ్రీనివాసరావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top