మూడో ఫ్రంట్‌ మనగలిగేనా?

Future For Third Front In Indian Politics Against Bjp Review Dileep Reddy - Sakshi

దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలో దానిపై రాజకీయ స్పృహ పెరుగుతోంది. దశాబ్దాలుగా ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ చతికిలపడింది. దాంతో బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్‌ రహిత రాజకీయ కూటమికి ఇదే సమయంగా కనబడుతోంది. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బలమైన కారణం లేకుండా ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను కేసీఆర్‌ తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకోగలిగే పార్టీలు, నామమాత్ర పార్టీలు, బలమైనవే అయినా ప్రస్తుతం కాంగ్రెస్‌తో కలిసున్న పార్టీలు... ఇవన్నీ జట్టు కట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా, పూర్తికాలం మనగలవా, వీటికి ఎవరు నేతృత్వం వహిస్తారు అన్నవి ప్రస్తుతానికి ప్రశ్నలే!

‘నీ ఆలోచనా శక్తి నీలో పుట్టే భావోద్వేగాల కన్నా పటిష్ఠంగా ఉంటే గెలుపు నీదే’ అన్నది గ్రీక్‌ తాత్వికుల కాలం నుంచీ ప్రాచుర్యంలో ఉన్న నానుడి. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీ రామారావుకూ, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకూ కొన్ని సామ్యా లున్నా... వైరుద్ధ్యాలే ఎక్కువ. ఇద్దరూ ఆవేశపరులే. కేసీఆర్‌ ఆవేశం గతపు వివక్ష నుంచో, వర్తమానపు అన్యాయాల నుంచో, భవిష్యత్తు అంచనాల నుంచో పురుడు పోసుకుంటుంది. భావోద్వేగాలను కార్యా చరణగా మలిచే బలమైన కసరత్తు పూర్వరంగంలో ఉంటుంది. ఇటీ వల ఆయన తరచూ మాట్లాడుతున్న ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’కు నిజంగా ఆస్కారం ఉందా? ఆయన ప్రధాని అవ్వొచ్చా?

ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే... సదరు ప్రతికూల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడొచ్చు. ఇదొక అంచనా! ఆ ఫలితాలతో నిమిత్తం లేకుండానే లోక్‌సభ ఎన్నికలప్పుడు యూపీ, బీహార్‌ రాష్ట్రాల్లో బీజేపీకి రమారమి సీట్లు తగ్గితే ఎన్డీయే తిరిగి ప్రభుత్వం ఏర్పాటుచేయడం కష్టమే. అప్పుడు ప్రత్యామ్నాయ రాజ కీయ శక్తిగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. మరేదైనా సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చనుకుంటే, అదేనా... కేసీఆర్‌ అంటున్న ఫెడరల్‌ ఫ్రంట్‌? 
దేశంలో ఏకపార్టీ స్వామ్యం పోయి సంకీర్ణ శకం మొదలయ్యాక, అంటే 1989 నుంచి, ఇటీవలి బీజేపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వాల మాదిరే బీజేపీయేతర, కాంగ్రేసేతర ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పాటైన ప్రయోగాలున్నాయి.

అలా ఎనభైల చివర్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడ్డ ‘నేషనల్‌ ఫ్రంట్‌’ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు లభించినట్టే, తొంభైల ద్వితీయార్ధంలో వచ్చిన ‘యునెటైడ్‌ ఫ్రంట్‌’ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. అయితే, ఆ ప్రయోగాలు విఫలమై ఆయా ప్రభుత్వాలు కూలడానికి కూడా సదరు బీజేపీ, కాంగ్రెస్‌లే కారణ మన్నది జగమెరిగిన సత్యం. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయ డానికైనా, ఏర్పడ్డ ప్రభుత్వాలను కూల్చడానికైనా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలే కావాలనే రాజకీయ వాతావరణం దేశంలో నెలకొంది. మరి కేసీఆర్‌ అంటున్నట్టు ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ పెట్టి, ప్రభుత్వం ఏర్పరచి, నాలుగు కాలాలు మనగలిగేలా చేయడం సాధ్యమా?

సమాఖ్య వాదనకు బలం
దేశంలో సమాఖ్య స్ఫూర్తికి గండి పడుతున్న క్రమంలోనే దానిపై రాజ కీయ స్పృహ పెరుగుతోంది. ఎన్డీయే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్పటికీ గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మెజారిటీ స్థానాలు సాధిం చింది. రెండో మారు గెలుపుతో పార్టీ వైఖరి మారిపోయింది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ‘ఒకే’ల క్రమంలో ఒకే ప్రభుత్వం అన్న ధోరణి పెరిగింది. జీఎస్టీ నుంచి వ్యవసాయ చట్టాల వరకు, బడ్జెట్‌ కేటా యింపుల నుంచి నదుల అనుసంధానం వరకు... రాష్ట్రాల ప్రాధా న్యాన్ని తగ్గిస్తూ అన్నీ తానై కేంద్రం వ్యవహరిస్తోంది. రాజ్యాంగం నిర్దేశించిన మూడు జాబితాల్లోని రాష్ట్ర అంశాల్లోకి తరచూ చొరబడు తున్న కేంద్ర ప్రభుత్వపు ఒంటెద్దు పోకడల్ని చాలా రాష్ట్రాలు జీర్ణించు కోలేకపోతున్నాయి.  

తిరిగి తెలుగుతేజమే కేంద్రబిందువా?
రెండో మారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక, నాటి ముఖ్య మంత్రి ఎన్టీయార్‌ తన కారు డ్రైవర్‌తో, ‘లచ్చన్నా! నువ్‌ కూడా రెడీ అయిపో. ఢిల్లీ పోదాం. దేశ పాలన ఏమీ బాగోలేదు. ఈ చట్టాలు అవీ... మనం అక్కడి నుంచే బాగుచేయాలి’ అన్నారట! అన్నట్టుగానే, ఓ అయిదేళ్లకు ‘జాతీయ ఫ్రంట్‌’కు స్వయంగా నేతృత్వం వహించారు.  ఇప్పుడు కొత్తగా ఏర్పడుతుందనుకునే ఫెడరల్‌ ఫ్రంట్‌ సర్కారు లోనూ కేసీఆర్‌ కీలకపాత్ర పోషిస్తారేమో! కాంగ్రెస్, బీజేపీ, ఈ రెండు జాతీయస్థాయి ప్రధాన పార్టీలు దేశానికి న్యాయం చేయలేక పోయాయి. పాజిటివ్‌ ఓటు ఎంతో అరుదు! దిక్కుతోచని దేశ పౌరుల వ్యతిరేక అభిప్రాయంతోనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రాంతీయ ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడంలో రెండు పార్టీలు ఘోరంగా విఫలమై, పలు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. దీనికి ఏకైక విరుగుడు ‘ఫెడరల్‌ ఫ్రంట్‌ సర్కారు’ అనేది కేసీఆర్‌ వాదన, ప్రతిపాదన. నిజానికి ఇటువంటి యత్నం ఆయన 2019 ఎన్నికల ముందే చేసినా... కారణాంతరాల వల్ల ఫలించలేదు. ఇప్పట్నుంచి చేస్తే 2024 ఎన్నికల నాటికి ఓ రూపం వస్తుందని ఆయన లెక్క!

కాంగ్రెస్‌ను కాదంటే లెక్కలు సరిపోతాయా?
దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, దశాబ్దాల తరబడి ప్రబల రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల చతికిలపడింది. బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్‌ రహిత రాజకీయ కూటమికి ఇదే అత్యున్నత సమయం అని కేసీఆర్‌కు తెలుసు. కానీ, వేర్వేరు రాష్ట్రాల్లో బలమైన శక్తులుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏకరీతి ఆలోచనలతో లేవు. బలమైన కారణం, కారకం లేకుండా అవి ఒక్కతాటిపైకి వస్తాయా? అందుకే, సమాఖ్య భావనను ఆయన తలకెత్తుకున్నారు. ఎక్కువ లోక్‌సభ స్థానాలు దక్కించుకునే స్థితిలో ఉన్న మమతా బెనర్జీ (బెంగాల్‌), అఖిలేష్‌ యాదవ్‌ (యూపీ) ఎలా స్పందిస్తారో తెలియదు. దేవెగౌడ (కర్ణాటక), తేజస్వీ యాదవ్‌ (బిహార్‌) సాను కూలంగానే ఉన్నా... రేపు వారు దక్కించుకోగలిగే స్థానాలు పరిమితం. ఇక స్టాలిన్‌ (తమిళనాడు), ఉద్ధవ్‌ థాక్రే (మహారాష్ట్ర) కేసీఆర్‌ ఆలోచనలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా... వారిప్పుడు కాంగ్రెస్‌తో కలిసున్నారు. ఇక కేజ్రీవాల్‌ (ఆప్‌), శరద్‌ పవార్‌ (ఎన్సీపీ), మాయావతి (బీఎస్పీ), దుష్యంత్‌ చౌతాలా (జేజేపీ) భవిష్యత్తులో ఎలా వ్యవహరించనున్నారో తెలి యదు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌ (ఒడిషా) వంటి వారు తటస్థంగానే ఉంటున్నారు. ఇటువంటి అస్పష్ట పరిస్థి తుల్లో కాంగ్రెస్‌ను కాదని ఇతర పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టి, కావాల్సిన సంఖ్య తెచ్చుకోగలవా అన్నది పెద్ద ప్రశ్న. 

2014 ఎన్నికల్లో 44 స్థానాలు తెచ్చుకున్న కాంగ్రెస్‌ పార్టీ 223 చోట్ల రెండో స్థానంలో, మరో 63 చోట్ల మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల బీజేపీకి ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే! కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, అస్సాం... ఇలా పలు రాష్ట్రాలున్నాయి. ఒక రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రాంతీయ శక్తులకు ఇంకో రాష్ట్రంలో కనీస ఉనికైనా లేదు. రాయి చెన్నైలో విసిరితే వచ్చిపడే పాండిచ్చేరీలో కూడా ద్రవిడ పార్టీల ప్రాబల్యం నామమాత్రం.

కలయికలు ముందా? తర్వాతా?
రాజ్యం చేయకపోయినా... ఈ దేశంలో పలు సందర్భాల్లో కమ్యూని స్టులు ఉత్ప్రేరక పాత్ర పోషించారు. యూపీఏ–1 ప్రభుత్వం 2004– 09 మధ్య పలు మంచి నిర్ణయాలు తీసుకోవడం వెనుక కమ్యూనిస్టుల ఒత్తిడి (కనీస ఉమ్మడి కార్యక్రమం) పని చేసింది. యూపీఏ–2లో ప్రజోపయోగాలు లేకపోగా సర్కారు భ్రష్టుపట్టిపోవడానికి కారణం దూరమైన కమ్యూనిస్టుల ఒత్తిడి, ఉత్ప్రేరక పాత్ర లేకపోవడమే అని విశ్లేషకులంటారు. మరి, రేపు ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పడితే వారి పాత్ర ఏంటి? ఒకరు ఎన్నికలు ముగిశాక చూద్దాం అంటే, ఇంకొకరు ‘బీజేపీకి వ్యతిరేకంగా మీరు పోరాడండి, మేం మీకు మద్దతుంటాం’ అంటు న్నారు. మిగతా పార్టీల్లో ఎన్నికల ముందు కలిసేదెవరు? తర్వాత కలిసేదెవరు? అన్నదొక సందేహమే. నాయకత్వం ఎవరికి అన్నది ఎప్పటికీ సమస్యే! లోగడ బీజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డ ప్పుడు సంఖ్య ఉన్న ప్రాంతీయ పార్టీ నేతల కన్నా ఏకాభిప్రాయం ఉన్న వీపీ సింగ్, ఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ వంటి బలహీన నాయకులే ప్రధానులయ్యారు. కానీ, ఈసారి పార్లమెంటులో సంఖ్యాబలం ఉండే నాయకులు కీలక నాయకత్వ స్థానాన్ని వదులుకునే వాతావరణం కనిపించడం లేదు. అయినా... ఇప్పుడే ఆ చర్చ పెడితే, అది పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టిన చందం అవుతుందేమో!

వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్‌; డైరెక్టర్, పీపుల్స్‌ పల్స్‌

ఈ–మెయిల్‌ :peoplespulse.hyd@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top