Afghanistan: తాలిబన్ల మిత్రులకు అసలు పరీక్ష?

Future of Afghans Depends On Who Gets Upper Hand Over Taliban - Sakshi

తాలిబన్లు మళ్లీ అఫ్గాన్‌ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆ దేశ భవిష్యత్తు ప్రత్యేకించి అక్కడి మైనారిటీలు, మహిళలు, బాలికల భవిష్యత్తు.. తాలిబన్లలో ఎవరు ఆధిపత్యం నిరూపించుకుంటారు అనే అంశంపై ప్రధానంగా ఆధారపడి ఉంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాలతో కూడిన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్‌ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికీ, క్షేత్రస్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకూ మధ్య బోలెడన్ని తేడాలున్నాయి. ఈ తాలిబన్‌ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్‌ నేతలను గుర్తించి, వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. 

కాబూల్‌ని తాలిబన్లు కైవసం చేసుకోవడం, అఫ్గాన్‌ ప్రభుత్వం కుప్పగూలడం జరిగిన తర్వాత కాలం గుర్తించదగినంత ప్రశాంతంగా సాగుతోంది. దుకాణాలు, వ్యాపారాలను చాలా వరకు మూసివేశారు. సాధారణ పౌరులు తమ ఇళ్లలో దాక్కున్నారు. తాలిబన్లు పోలీసు ఫోర్స్‌గా వ్యవహరిస్తూ నగరాన్ని పరిరక్షిస్తున్నారు. కానీ, ఈ సాపేక్ష ప్రశాంతతలో అఫ్గాన్‌లు అసాధారణమైన వాస్తవికతను ఎదుర్కొంటున్నారు. వారు ఇప్పుడు పూర్తిగా కొత్త దేశంలో నివసిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికన్‌ సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలన్న తన నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమర్థించుకుంటూ, అమెరికన్‌ అధికారులు ఊహించిన దానికంటే వేగంగా పరిణామాలు జరిగిపోయాయని అంగీకరించారు. బైడెన్‌ అభిప్రాయం ప్రకారం, అఫ్గానిస్తాన్‌ రాజకీయ నేతలు చివరకు ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతోపాటు చేతులెత్తేసి దేశం వదిలి పారిపోయినందుకే ఇలా జరిగింది. పైగా అఫ్గాన్‌ సైన్యం కుప్పకూలిపోయిందని, కొన్ని సందర్భాల్లో పోరాటం చేయకుండానే సైన్యం కూడా చేతులెత్తేసిందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. అయితే అఫ్గానిస్తాన్‌ క్రియాశీల రక్షణ మంత్రి జనరల్‌ బిస్మిల్లా ఖాన్‌ మహమ్మది తన సైన్యం వైఖరిని సమర్థించుకుంటూ ట్వీట్‌ చేశారు. ‘వారు మా చేతుల్ని వెనక్కి విరిచి కట్టేసి, దేశాన్ని అమ్మేశారు. ఘనీ, అతడి ముఠానే దీనంతటికీ కారణం’ అని వ్యాఖ్యానించారు. 

గతవారం కాబూల్‌ వీధుల్లో జరిగిన పరిణామాలు ఏవైనా కానివ్వండి.. ఇప్పుడు మాత్రం తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న. తాలిబన్లు అంటే ఎవరు? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం 2 లక్షల కోట్ల డాలర్లకంటే ఎక్కువగా వెచ్చించి తాలిబన్లను ఓడించటానికి ప్రయత్నించింది. కానీ ఆ తాలిబన్లే ఇప్పుడు అధికారంలోకి రావడంతో అఫ్గాన్లు, వారి ఇరుగుపొరుగు దేశాల పౌరులు దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంది? తాలిబన్లు ఒక ఏకీకృత శక్తి కాదు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న బృందాల మొరటైన సమీకృత శక్తి తాలిబన్లు. అఫ్గాన్‌ మతగురువుల ప్రాబల్యంతో దోహాలో రాజకీయ కార్యాలయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరిక స్వభావం కలిగిన రాజకీయ విభాగానికి, క్షేత్ర స్థాయిలో పనిచేసే యుద్ధప్రభువులకు మధ్య గణనీయంగా వ్యత్యాసాలు ఉంటున్నాయి. ఈ తాలిబన్‌ శక్తుల్లో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశంపైనే అఫ్గాన్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే మరింత మితవాద స్వభావం కలిగిన తాలిబన్‌ నేతలను గుర్తించి వారికి మద్దతునివ్వడం ఇప్పుడు చాలా అవసరం. 

ఇక్కడ మనకు ఒక శుభవార్త. అత్యంత తాజా సమాచారం ప్రకారం, తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ అధినేత ముల్లా అబ్దుల్‌ ఘని బరాదర్‌ అఫ్గానిస్తాన్‌ నూతన నాయకుడు కావచ్చని తెలుస్తోంది. తనకు తానుగా వాస్తవికవాదిగా, అనుభవశీలిగా, ఆలోచనాత్మకమైన నాయకుడిగా బరాదర్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. పైగా తన చుట్టూ ఉన్న తాలిబన్‌ గ్రూపులన్నింటిని ఐక్యంగా ఉంచే శక్తి ఈయనకుంది. పైగా అంతర్జాతీయ శక్తులతో సమర్థంగా చర్చించే సామర్థ్యమూ ఈయనకుంది. ఆగస్టు 17న బరాదర్‌ చాలా ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టారు.

పైగా, సమీకృత ఇస్లామిక్‌ ప్రభుత్వాన్ని రూపొందించాలని తాలిబన్‌ నేతలు ప్రతిజ్ఞ చేశారు కూడా. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ తాజా ప్రకటన ప్రకారం, అలాంటి ప్రభుత్వం తాలిబనేతర అఫ్గాన్‌లను కూడా తీసుకుంటుందని, వీరిలో అందరికీ సుపరిచితులు కూడా ఉండవచ్చు. అఫ్గాన్‌ మాజీ దేశాధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ కూడా ఈ ప్రముఖులలో ఒకరు కావచ్చు. శాంతియుతంగా అధికార మార్పిడికి ఈయన ఒక సమన్వయ మండలిని కూడా ఏర్పర్చారు. ప్రస్తుతం దోహాలో ఉన్న ఈ కౌన్సిల్‌ అఫ్గానిస్తాన్‌ జాతీయ పునర్వ్యవస్థీకరణపై అత్యున్నత మండలి చైర్మన్‌ అబ్దుల్లా అబ్దుల్లా, మాజీ ప్రధాని గుల్బుద్దీన్‌ హెక్మత్యార్‌తోపాటు తాలిబన్‌ నాయకత్వంతో భేటీ కానుంది.అయితే వాస్తవానికి తాలిబనేతర ప్రముఖులు కూడా భాగమై ఉండే ఈ తరహా ప్రభుత్వంలో చాలామంది తాలిబన్‌ రాడికల్‌ శక్తులకు తావు ఉండకపోవచ్చు. అంటే ఇలా అధికారంలో భాగం కాని ఈ తీవ్రవాద శక్తులు అల్‌ ఖయిదా లేదా ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రవాద గ్రూపులతో మళ్లీ జతకట్టే ప్రమాదం కూడా ఉంది. అంతకుమించిన ప్రమాదం ఏమిటంటే, అఫ్గానిస్తాన్‌ ఏకజాతి (పస్తూన్‌) ప్రాబల్య దేశంగా మారిపోవచ్చు కూడా. ఇది మళ్లీ దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రేరేపించి తీరుతుంది.

పైగా, సమీకృత ప్రభుత్వాన్ని స్థాపించాలంటే తాలిబన్లు సైన్యా న్ని, పోలీసు బలగాన్ని బలోపేతం చేయాల్సి ఉంటుంది. అంతకుమించి తక్కిన ప్రపంచంతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవాల్సి ఉంది. రష్యా, చైనా దేశాలకే ప్రస్తుతం తాలిబన్లతో సత్వర సంబంధాలు నెలకొల్పుకునే అవకాశమున్నట్లు కనబడుతోంది. తాలిబన్‌లతో రష్యా అధికార పీఠం సత్సంబంధాలను నిర్వహిస్తోందని అఫ్గానిస్తాన్‌కి రష్యా అధ్యక్షుడి తరపున రాయబారి జమీర్‌ కుబులోవ్‌ చెబుతున్నారు. కాబట్టి అఫ్గాన్‌లో జరిగిన పరిణామాలు చూసి రష్యా కలవరపడటంలేదు. చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ ఇటీవలే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీయ్‌ లవ్రోవ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌లో తమ రెండు దేశాల చట్టబద్ధమైన ప్రయోజనాలను పరిరక్షించుకోవాల్సి ఉందని చెప్పడం బహిర్గతమైంది. అక్కడి పరిస్థితిని బట్టి తమ రెండు దేశాలు పరస్పరం బలపర్చుకోవలసి ఉంటుందని కూడా వీరు అభిప్రాయపడ్డారు.

అఫ్గానిస్తాన్‌ పొరుగున ఉన్న సెంట్రల్‌ ఆసియన్‌ దేశాలను కూడా తాలిబన్లు భాగస్వాములుగా చేసుకోవచ్చు. విస్తృతార్థంలో చూస్తే, మధ్య ఆసియా దేశాలు తాలిబన్ల నేతృత్వంలోని అప్గానిస్తాన్‌తో సహకారానికి అవకాశముందని ఆశాభావంతో చూస్తున్నాయి. పైగా అఫ్గానిస్తాన్‌ నుంచి మధ్య ఆసియా దేశాలకు కొత్త ప్రమాదాలు జరిగే అవకాశాన్ని అనుమతించబోమని బరాదర్‌ ప్రతిజ్ఞ చేశారు. పైగా మజర్‌ షరీఫ్, కాబూల్‌ గుండా ఉబ్జెకిస్తాన్‌ లోని టర్మిజ్‌ నుంచి పాకిస్తాన్‌లోని పెషావర్‌ వరకు కాబూల్‌ కారిడార్‌ నిర్మించాలంటూ ఉజ్బెకిస్తాన్‌ చేసిన ప్రతిపాదనను బరాదర్‌ స్వాగతించారు. అమెరికా వైదొలిగాక, అఫ్గాన్‌తో సహా మధ్యాసియా దేశాల మధ్య వాణిజ్య, మౌలిక వసతుల కల్పన మరింత పెరిగే అవకాశం కనబడుతోంది.

అలాగే అమెరికా, దాని మిత్ర దేశాల విధానం పైన కూడా అఫ్గాన్‌ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అఫ్గాన్‌లో అమెరికా ఘోర ‡వైఫల్యం, సైనిక బలగాల ఉపసంహరణ అంతర్జాతీయ స్థాయిలోనే అమెరికాను ఘోరంగా అవమానపర్చింది. అఫ్గానిస్తాన్‌ విధ్వంసంలో అది నిర్వహించిన పాత్ర రీత్యా, అఫ్గాన్‌ ప్రజల శ్రేయస్సుకు అమెరికా ఏమేరకు బాధ్యత వహిస్తుందన్నది కూడా ప్రశ్నే. సమీకృత∙పాలన, ఉగ్రవాద నిరోధంవైపుగా తాలిబన్లు ఏమేరకు తమ చిత్తశుద్ధిని ప్రదర్శించగలరని తాము వేచి చూస్తున్నామని జో బైడెన్‌ చెబుతున్నారు. అమెరికా, దాని మిత్రదేశాలు సాధారణ అఫ్గాన్‌ పౌరులకు చేయవలసిన సహాయం ఎంతగానో ఉంది. అలాగే అఫ్గాన్‌ పొరుగుదేశాలు, రష్యా కూడా అఫ్గాన్‌ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవలసి ఉంది. 

చైనా, రష్యా, మధ్యాసియా దేశాలు ఇలా ఆసక్తి కలిగిన అన్ని భాగస్వామ్య పక్షాలు కలిసి అఫ్గాన్‌పై ప్రత్యేక అంతర్జాతీయ సదస్సును ఏర్పర్చాలి. ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో సహాయ మందించే దేశాలు కూడా ఒక్కటవ్వాలి. అలాగే ఐరాస, వివిధ అభివృద్ధి బ్యాంకులు కలిసి అఫ్గాన్‌ పునర్నిర్మాణం కోసం ప్రత్యేక నిధిని ఏర్పర్చాలి. మధ్యాసియా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేయగల రష్యా, అఫ్గానిస్తాన్‌ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలదు. రష్యాతో సంబంధ బాంధవ్యాలతో పాశ్చాత్య ప్రపంచం కూడా ఈ మొత్తం ప్రక్రియను మెరుగుపర్చవచ్చు. 
– జూమార్ట్‌ ఒటోర్బెవ్, కిర్గిజ్‌స్తాన్‌ మాజీ ప్రధాని 
(ప్రాజెక్ట్‌ సిండికేట్‌ సౌజన్యంతో) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top