సయోధ్య సర్కారు విధి

Dileep Reddy Guest Column On Delhi Farmers Protest - Sakshi

సమకాలీనం

ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. దారులు మూసుకుపోయే పరిస్థితులు కల్పించడం తన వైపు నుంచి జరుగకూడదు. వ్యవసాయం బాగు చేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించలేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వివాదాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమస్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతులతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్ష.

వెన్నెముక శస్త్రచికిత్స సున్నితమనే భావన వైద్యవర్గాల్లోనే కాక సామాన్యుల్లోనూ ఉంది. అందుకే, వైద్యులు శ్రద్ధతో సిద్ధమౌతారు. వైద్యపరంగా అనివార్యం, రోగి అంగీకారం అయితే తప్ప శస్త్రచికిత్సకు పూనుకోరు. దేశానికి వెన్నె ముక అయిన రైతు వ్యవసాయ సమస్యల్ని పరిష్కరించేప్పుడు పాలకు లకు ఎందుకు ఆ శ్రద్ధ ఉండదు. ఇది కోటిరూకల ప్రశ్న! జనాభాలో అత్యధికులు ఆధారపడ్డ వ్యవసాయరంగంలో సంస్కరణలు వెన్నెముక శస్త్రచికిత్సకన్నా కీలకం. రైతుల ఎడతెగని పోరొకవైపు కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి మరోవైపు సమస్యను జటిలం చేశాయి. ప్రతిష్టంభన కొనసాగుతోంది. చర్చల ద్వారా పరిష్కార అవకాశాలు సజీవంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా... అటు కేంద్రం, ఇటు రైతాంగం పర స్పర విశ్వాసరాహిత్య స్థితికి చేరాయి.

సర్కారు కవ్వింపు చర్యలు ఉద్యమిస్తున్న రైతాంగాన్ని రెచ్చగొడుతున్నట్టున్నాయి. ఉద్యమంలో అసాం ఘిక శక్తులు చేరాయంటున్న సర్కారు, గణతంత్ర దినోత్సవం నాటి దుర్ఘటనల్ని ఉటంకిస్తోంది. ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రభుత్వం జవాబుదారుగా నిలవాలి. సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా అందుకు దారితీసే పరిస్థితుల్ని తానే సృష్టించుకోవాలి. వ్యవసాయం బాగుచేసి, రైతుకు రెట్టింపు ఆదాయం తెచ్చేందుకే ఈ చట్టాలు అంటున్న కేంద్రం, సదరు విశ్వాసాన్ని రైతుల్లో ఏ దశలోనూ కల్పించ లేకపోయింది. ఆందోళన కొన్ని రాష్ట్రాల్లోనే ఉందని ప్రచారం చేసినా, వ్యతిరేక భావన అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని వెల్లడవుతూ వచ్చింది. వ్యవసాయరంగ మనుగడతో నేరుగా ముడివడిన మూడు కీలక చట్టాల ప్రతిపాదన, పొందుపరచిన అంశాలు, ముసాయిదా తీరు, పార్లమెంటులో ఆమోదించుకున్న వైనం, కడకు అమలు... అన్నీ వివా దాస్పదమే!

అమలు నిలిపివేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. రైతు సందేహాలను నివృత్తిచేసే సంతృప్తికర జవాబు ఇంతవరకు రాలేదు. పైగా, తాజా బడ్జెట్‌లోని వ్యవసాయ అంశాలు దేశ రైతాంగంలో కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. తమ అనుమా నాలు అపోహలు కాదని, వాటిని ధ్రువీకరించే సంకేతాలు బడ్జెట్‌ ప్రతి పాదనల్లో పుష్కలంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. వ్యవసా యాన్ని రైతుల చేతుల్లోంచి జార్చి, కార్పొరేట్లకు ధారాదత్తం చేసే భూమికను కేంద్రం సిద్ధం చేస్తున్న జాడలే çస్ఫుటమని వారంటున్నారు. కొత్తగా వ్యవసాయ మౌలికరంగాభివృద్ధి సెస్‌ (ఎఐడీసీ) విధింపుపైనా రైతాంగానికి అనుమానాలున్నాయి.

సమాఖ్య స్ఫూర్తికి భంగం
పరిమిత వస్తువులపై వేర్వేరు శాతాల్లో ఎఐడీసీ విధింపును కొత్త బడ్జె ట్‌లో ప్రతిపాదించారు. పెట్రోలు, డీజిల్‌ పైనే కాకుండా కొన్ని ఆహార పదార్థాల దిగుమతి పైనా ఈ సెస్‌ రానుంది. అది వినియోగదారులపై భారం కాకుండా ఉండేందుకు ఆ మేర, ప్రస్తుత కస్టమ్స్, ఎక్సైజ్‌ డ్యూటీ తొలగింపో, తగ్గింపో ప్రతిపాదించారు. ఇక్కడొక మతల బుంది. సెస్‌పై కేంద్ర ప్రభుత్వానికే పూర్తి అజమాయిషీ! రాష్ట్రాలకు వాటా ఇచ్చే పనిలేదు. కస్టమ్స్, ఎక్సైజ్‌ డ్యూటీ కింద వసూలయిం దాంట్లో రాష్ట్రాలకు నిర్ణీత వాటా ఇవ్వాలి. ఇలా రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు తాజా మార్పు గండి కొడుతుందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కొన్ని రాష్ట్రాలు స్పందించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభు త్వాల జాబితాలోని అంశమైనా కేంద్రం ఏకపక్షంగా మూడు చట్టాలను తీసుకువచ్చిందనే విమర్శ ఉంది.

సదరు చట్టాల్లోని అంశాలు ప్రభావం చూపకుండా ఉండే విరుగుడు చట్టాలను దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే తీసుకువచ్చాయి. ఇది కూడా సమాఖ్య స్ఫూర్తికి భంగమే! వ్యవసాయరంగంలోకి పెద్ద మొత్తంలో ప్రయివేటు పెట్టు బడుల్ని ఆకర్శించి తద్వారా ఉత్పాదకత, సామర్థ్యం పెంచాలంటే సంస్కరణలు అనివార్యం అని కేంద్రం అంటోంది. ప్రభుత్వం ఇదే విషయం రాష్ట్రాలతో సంప్రదించి, రైతాంగాన్ని ఒప్పించి చేసి ఉండా ల్సిందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటులోనూ బిల్లుపై విపులంగా చర్చించలేదని, స్థాయీ సంఘానికో, సంయుక్త పార్లమెంటరీ కమిటీకో పంపి ఏకాభిప్రాయ సాధన చేసి ఉండాల్సిందంటారు. అలా జరిగి ఉంటే రాష్ట్రాల సహకారంతో చట్టాల అమలు సజావుగా సాగేదనేది అంతరార్థం. అది లోపిండం వల్లే ఇంతటి వ్యతిరేకత, ప్రస్తుత ప్రతిష్టంభన!

ఆధిపత్యానికి ఊతం
కొత్త చట్టాల్లో పొందుపరచిన పలు అంశాలు తమకు ప్రతికూలమని రైతాంగం అంటోంది. వాటి వల్ల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, ప్రభుత్వ కొనుగోళ్లు, వ్యవస్థీకృత మార్కెటింగ్, తద్వారా ప్రయి వేటులోనూ లభించే మార్కెట్‌ స్పర్ధ క్రమంగా కొరవడుతాయని వారి ఆందోళన. అది తప్పు, వారిది అపోహ మాత్రమే అని కేంద్రం అంటోంది. కనీస మద్దతుధర కొనసాగుతుందని, వ్యవసాయోత్ప త్తుల మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ)లు ఉంటాయని ప్రభుత్వం నమ్మ బలుకుతోంది. ప్రయివేటు రంగం రాకవల్ల పోటీ ఏర్పడి వ్యవసాయో త్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుందని, రైతులకు మేలని సర్కారు వాదన.

బడా వ్యాపారులు రిటేల్‌ వస్తు విక్రయరంగంలోకి వచ్చి, చిన్నా, చితకా దుకాణాలు, నాలుగు చక్రాల బళ్లపై విక్రయాలు లేకుండా చేసి, పూర్తి ఆధిపత్యం సాధించిన తర్వాత తమకు అను కూలంగా ధరల్ని నియంత్రించిన ఉదాహరణలు కోకొల్లలు. తమది అపోహ కాదని, ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రయివేటు ఆధిపత్యంలోకి వ్యవసాయంరంగం చేజారాక తలెత్తే అనర్థాలకు అంతుండదని రైతు సంఘాలంటున్నాయి. ఇదంతా ఓ పెద్ద కుట్ర అని, సంస్కరణల ముసుగులో ప్రయివేటుకు తివాచీలు పరచి, క్రమంగా రైతును నిస్స హాయ స్థితిలోకి నెడతారనేది రైతు సంఘాల భయాందోళన. ప్రయి వేటు పెట్టుబడుల్ని పెద్ద మొత్తాల్లో ఆకర్శించి, ఆహ్వానించకుండా వ్యవ సాయాన్ని లాభసాటిగా మార్చలేమని ప్రభుత్వం చెబుతోంది. మొదట అలా కనిపించినా, రాను రాను అసంఘటిత రైతాంగాన్ని మరింత దీనస్థితిలోకి నెడుతుందనే అభిప్రాయం అత్యధికుల్లో ఉంది.

బడ్జెట్‌లోనూ కవ్వింపు ప్రతిపాదనలా?
వ్యయ ప్రయాసలకోర్చి, రైతాంగం ఎడతెగని ఉద్యమం చేస్తున్నా, వారిని అనునయించి మచ్చిక చేసుకునే సర్కారు ప్రయత్నమేదీ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో లేదని వ్యవసాయ నిపుణులంటున్నారు. పైగా కొన్ని కవ్వింపు చర్యల సంకేతాలున్నాయనేది వారి భావన! వ్యవసాయ రంగానికి నిధులు పెంచకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. రుణ సదుపా యాన్ని స్వల్పంగా పెంచినా ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద రైతాంగానికి అందిస్తున్న పెట్టుబడి సహాయానికి కత్తెర వేశారు. గత సంవత్సరపు నిధి రూ. 75 వేల కోట్ల నుంచి ఈ సారి రూ. 65 వేల కోట్లకు (13 శాతం) తగ్గించారు. రైతు సంక్షేమ వ్యయం లోనూ 8.5 శాతం కోత విస్మయం కలిగించింది. కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యానికి సర్కారు దారులు పరుస్తోందన్న విమర్శకులే, తాజా బడ్జెట్‌లో కేంద్రం ఆ దారుల్ని మరింత చదును చేయజూస్తోందని ఆరోపిస్తున్నారు.

ప్రయివేటు శక్తుల ఇష్టారాజ్యానికి కొత్తచట్టాల పక డ్బందీ అమలుకు భూమిక, అదికూడా ప్రజాధనంతో సిద్ధం చేస్తోం దనేది అభియోగం. వ్యవసాయ మౌలికరంగాభివృద్ధే సెస్‌ సమీకరణ వెనుక ఉద్దేశం. కానీ, ఈ నిధుల్ని ఎక్కడ? ఏ మౌలిక వ్యవస్థ ఏర్పా టుకు? ఏ ప్రాతిపదికన వెచ్చిస్తారో స్పష్టత ఉండాలని రైతాంగం కోరు తోంది. రోడ్లు వేస్తారా? గిడ్డంగులు కడతారా? యాంత్రికత పెంచు తారా? ఏం చేస్తారు? తద్వారా ఎవరికి ప్రయోజనం, రైతుకా, పరిశ్ర మకా? వ్యాపారులకా? స్పష్టత ఉండాలనేది విమర్శకుల వాదన. వివా దాస్పద చట్టాల జన్మస్థానమైన పార్లమెంటు వైదికనుంచైనా ఈ సమ స్యకు పరిష్కారం లభించాలని, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగాలని రైతు లతో పాటు ఇతర ప్రజాస్వామ్యవాదులంతా కోరుకుంటున్నారు.

దిలీప్‌ రెడ్డి 
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top