అభిప్రాయం
భారత ప్రధాన న్యాయమూర్తి మే 15న ఓ కేసు విచారణ సందర్భంగా నిరుద్యోగుల్ని బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారు. మొత్తం యువత గురించి తాను ఆ మాటలు అనలేదనీ, ప్రత్యేకంగా కొందరు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశాననీ రెండు రోజుల తరువాత వారు ఒక వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, బొద్దింకలు అనే మాటను జెన్–జీ వైరల్‌గా మార్చేసింది. ‘అవును. మేము బొద్దింకలమే’ అని ప్రకటించుకుంది. ఇది కేవలం మీమ్ రాజకీయమా? వ్యవస్థలపై యువతరంలో పేరుకుపోతున్న అసహనానికి కొత్త రూపమా?
ఉద్యోగాలులేని యువతరం సోషల్ మీడియా, ఆర్టీఐ యాక్టివి జంలోకి వచ్చి కొందర్ని టార్గెట్ చేస్తున్నారని చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. ‘బొద్దింకలు’ అనే పోలిక సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఇచ్చిందనీ, ప్రజాస్వామ్యంలో అసమ్మతి శత్రుత్వం కాదనీ అనేకమంది స్పందించారు. మనకు నచ్చనివాళ్ల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా మనం గౌరవించి తీరాలి. లేకుంటే భావప్రకటనా స్వేచ్ఛను మనమే విశ్వసించడం లేనట్టే అనే అర్థంలో అమెరికా సామాజిక కార్యకర్త నోమ్ చామ్‌స్కీ మాటలు మళ్లీ వైరలయ్యాయి.
ఉద్యమకాలంలో అవమానం కూడా ఒక్కోసారి ఆత్మగౌరవ గుర్తింపుగా మారిపోతుంది. నగ్జల్బబరీలో ఆదివాసుల సాయుధ పోరాటాన్ని ఆరంభించినవాళ్లు సీపీఐ–మార్క్సిస్టు–లెనినిస్టులు. గిట్టనివాళ్లు వాళ్లను నక్సలైట్లు అని విమర్శించేవారు. ‘అవును మేము నక్సలైట్లమే’ అంటూ వాళ్లు సగర్వంగా ప్రకటించుకోవడం మొద లెట్టారు. ‘మేము మాల’, ‘మేము మాదిగ’ వంటి ఆత్మగౌరవ ప్రకట నల్ని కూడా చూశాం. ఇది సోషల్ మీడియా యుగం కనుక వేగం మరింత ఎక్కువ.‘బొద్దింక’ కొత్త రాజకీయ మీమ్‌గా మారింది.
బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అభిజీత్ దీప్కే సరదాగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అంటూ ఒక పోస్టు పెట్టాడు. అది వైరల్ అయ్యింది. కొన్ని గంటల్లోనే ఆ పార్టీలో వేలమంది చేరి పోయారు. ఇదేమీ రాజకీయ పార్టీ కాకపోవచ్చు కానీ, ఈతరం భావోద్వేగాలకు అద్దం పడుతోంది. పాత రాజకీయ భాష కొత్త యువతను ఆకట్టు కోవడం లేదు. అందుకే మీమ్స్, వ్యంగ్యం, డిజిటల్ క్యాంపెయిన్లు కొత్త రాజకీయ వ్యక్తీకరణలుగా మారుతున్నాయి.
బొద్దింకల గురించి ఎన్నో కథలున్నాయి. ‘న్యూక్లియర్ యుద్ధం వచ్చినా చివరికి మిగిలేది బొద్దింకలే’ అనే మాట దశాబ్దాలుగా ప్రచారంలో ఉంది. జీవశాస్త్ర పరంగా చూసినప్పుడు బొద్దింకలు అద్భుతమైన జీవన సామర్థ్యం కలిగిన జీవులు. కోట్ల సంవత్స రాలుగా ఇవి అంతరించకుండా కొనసాగుతున్నాయి. మంద్ర స్థాయిలో రేడియేషన్‌ను తట్టుకునే సామర్థ్యం కూడా వీటికి ఉందన డానికి సైంటిఫిక్ ఆధారాలున్నాయి. అందుకే ఇప్పుడు యువత ‘మమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడినా మేము బతుకుతాం, తిరిగి లేస్తాం’ అని ధీమాగా అంటోంది.
సరికొత్త పోరాట వేదికలు
ఒకప్పుడు ఉద్యమాలు వీధుల్లో మొదలయ్యేవి. ఇప్పుడు అవి మీమ్ పేజీల్లో మొదలవుతున్నాయి. ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌లు, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్టులు– ఇవే ఇప్పుడు కొత్త పోరాట వేదికలు. అమెరికాలో ‘వాల్ స్ట్రీట్‌ను ఆక్రమించండి’, హాంగ్‌కాంగ్ ఉద్యమాలు, అరబ్ స్ప్రింగ్ – అన్నీ డిజిటల్ మీడియా ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా జెన్–జెడ్ అదే దారిలో వెళ్తోంది. వ్యంగ్యం ఇప్పుడు వినోదం మాత్రమే కాదు, అది ఒక నిరసన గళం.
సోషల్ మీడియాలో యువత అంటున్నదేమిటీ?– ‘ప్రశ్నించడం దేశద్రోహం కాదు.’ అది నిజమేకదా? కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ఎన్నికల బరిలోనికి దిగుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం; ఇది ఒక తరపు అసంతృప్తికి అద్దంపడుతోంది. వ్యవస్థల పట్ల యువతలో పెరుగుతున్న ఆక్రోశాన్ని ఇది వ్యక్తం చేస్తోంది. చరిత్ర చాలా రకాలుగా పునరావృతం అవుతోంది. ఈసారి అది ప్రహసనంగా కనిపించవచ్చుగానీ దాని వెనుక తీవ్ర ఆక్రోశం దాగుంది. దాన్ని గుర్తించడం ముఖ్యం.
- డానీ
వ్యాసకర్త సమాజ, రాజకీయ విశ్లేషకులు


