CP Brown: తెలుగు సాహితికి వెలుగు సూరీడు

CP Brown 225 Birth Anniversary Year: Father of Telugu Renaissance of Telugu Language and Literature - Sakshi

తెలుగు భాష సాహిత్యం ఈరోజు బతికి బట్టకడుతుందంటే సీపీ బ్రౌన్‌ నిర్విరామ కృషి, సమర్పణ, తపన, త్యాగం, అంకిత భావమే కారణం. బ్రిటిష్‌ దంపతులైన డేవిడ్‌ బ్రౌన్, కౌలీలకు కలకత్తాలో 1798 నవంబర్‌ 10న బ్రౌన్‌ జన్మించారు. తండ్రి మతాధికారి. కలకత్తాలోని ఫోర్ట్‌ విలియం కళాశాలలో బహు భాషాపండితుడు. తండ్రి వద్దే హీబ్రూ, అరబిక్, పర్షియన్, హిందుస్థానీ, సిరియక్, గ్రీకు భాషలు నేర్చారు. బాల్యంలో తండ్రి సేకరించే దేశీయ పుస్తకాలను పరిష్కరించి, శుద్ధ ప్రతులు తయారుచేయటంలో సహాయం చేసేవారు. అది ఉత్తరోత్తరా తెలుగు సాహిత్య ప్రచురణకు దోహదం అయింది. 1817లో మద్రాస్‌ సివిల్‌ సర్వీసులో చేరేవరకు ఆయనకు తెలుగు భాష ఒకటి ఉందనే విషయం తెలియదు. మద్రాస్‌ ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌ కళాశాలలో వెలగపూడి కోదండరామ పంతులు దగ్గర అక్షరాభ్యాసం చేశారు. 

ఫ్రెంచ్‌ కాథలిక్‌ మతగురువు అబెదుబె రాసిన ‘హిందూ మేనర్స్‌ కస్టమ్స్‌ అండ్‌ సెర్మనీస్‌’ అనే పుస్తకంలో వేమనను గురించిన వివ రాలు తెలుసుకున్నారు. వేమన పద్యంలోని భాష, భావం, వేగం, తీవ్రత, మూఢవిశ్యాసాల వ్యతిరేకత... అన్నీ కలగలిసిన గొప్ప కవి అని బ్రౌన్‌కు అర్థమైంది. అనంతరం వేమన పద్యాలు 2500 వరకు సేకరించారు. వాటిల్లో ఉత్తమమైన 693 పద్యాలను ఎంపికచేసి పరిష్కరించి, ఇంగ్లిష్‌లోకి అనువదించి ‘వెర్సేస్‌ ఆఫ్‌ వేమన’ పేరుతో 1829లో ప్రచురించారు. ఆపై తెలుగులో ఉన్న భారత, భాగవత, రామాయణాలు, కావ్యాలు, చరిత్రలు, జానపద కథలు, శతకాలు మొదలైనవన్నీ సేకరించారు. పరిష్కరణ, శుద్ధప్రతులు తయారు చేయటంకోసం పండితులను, లేఖకులను తన స్వంత డబ్బులతో నియమించుకున్నారు. కడపలో కలెక్టర్‌గా పనిచేసే రోజుల్లో తన బంగళాలోనే తెలుగు గ్రంథ పరిశోధన, పరిష్కరణ చేశారు. అందుకే దాన్ని ‘బ్రౌన్‌ కాలేజి’ అని పిలిచేవారు. బ్రౌన్‌ గ్రంథ రచనల్లో తోడ్పడిన పండితుల్లో జూలూరి అప్పయ్య, వఠ్యం అద్వైత బ్రహ్మయ్య, మన్నెం కనకయ్య, గరిమెళ్ల వెంకయ్య, వారణాసి వీరాస్వామి, తిరుపతి తాతాచార్యులు వంటి వారున్నారు. 

కడప, గుంటూరు, మచిలీ పట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో బ్రౌన్‌ వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలోనే పేదపిల్లలు కోసం ధర్మబడు లను ప్రారంభించారు. 1821లో కడపలో రెండు, 1823లో మచి లీపట్నంలో రెండు, 1844లో మద్రాస్‌లో ఒకటి చొప్పున ధర్మ బడులను తెరచి, కేవలం పేద విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌ నేర్చుకునేలా చేశారు. 

బ్రౌన్‌ సేకరించిన గ్రంథాల్లో సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడం, మరాఠి, తమిళ భాషలకు సంబంధించిన మొత్తం 5,751 గ్రంథాలున్నాయి. వీటిలో కేవలం తెలుగు భాషకు చెందినవి 2,440 ఉన్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం, కావ్యాలు, శతకాలు, వ్యాకరణం, తెలుగు–ఇంగ్లిష్‌–తెలుగు నిఘంటువులు (బ్రౌణ్య నిఘంటువు) అచ్చువేసి తెలుగు భాష సాహిత్యాన్ని సుస్థిరం చేశారు. భాషలో కొన్ని మార్పులూ చేశారు. సాధు–శకట రేఫల వినియోగం, క్రావడి, వట్రుసుడి, ‘చ, జ’ల మార్పులు వంటివి ప్రధా నంగా ఉన్నాయి. తెలుగు భాషలో అంతకుముందు లేని విరామ చిహ్నాలు, పేరాల విభజన, పుటల సంఖ్యలను ప్రవేశపెట్టారు.

తెలుగు బైబిలు అనువాదంలో కూడా బ్రౌన్‌ ముద్ర ఉంది. బాప్టిజం, ఆమెన్, హల్లెలూయ, సబ్బాతు వంటి పదాల ధార్మికార్థం చెడకుండా యథాతథంగా, తత్సమాలుగా చేశారు. అలాగే వైన్‌ అనేది క్రైస్తవులకు పవిత్రమైనది. అది కేవలం పులియని ద్రాక్షరసం. అందుకే ద్రాక్షరసం అని గౌరవపదంగా అనువదించారు. తెలుగు, బైబిల్‌ లోనూ క్రైస్తవుల వ్యావహారికంలోనూ పలికే సిలువ, పరిశుద్ధాత్మ, స్తోత్రం, స్తుతి, సువార్త, సన్నుతి, కలుగునుగాక, ప్రభువు నామమునకు, నీకు స్తోత్రం లాంటి పదాలు నేటికీ ప్రామాణికంగా నిలిచాయి. తెలుగు బైబిలు అనువదించి, పరిశీలనార్థం లండన్‌కు పంపించారు. ఆ గ్రంథాన్ని గోర్టిన్, ప్రిబెట్‌ అనేవాళ్లు 1857లోనూ, వార్ట్‌లా, జాన్‌హే అనేవాళ్లు 1860లో తమ పేర్లతో ముద్రించుకున్నారు. ఎక్కడా బ్రౌన్‌ పేరును ప్రస్తావించనే లేదు.

భారతదేశంలో ఉన్న నలభై ఏళ్లలో తాను పరిష్కరించి, ప్రచురించిన పుస్తకాలను బ్రౌన్‌  మద్రాస్‌ గ్రంథాలయానికి ఇచ్చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం లండన్‌లో కొంతకాలం తెలుగు ఆచార్యుడిగా పని చేసిన కాలంలోనూ పరిష్కరించిన గ్రంథాలను ఇండియా ఆఫీస్‌ లైబ్రరీకి బహూకరించారు. బ్రౌన్‌ రచనలన్నీ రెవరెండ్‌ టైలర్‌ 1857, 1860, 1862 సంవత్సరాల్లో మూడు సంపుటాలుగా తయారుచేసి, ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌ గెజిట్‌ ప్రెస్‌లో ముద్రించారు. 

ఈ తెలుగు వెలుగుల సూరీడు 1884 డిసెంబరు 12న వెస్ట్‌బార్న్‌ గ్రోవ్‌లో తుది శ్వాస విడిచారు. ఆయన జన్మించి నేటికి 225 సంవత్సరాలు. ఆయన ఒక్క చేతిమీదుగా తెలుగు సాహిత్య సంపద అంతా రెక్కలు విప్పి విహరించింది... మనకు కీర్తిప్రతిష్ఠలను తీసుకొచ్చింది. తెలుగు ప్రజలకు ఆయన ప్రాతఃస్మరణీయులు. (క్లిక్ చేయండి: రిషి సునాక్‌ను బ్రిటన్‌ ప్రధానిగా చేయడం వెనుక..)


- ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి 
ప్రముఖ సాహితీ పరిశోధకులు 
(సీపీ బ్రౌన్‌ 225వ జయంతి సంవత్సరం)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top