BJP: దక్షిణాదిలో బలపడుతోంది

BJP Advancing Steady Pace in South India: Raghuram Purighalla - Sakshi

అభిప్రాయం

దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతాపార్టీ దృష్టి అని తరచుగా మనం వింటున్నాం, వార్తలను చదువు తున్నాం. భారతీయ జనతాపార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటక, పాండిచ్చేరిలో మాత్రమే అధికారంలో ఉంది. అయితే పాండిచ్చేరి చాలా చిన్న రాష్ట్రం. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బలం పెంచుకోవా లనీ, ఇక్కడ కూడా భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చెయ్యాలనీ అనేక సంవత్సరా లుగా భాజపా అనుకుంటోంది.

కేరళ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో భాజపా గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించింది. అయితే సీట్ల విషయంలో ఆశించిన ఫలితాలు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం పెంచుకోగలిగింది కానీ సీట్లు మాత్రం రాలేదు. ఇప్పుడు పట్టుదలగా 2024 ఎన్నికల కోసం గట్టి ప్రయత్నాల్లోనే ఉంది. రెండు బలమైన కూటములైన యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌ మధ్య భాజపా ఈసారి తన సత్తా చాటాలని చూస్తోంది. 

తమిళనాడు విషయానికి వస్తే 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో భంగపడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుని నాలుగు శాసనసభా స్థానాలను గెలుచుకొంది. ముగ్గురు మాజీ రాష్ట్ర అధ్యక్షులకు కేంద్రంలోనూ, ప్రభుత్వంలోనూ సముచిత స్థానం కల్పించింది. రాష్ట్ర పార్టీ పగ్గాలను ఐపీఎస్‌  అధికారీ, యువకుడూ అయిన అన్నామలైకు అప్పగించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కేంద్ర నాయకత్వం. జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకే బలహీనపడటం తెలిసిందే. ఆ విధంగా ఏఐఏడీఎంకే స్థానాన్ని భాజపా భర్తీ చెయ్యాలని చూస్తోంది. 5 దశాబ్దాలుగా ప్రాతీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీ ఎంకేలు ఏలిన చోట జాతీయ పార్టీగా భాజపా... యువ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలో తమిళనాడులో దూసుకెళుతోంది.   

ఆంధ్రప్రదేశ్‌ విషయంలో రెండు ప్రాంతీయ పార్టీలయిన – వైసీపీ, టీడీపీల మధ్య ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని మాత్రమే గెలిచినప్పటికీ 2019 పార్లమెంట్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు షాక్‌ ఇచ్చి ఏకంగా 4 పార్లమెంట్‌ స్థానాలను కైవసం చేసుకొంది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికలలో మరో రెండు శాసనసభ స్థానాలను గెలిచి మొన్న మునుగోడులో టీఆర్‌ఎస్‌కు గట్టి సవాల్‌ విసిరింది. 

కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ఒకవైపు, యువ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ తన పాదయాత్రతో మరోవైపు కేసీఆర్‌కు చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు డా. కే. లక్ష్మణ్‌ను రాజ్యసభ సభ్యుడిగానూ, ఓబీసీల జాతీయ అధ్యక్షుడి గానూ చేశారు. డీకే అరుణ, ఎంపీ అరవింద్, ఈటెల రాజేందర్‌ లాంటి వారు ఈసారి ఎలాగైనా తెలంగాణలో కాషాయ జెండా ఎగుర వెయ్యాలని తీవ్రంగా పనిచేస్తున్నారు. మొత్తం మీద దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ స్థిరమైన వేగంతో ముందుకు సాగుతోంది. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!)


- రఘురామ్‌ పురిఘళ్ళ 
బీజేపీ సీనియర్‌ నాయకులు 
raghuram.bjp@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top