వరదుడు నా రాముడు | Writer is Chilukuri Rama Umamaheshwara Sharma talks about Lord Sri Ram | Sakshi
Sakshi News home page

వరదుడు నా రాముడు

Mar 27 2026 2:51 AM | Updated on Mar 27 2026 6:14 AM

Writer is Chilukuri Rama Umamaheshwara Sharma talks about Lord Sri Ram

భద్రాద్రి రాముడు ఇలవేల్పు కానిదెవరికి? సీతారాముల కల్యాణం కన్నుల పండువగా కాంచనివారెవరు? రఘువీరుడు... దాశరథి... ఆ సీతారామచంద్రమూర్తి
ప్రతి హృదిలో మనసు గుడిలో పదిలమూర్తి. అనుక్షణం తలుచుకునే జన్మ జన్మాంతర అనుబంధాన్ని పంచుకుంటున్నారు రచయిత చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ.

అరవై నాలుగేళ్ళ క్రితం భద్రాచలం పమిడిఘంటం వారి అంబసత్రంలో ఓ రాత్రి హడావిడిగా పుట్టేశాన్నేను మా అమ్మ తొలి పురిటికి తన పుట్టింటి దార్లో ఉండగానే. రాముడితో అంతకు మునుపు పరిచయం తక్కువ నాకు. పుట్టుకతోనే మొదలైంది మా స్నేహం, ఆయన బాధ్యత. చిరు్రపాయంలో ఇప్పపువ్వులతోపాటు తునికిపళ్ళు తనకు తినిపించిన నన్నెలా మరవగలడు నా రామన్న!

ఓ రెండున్నర దశాబ్దాలు నే తిరిగిందంతా మా రాముడు నడయాడిన పర్ణశాల ప్రాంతమే. పదోఏట న్యుమోనియా వచ్చినప్పుడు నాకు ముందుగా రాముడి దర్శనం చేయించి, ఆ తర్వాతే డాక్టరు పువ్వాడ నాగేశ్వరరావు గారికి చూపించింది అమ్మ. పదహారేళ్ళ ప్రాయంలో ఓ రాత్రి గుడివీధి ΄÷డిచేటివారి వరండాలో గడిపి మర్నాడు ఉదయమే నే చేసుకున్న రామచంద్రుడి దర్శనం అప్పటికి చివరిదన్నట్టు గుర్తు. 

ఆ తర్వాత నాస్తికత్వం వగైరాలు... మా అబ్బాయి సిద్దార్ధ ఎనిమిదో నెలలో పదిహేను రోజులపాటు టైఫాయిడ్‌ బారిన పడ్డప్పుడు నా బాల్య స్నేహితుడు తిరిగి మదికొచ్చేంత వరకూ. ఉత్తరోత్తరా కీర్తిశేషులు వైయస్సార్‌గారి సెక్యూరిటీలో భాగంగా సీతమ్మతో మా రాముడి కళ్యాణం శాంతా సమేతంగా అతి దగ్గరగా చూసిన భాగ్యం. ఏతావాతా, భద్రాద్రి రాముడు నన్ను తన భుజాలను ఎక్కించేసుకున్నాడు పుట్టీ పుట్టగానే. అలాగని ఆయనంటే నాకు అపారమైన భక్తా అంటే అదీ కాదు. అదో స్నేహం, ఆత్మీయ భాషణం, నేనున్నానన్న భరోసా; అవును, తను చూస్తున్నాడన్న కించిత్‌ భయం కూడా.

ఒకానొక ఉద్యోగపర్వంలో వెనక నుంచి నా చెవిని తాకుతూ చిమ్ముకొచ్చిన వేడినీ, నా మీదికి దూసుకొస్తున్న ఒక విషనాగునీ పక్కదారి పట్టించిన వైనం మా నేస్తుడిదే. పూలమ్మిన చోటనే ముత్యాల తలంబ్రాలు పంచే అదృష్టం నాకొసగిన ఘనత ఆ ఆపన్నహస్తానిదే. విజయవాడలో పని చేస్తున్నప్పుడు బాపుగారు ఓ రోజు ఫోన్లోనే ‘మీకేం బొమ్మ కావాలండీ’ అనడిగినప్ప్పుడు ‘అయ్యా, రాముడిదే’ అనేశాను మరో ఆలోచన లేకుండా. ‘అర నిమిషము నిన్నెడబాసియు నేనాపద పడలేనురా వరదా’ అనెరిగిన వాణ్ణి. నెల తిరక్క ముందే వారు ప్రేమతో గీసిచ్చిన గుహుడి చేతిలో దాసజన సమేత భద్రాద్రి సీతారామచంద్ర స్వామి మా ఇంట్లో ఎప్పటికీ స్థిరోభవ, వరదోభవ! 

ఇక, సుమారు మూడున్నరేళ్ళపాటు తిరుమలలో ఉన్నప్పుడు వేంకటేశ్వరస్వామి దర్శనం ‘సబేరా’ ముందున్న రాతిస్తంభం కింద భాగంలో వేంచేసి ఉన్న సీతారామలక్ష్మణుల దర్శనం వినా పూర్తయ్యేది కాదు. ఏములాడ రాజన్నలో, బెజవాడ కనకదుర్గమ్మ లో, తిరుమల వేంకటేశ్వరుడిలో నాకు సదా దర్శనమిచ్చేది భక్తమందార, రఘువీర శ్రీరామచంద్రమూర్తే. మౌలాలీ గుట్ట మీది దర్గాలో హజ్రత్‌ అలీగారి చేతిముద్రని తాకి, వారికి మోకరిల్లినప్పుడు నా మనస్సులో మెదిలేది నిజ జనావన కాముడు, ఫాలలోచన సహితుడు నా దాశరథే.

మొన్నీమధ్య నన్ను చూస్తూనే రామచంద్రుyì  చెవిలో గుసగుసలాడింది సీతమ్మ.. ఒళ్ళోకూర్చునే.. మీవాడొస్తున్నాడు, ఇంక నేనేం గుర్తుంటాను స్వామీ మీకని. స్వామివారు ‘మనం కాక వాడికింకెవరున్నారు చెప్పు’ అన్నారు. మరి వాడి చేతికంటిన ఆ ఎర్ర మరక మాటేమిటి అని తనలో తానే అనుకొన్నది నా తల్లి– భర్తకి ఈతని విషయంలో ఏ ఫిర్యాదూ పట్టదని. స్నేహానికి తలొంచానా రోజు, తల పంకించాడు మా తండ్రి.

ఇంతకీ నేను నా రాముణ్ణేమి కోరుతున్నట్టు? ఏది అడిగితే అది నేనైనా మీరైనా ఇట్టే ప్రసాదించే ఘనశ్యాముడాయన. నేస్తుడి నాడి పట్టినవాణ్ణి కనుక నేనెప్పుడూ ఏదీ అడిగి ఎరుగనతన్ని. అన్నీ ఇచ్చేశాడాయన, ఇస్తూనే ఉన్నాడా వరదుడు, కొండొకచో తానే అంబై పలుకుతూ కూడా! కంచర్ల గోపన్న గారైనా అప్పుడెప్పుడో సీతారామస్వామీ నే చేసిన నేరమదేమీ అంటూ కినుక వహించారేమో కానీ, నేనెన్నడూ నా రాముని మీద అలిగిందీ లేదు, ఆయన్ను కోపగించుకున్నదీ లేదు.. కలలో కూడా... ఏం జరిగినా అది నీ మహిమో, నా ప్రారబ్దమో అనుకుంటూ.

కానీ ఇప్పుడెందుకో, ‘రామా, నువ్వు కొంచెం చిరుకోపం నీ మొహాన పూసుకోవయ్యా, నా తరఫున కూడా, ‘పాతకములతి పామరత్వమున ప్రీతి తోడ చేసెడి వారిపై’ అనాలనిపిస్తోంది.

‘దీనత్రాణ దీక్షను మరచెదో పదిలమో రామ బహుపరాకు’ అనవలసింది, ‘దాచుకొను నీ సొమ్మది పదిలమో రామ బహుపరాకు’ అంటూ నా రామ భద్రునికి హెచ్చరిక చేయవలసి వస్తోంది.

అమ్మయ్యో... ధర్మస్వరూపుడివి, నీకు చెప్పదగిన వాడినా స్వామీ, మన జన్మజన్మాంతర అవిచ్ఛిన్న మైత్రి నాపై ఈ బాధ్యత మోపుతున్నది కానీ...
శ్రీరామా... అదిగో శివధనుర్భంగ సమయాన నీవైపు పవిత్రమగు శృంగారభావ మొడిసిపట్టిన చంద్రముఖి మాయమ్మ సీతమ్మ చూపు, చెరుకు గడవోలె నడిమికి విరిగి సర్వలోకములలో మ్రోగుతున్న ఆ ధనువు, రేపటి లగ్నంబునందె నాలుగు ముళ్ళు పడనిమ్మంటున్న దశరథ మహారాజు, నవ మనోజ్ఞ కళ్యాణ మంటపం, వశిష్ట వామదేవ శతానంద గాధేయులు, తట్టలో సీతమ్మను తెచ్చిన మేనమామలు, మా అమ్మ దోసిట్లో పద్మరాగమణులు, మరుక్షణపు మల్లెలు, తదుపరి ఇంద్రనీల మణులు, ప్రతి చైత్రశుద్ధ నవమికి వితతంబుగ తెలుగు నేల విరసెడి జల్లులు... చిరుజల్లులు చిటపటలు... ఎక్కడ చూసినా రఘు కులేశుడవు నువ్వేనయ్యా... ఆగాగు, నేనొస్తున్నాను ప్రభూ, తడవనివ్వను నిన్ను, నా చిన్న తాటాకు గొడుగు తెస్తున్నానుండు... మా సీతమ్మ తల్లికీ, నీకూ, భక్తజన సంద్రానికీనూ...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement