పాడు పొగతో మూడింతల సెగ | World No Tobacco Day 2026: How Smoking And Chewing Tobacco Hack | Sakshi
Sakshi News home page

నో టొబాకో డే: పాడు పొగతో మూడింతల సెగ

May 31 2026 9:09 AM | Updated on May 31 2026 9:09 AM

World No Tobacco Day 2026: How Smoking And Chewing Tobacco Hack

సిగరెట్‌ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్‌గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ  దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల నష్టాలేమిటో చూద్దాం.

ఫస్ట్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌... నష్టాలు..
సిగరెట్‌ లేదా పొగతాగడం అలవాటున్న వ్యక్తి... ఆ దుష్ప్రభావాల వల్ల తానే స్వయంగా నష్టపోతాడు. ఆ అలవాటుకు తన ప్రాణాన్నే పణంగా పెడతాడు. తల మీద ఉన్న వెంట్రుకలూ, తలలోని కీలక అవయవాలు మొదలుకొని కాలూ, కాలి వేలి వరకు పొగాకు వల్ల ప్రభావితం కాని అవయవమంటూ ఏదీ ఉండదు. 

తలలోని అవయవాలూ, మెడ (హెడ్‌ అండ్‌ నెక్‌) క్యాన్సర్లు మొదలుకొని ఊపిరితిత్తులూ, కడుపు... ఇలా ప్రతి అవయవమూ క్యాన్సర్‌తో ప్రభావితం కావడానికి కారణం... పొగాకులో దాదాపు 5000 హానికరమైన రసాయనాలు దేహానికి హాని చేస్తాయి. అంతేకాదు... దాదాపు 60 రకాల రసాయనాలైతే నేరుగా క్యాన్సర్‌ను కలగజేస్తాయి కాబట్టి వాటిని కార్సినోజెన్స్‌ అని కూడా పిలుస్తారు. ఇలా  తానే స్వయంగా నష్ట΄ోతున్నందున దీన్ని ఫస్ట్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ అంటారు.

సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ – అనర్థాలు...
నేరుగా పొగతాగే వ్యక్తితోపాటు పక్కనే ఉండే స్నేహితులకూ, తనతోపాటు గడిపే మిత్రులతోపాటు జీవిత భాగస్వామి పొగపీల్చడాన్ని సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ అంటారు. దీంతో వాళ్లు నేరుగా సిగరెట్‌ తాగక΄ోయినప్పటికీ పొగాకు దుష్ప్రభావాలకు లోనవుతారు. ప్రధానంగా జీవిత భాగస్వామీ, పిల్లలూ ఇలా ప్యాసివ్‌ స్మోకింగ్‌కు గురవుతారు. మరీ ముఖ్యంగా భర్త తాలూకు ఆ అలవాటు భార్య గర్భధారణ విషయంలోనూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. 

భర్త తాలూకు సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంతాన సాఫల్యంపై దాని ప్రభావమూ పెరుగుతుంది. భర్త పొగతాగే అలవాటుతో భార్య జీవరసాయనాల్లో మార్పు వచ్చి, అండాల సంఖ్య తగ్గడం జరుగుతుంది. ఒకసారి అండాల సంఖ్య తగ్గితే వాటిని తిరిగి పొందడం సాధ్యంకాదు. సిగరెట్‌ పొగలో ఉన్న రసాయనాల వల్ల మహిళలకు చాలా త్వరగా మెనోపాజ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. నెలలు నిండకముందే బిడ్డపుట్టడమూ, అలా పుట్టే పిల్లల్లో బరువు చాలా తక్కువగా ఉండటమూ, ఆ పిల్లలకు భవిష్యత్తులో డయాబెటిస్, గుండెజబ్బులు, స్థూలకాయం వచ్చే అవకాశాలు పెరగడమూ జరుగుతాయి.

థర్డ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌... దుష్ప్రభావాలు...
నేరుగా సిగరెట్‌ కాల్చేవారిది ఫస్ట్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌. మన స్నేహితుడో లేదా కుటుంబసభ్యుడైనందువల్లనో ఆ అలవాటు ఉన్నవారి నుంచి పొగ పీల్చడాన్ని సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్‌ అంటారు. ఇక ఓ వ్యక్తి మూసి ఉన్న ఓ గదిలోనో లేదా లిఫ్ట్‌లోనో కొద్దిసేపటి కిందట సిగరెట్‌ కాల్చి వెళ్లిపోయినప్పటికీ... చాలాసేపటి తర్వాత ఎవరైనా ఆ గదిలోకి వెళ్తే అప్పటికీ ఆ సిగరెట్‌ వాసన వస్తుండటం, అక్కడ ఉన్న నుసిలాంటి ఇతరత్రా చాలా సూక్ష్మమైన వ్యర్థాలు ఆ గదిలోకి వెళ్లినవారి బట్టలకు అంటుకుపోవడం, మన బట్టల్ని వాసన చూసినవారు కూడా సిగరెట్‌ వాసనను పసిగట్టడం... ఇవన్నీ ‘థర్డ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌’ కిందకు వస్తాయి. 

ఈ థర్డ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ కారణంగా గదిలో ఉండిపోయే నుసి, అతి సూక్ష్మమైన సన్నటి ధూళి కణాలు... పొగకు ఎక్స్‌పోజ్‌ అయిన బట్టలపై కొన్ని నెలలపాటు, ఆ మాటకొస్తే కొన్నేళ్ల వరకు కూడా అలాగే ఉండిపోతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

మరీ ముఖ్యంగా గాలి ప్రవేశించలేకుండా ఉండి, గట్టిగా మూసి ఉన్న గదుల్లో స్మోకింగ్‌ చేసినప్పుడు, ఇతరులు అందులోకి వెళ్లినప్పుడు ఈ థర్డ్‌ హ్యాండ్‌ దుష్ప్రభావాలు మరింత ఎక్కువకాలం కొనసాగుతుంటాయి. ఈ పరిశోధనల్లో తేలినదేమిటంటే.. థర్డ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌కు గురైన 22 గంటల తర్వాత కూడా... వ్యక్తులపై ఆ దుష్ప్రభావాల ప్రభావం కనిపిస్తుందన్నది పరిశోధకుల మాట.  

యూఎస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, రివర్‌సైడ్‌లో సెల్‌బయాలజిస్ట్‌ ప్రూ టాల్బోట్‌ చెబుతున్న దాని ప్రకారం... థర్డ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ దుష్ప్రభావాలపై ఇప్పటివరకూ ప్రజల్లో పెద్దగా అవగాహన లేదనీ, పొగతాగే అలవాటున్న వ్యక్తుల తాలూకు కార్లు వాడేవారూ, కొనేవారూ లేదా హోటళ్లలో అంతకుముందు స్మోకర్స్‌ ఉండి ఖాళీ చేసిన గదులు షేర్‌ చేసుకునేవారు, క్యాసినోలకు వెళ్లేవారందరికీ ఈ ముప్పు చాలా ఎక్కువనీ, అన్ని అవయవాలకంటే చర్మానికి నేరుగా ఈ ముప్పు ఉంటుందంటూ చెబుతున్నారు.

క్యాన్సర్‌ను సిగరెట్‌ బాక్స్‌లో ప్యాక్‌ చేసి, పిల్లలకు ఇవ్వడం సబబేనా?
ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను అందమైన సిగరెట్‌ పెట్టెలో ప్యాక్‌ చేసి తీసుకెళ్లి  ఇంట్లోని అమాయకమైన పిల్లలకు గిఫ్ట్‌గా ఇవ్వడం ఎంతవరకు సబబంటూ పరిశోధకులూ, వైద్య ప్రముఖులు పొగాకు వాడేవారిని నేరుగా ప్రశ్నిస్తున్నారు. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్‌ఏను సంక్రమింపజేస్తున్నారని వాపోతున్నారు. పిల్లలకు లోపభూయిష్టమైన డీఎన్‌ఏ దక్కడానికి  కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట బ్రాడ్‌ఫోర్ట్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో తల్లిదండ్రుల్లో పొగతాగే అలవాటు ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. 

తమ పొగతాగే అలవాటు కారణంగా తండ్రులు తమ పిల్లలకు దెబ్బతిన్న (డ్యామేజ్‌డ్‌) డీఎన్‌ఏ ను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రి తప్పిదం వల్ల పిల్లలు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోందని ఆ అధ్యయనం చెబుతోంది. దీనికి కారణమేమిటంటే... పురుషుల వీర్యకణాల్లోని డీఎన్‌ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో లోపభూయిష్టమైన ఆ డీఎన్‌ఏ కారణంగా పిల్లల్లో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. 

పుట్టబోయే పిల్లల్లో కనిపించే రిస్క్‌ను తప్పించుకునేందుకు ఒక ఉపాయాన్ని చెబుతున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న డాక్టర్‌ డయానా యాండర్సన్‌. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్‌ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్‌ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయంటున్నారామె. 

ఈ అనర్థాలన్నిటి కంటే... స్వయానా తానూ, జీవన సహచరి అయిన తన భార్య, తమకు పుట్టే పిల్లలూ, తన తోటి స్నేహితులూ, వారితోపాటు సమస్త సమాజమంతా  ఆరోగ్యంగా ఉండటానికి పొగతాగడమూ, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేయడమే మంచిదంటూ డాక్టర్లూ, వైద్య పరిశోధకులూ, ఆరోగ్యాన్ని కోరుకునే అందరూ సూచిస్తున్నారు. ఇక్కడ పొగతాగడం అంటే కేవలం సిగరెట్, బీడీ, చుట్ట అనే కాదు... జర్దా, ఖైనీ, పాన్‌మసాలా... ఇలా పొగాకు ఏ రూపంలో ఉన్నా అంతే ప్రమాదకారి అని గుర్తించడం అవసరం.  

నిర్వహణ: యాసీన్‌

(చదవండి: పిల్లలకు సమయం కేటాయించాలి)

Advertisement
 
Advertisement
Advertisement