శక్తికి యుక్తిని జోడించి ముందుకు..

Women Like Goddess On Bathukamma And Dussehra Festival - Sakshi

సమకాలమ్‌ 

ఆమె దేవత కాదు

స్త్రీని దేవతగా పూజించే చోటే మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి.  దేవతను చేశారంటే శక్తిని గ్రహించి కాదు.. త్యాగ మంత్రంతో శక్తిని సంగ్రహించి బలహీనపర్చారని అర్థం. ఈ మాట చెప్పడానికి పండగను మించిన సందర్భం ఉండదనిపించింది. పైగా దసరా నవరాత్రులు మొదలయ్యే నెల ముందు హథ్రాస్‌ దారుణాన్ని చవి చూసిందీ దేశం. దాదాపు రెండు వారాల కిందట విజయవాడలో దివ్య హత్యనూ జీర్ణం చేసుకుంది. ఈ రెండు తాజా ఉదాహరణలు చాలు కదా.. ఈ పుణ్యభూమిలో స్త్రీ దేవత అని చెప్పడానికి.

మళ్లీ ఇలాంటి సమయాలే మహిళలూ మనుషులే .. వాళ్లకూ హక్కులుంటాయి.. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం.. కుల, పురుషాహంకారాన్ని నిలువరించే యుక్తి, సమాన స్థాయి కోసం పోరాడే శక్తీ ఉంటాయని నిరూపిస్తాయి. ఆ లక్షణాలను కదా గౌరవించాలి.. ఆరాధించాలి.. స్ఫూర్తిగా తీసుకోవాలి! కుల, మత, జెండర్‌ వారీగా ఏలికలు జనాలను విడగొట్టి బలహీనపరుస్తుంటే.. అదే కుల, మత, జెండర్‌లను ఒక్కటి చేసుకుంటూ బలమైన శక్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు మహిళలు. ఒక్క స్త్రీ సమస్యల మీదే కాదు.. మొత్తం ప్రజల హక్కులను కాపాడేందుకు! ఆ యోధులందరినీ పేరుపేరునా పరిచయం చేయాలనే ఉంది. స్థల పరిమితులను దృష్టిలో పెట్టుకొని తాజా పరిణామాల్లో సాహసాన్ని ప్రదర్శించిన శక్తుల గురించే ఉదహరించాల్సి వస్తోంది. 

ఆ ప్రయాణం హథ్రాస్‌ నుంచే మొదలు పెడదాం..
పందొమ్మి దేళ్ల దళిత అమ్మాయిని ఆ ఊరి ఠాకూర్ల సంతానం కొన్ని రోజులుగా వెంటపడుతూ.. వేధించారు. ఆ అమ్మాయి కుటుంబీకులు ఈ విషయం మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదెవ్వరూ. చివరకు ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి.. ఆ నిజాన్ని బయటపెట్టకుండా నాలుక కోసి హింసించి చంపేశారు. ఈ ఠాకూర్ల కొడుకులను కడుపులో పెట్టుకునేందుకు పోలీసులు ఆ అమ్మాయి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేశారు.. తల్లిదండ్రులను రానివ్వకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు పెట్టి మరీ.

ఆ చితి మంటలను  ప్రత్యక్షంగా రిపోర్ట్‌ చేసి ఆ దురాగతాన్ని దేశానికి చూపించిన  శక్తి పేరు తనూశ్రీ పాండే.  ఇండియా టుడే జర్నలిస్ట్‌. ఆ ఊరి గుట్టును రట్టుచేసిన వారికి భూమ్మీద నూకల్లేకుండా చేస్తారు అక్కడి పెద్దలు ప్రభుత్వ మద్దతుతో. ఆ క్రూరత్వానికి భయపడలేదు తనూశ్రీ. నేరాన్ని ఫోకస్‌ చేసింది. బెదిరింపులను ఎదుర్కొంది. అయినా మైక్‌ పట్టుకొని ఆ ఊరి నడిబొడ్డున నిలబడ్డది.. నిజాన్ని కెమెరాకు పట్టించింది. బారికేడ్లను తోసేసుకొని బాధితురాలి ఇంటికి వెళ్లింది. బాధితురాలి  తల్లిని గట్టిగా గుండెకు హత్తుకుంది. ఆ స్పర్శకు ఆ అమ్మలో గూడుకట్టుకున్న దుఃఖం వరదైంది. దేశాన్ని ముంచెత్తింది. 

అది ప్రళయంగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన ఊర్లోని అగ్రవర్ణాలన్నీ ఒక్కటయ్యాయి నిందితుల పక్షాన. పోలీసులను ఊరి చుట్టూ కంచెలా మార్చారు మీడియాను రానివ్వకుండా. ఈ దుష్పరిణామాన్ని బయటపెట్టింది ఇంకో శక్తే. పేరు ప్రతిమ మిశ్రా. పోలీసులు తోస్తున్నా.. ఊళ్లో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నా.. లెక్కచేయలేదు. ఎత్తి వ్యాన్లో కూర్చోబెడ్తున్నా వెనక్కి మళ్లలేదు. తదనంతర పరిస్థితులను కళ్లకుకడ్తూనే ఉంది. బాధితులకు న్యాయ సహాయం చేయడానికి ఇంకో శక్తీ నిలబడ్డది. పేరు సీమ కుష్వాహా. నిర్భయ కేసులో బాధితుల తరపున వాదించిన లాయర్‌. ఇప్పుడు హథ్రాస్‌ సంఘటనలోనూ న్యాయ దేవత కళ్లగంతలు విప్పే సాహసం చేయబోతోంది. 

ఈ చైతన్యాన్ని ఇదివరకే అందిపుచ్చుకున్న ప్రాంతాలున్నాయి. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి. దళితుల, స్త్రీల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తున్నవాళ్లున్నారు. వృత్తి బాధ్యతల్లో బిజీగా ఉన్నా ఈ సామాజిక బాధ్యతనూ నిర్వర్తిస్తున్నారు. సుజాత సూరెపల్లి, దీప్తి, కవితా పులి, స్వాతి వడ్లమూడి, చైతన్య పింగళి, భరణి చిత్రలేఖ, రమా సుందరి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ శక్తుల జాబితా పెద్దదే. కుల, పురుష దురహంకారంతో  సామాజిక మాధ్యమాల్లో ఆడవాళ్ల మీద నోరుపారేసుకొని, లేబుల్‌ వేసిన మగవాళ్లు అమెరికాలో ఉన్నా వదిలిపెట్టలేదు. కుల,పురుష దురహంకార దాడులకు, హత్యలను నిలదీస్తున్నారు. ఈ వైపరీత్యాలను నిలువరించడానికి మాటలు, రాతలు, బొమ్మలు, చేతలు.. ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్లు అనుసరిస్తున్నారు.

స్త్రీ సమస్యల నుంచి రాజకీయ పరిణామాలు, ప్రకృతి వైపరీత్యాల దాకా అన్నిటికీ తమ గళాన్ని వినిపిస్తున్నారు. కలాన్ని అందిస్తున్నారు. జనాన్ని కదిలిస్తున్నారు. సహాయానికి వస్తున్నారు. వీళ్లకూ బెదిరింపులు, హెచ్చరికలూ వెళుతున్నాయి. ‘పర్సోనా నాన్‌ గ్రాటా’ కేటగరీ పరిగణనలూ ఉంటున్నాయి. లెక్కచేయట్లేదు. సోషల్‌ నెట్‌వర్క్‌ అకౌంట్స్‌ క్లోజ్‌ చేసుకోవట్లేదు. ధర్నాలు, నిరసనలు మానుకోవట్లేదు. శక్తికి యుక్తిని జోడించి ముందుకు కదులుతూనే ఉన్నారు. స్ఫూర్తిని పంచుతునే ఉన్నారు. మహిళలను దేవతలుగా పూజించడం మాని తోటి పౌరులుగా గుర్తించి, గౌరవించే సంస్కృతి కావాలి. ఆ శుభ ఘడియ వచ్చేవరకు శక్తుల పోరాటం ఆగదు. ఆ స్ఫూర్తి నవ రాత్రులకే పరిమితం కాదు, 365 రోజులూ కొనసాగుతూనే ఉంటుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top