వజ్రాలు వదిలేసింది! | Women Begins Apple Revolution In Manipur | Sakshi
Sakshi News home page

వజ్రాలు వదిలేసింది!

Jul 20 2025 9:04 AM | Updated on Jul 20 2025 9:04 AM

Women Begins Apple Revolution In Manipur

ఆరేళ్లయింది అవుంగ్షీ ఢిల్లీని వదిలేసి. ఇప్పుడు ఆమె మణిపూర్‌లోని తన స్వగ్రామంలో తల్లిదండ్రులకు తోడుగా ఉంటోంది. అసలు వాళ్ల కోసమే ఆమె వజ్రంలాంటి తన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చింది. వస్తూ వస్తూ సిమ్లా నుంచి ఆపిల్‌ మొక్కల్ని తెచ్చుకుంది. అవి రెండో ఏడాదే కిలోల కొద్దీ తియ్యటి ఆపిల్‌ పండ్లను ఇచ్చాయి. తొలి కాపును అమ్మానాన్నకు నైవేద్యంగా పెట్టింది. స్నేహితులు, బంధువులకు ప్రసాదంలా పంచింది. మిగతా పండ్లను అమ్మింది. మరికొన్ని చెట్టుకు సిద్ధంగా ఉన్నాయి. ‘‘ఆరేళ్ల క్రితం ల్యాబ్‌లో మేము వజ్రాలను తయారు చేసేవాళ్లం. ఆనాటి ఉద్యోగ సంతృప్తిని మించిన సంతృప్తి ఏటా చేతికొస్తున్న ఈ ఆపిల్‌ పంటను చూస్తే కలుగుతోంది’’ అంటోంది అవుంగ్షీ.

తొలి పంట వచ్చినప్పుడు చూడాలి అవుంగ్షీ కళ్లలోని వజ్రాల మెరుపుల్ని! ‘పండంటి బిడ్డ’ అంటుంటాం కదా.. ఆమెకు అవి బిడ్డంటి పండ్లు. విరగ గాసిన ఆపిల్‌ పండ్లు! ఆమెను చూసి ఉఖ్రూల్‌లోని పాయ్‌ గ్రామం ఆపిల్‌ని పండించడానికి ఉత్సాహపడింది. అక్కడి భూమిలకది ఏ మాత్రం పరిచయం లేని పంట. అయితే ఎర్రగా, జ్యూసీగా, తియ్యగా ఉన్న ఆ ఆపిల్‌ పండ్లను చూసి స్థానికులు తాము కూడా ఆపిల్స్‌ను పండించడానికి ఆసక్తి కనబరిచారు. దాంతో పోయ్‌ ప్రాంతానికి ఆవుంగ్షీ ఆపిల్‌ పండ్ల సాగుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిపోయింది. 

2019 ఏప్రిల్‌లో ఆమె హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి 55 ఆపిల్‌ మొక్కల్ని తెచ్చి నాటితే వాటిలో 52 బతికాయి. మొదటి ఏడంతా కాపు లేదు. రెండో ఏడాది జూన్‌ రెండో వారానికల్లా ఆకులు కనిపించనంతగా పండ్లొచ్చేశాయి! పోయ్‌ గ్రామం ఇండో–బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉంటుంది. మరీ చల్లగా ఉండని అక్కడి పొడి వాతావరణానికి అనువైన భూమిలో పెరిగే ఆపిల్‌ మొక్కల్ని ఆవుంగ్షీ ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి.. హిమాచల్‌ ప్రదేశ్‌ పాలంపూర్‌లోని శిక్షణ కేంద్రంలో ఆపిల్‌ సాగులో మెలకువలు నేర్పించడం వరకు అన్నిటా ఆమె స్నేహితురాలు సోసో షైజానే ఆమెకు సహాయంగా ఉంది. షైజా.. నేషనల్‌ విమెన్‌ కమిషన్‌లో సభ్యురాలు. 

‘‘ఊరెళ్లి ఏం చేస్తావు?!’’
‘‘ఊరెళ్లిపోతున్నాను. అమ్మానాన్నకు ఇంటి దగ్గర తోడుగా ఉండాలి’’ అని అవుంగ్షీ చెప్పినప్పుడు.. షైజా మొదట ఆమెను అడిగిన మాట.. ‘‘ఉద్యోగం మానేసి, ఊరెళ్లి ఏం చేస్తావు?’’ అని. ‘‘ఏమీ అనుకోలేదు’’ అంది అవుంగ్షీ. ఏమీ అనుకోకుండా ఉద్యోగం మానేయడం అంటే అంతకన్నా పొరపాటు లేదు. పైగా అవుంగ్షీ ఆ సమయంలో ఢిల్లీలోని గోర్డెన్‌–మ్యాక్స్‌ అనే సింగపూర్‌ వజ్రాల కంపెనీలో డైమండ్‌ ల్యాబ్‌ మేనేజర్‌గా ఉంది! అయితే తల్లిదండ్రుల కోసం ఆ వజ్రంలాంటి ఉద్యోగాన్ని వదలేయాలని నిర్ణయించుకుంది. ‘‘సరే వదిలేయ్, అయితే మీ మణిపూర్‌లో ఆపిల్స్‌ పండించడం ఎలా ఉంటుందో ఆలోంచించు’’ అని షైజా సలహా ఇచ్చింది. అలా ఢిల్లీ–హిమాచల్‌ప్రదేశ్‌–మణిపూర్‌ల మీదుగా అవుంగ్షీ ఆపిల్‌ పంట ఆలోచన సాగింది. ఆనాటి ఆ ఆలోచన ఈనాటి వరకూ ఏటా విరగ్గాస్తూనే ఉంది.

పంట రాగానే పంపకం!
పెరుగుతున్న దిగుబడితో ఏటికేడాదీ మరిన్ని ఆపిల్‌ మొక్కల్ని తెచ్చి భారీ ఎత్తున ఆపిల్‌ తోటను పెంచుతోంది అవుంగ్షీ. ఆమె తండ్రి వరి రైతు. మొదట – కూతురు ఆపిల్స్‌ పండిస్తాను అనగానే ఆయనేమీ మాట్లాడలేదు. తల్లి మాత్రం కూతురి వైపు నిలబడింది. ఆమె మద్దతు ఇవ్వడానికి తగిన కారణమే ఉంది. అవుంగ్షీ పెంచుతున్న ఆపిల్‌ రకం ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలోనే కాపుకు వచ్చేస్తుంది. ఉఖ్రూల్‌ శీతోష్ణ స్థితుల్లో చక్కగా ఎదుగుతుంది. పైగా పూర్తి ఆర్గానిక్‌. మార్కెట్‌లో మంచి ధర ఉంది. కిలో ఆపిల్స్‌ రూ.250 వరకు ధర పలుకుతాయి.

 ఏటా పంట రాగానే స్నేహితులకు, పరిచయస్తులకు, బంధువులకు ఇచ్చినన్ని ఇచ్చి మిగతా వాటిని అమ్మేస్తుంది అవుంగ్షీ. ఇంకా కొన్ని అమ్మకానికి ఉంటాయి. వాటిని ఉచితంగా గ్రామస్థులకు పంచిపెడుతుంది. చెట్లపై ఇంకా డెబ్భై నుంచి ఎనభై కిలోల ఆపిల్స్‌ కోతకు వస్తూనే ఉంటాయి. ఈ లెక్కలన్నీ క్రమేణా అవుంగ్షీ తండ్రిలో నమ్మకం కలిగించి ఆయన ప్రోత్సాహం కూడా ఆమెకు లభించింది. ఇప్పుడు తన ఆపిల్‌ పండ్ల తోటను చూడ్డానికి వస్తున్న పోయ్, చుట్టు పక్కల గ్రామాల అమ్మాయిలు, గృహిణులు ఆపిల్‌ సాగుపై ఆసక్తి చూపడంతో వారిని కూడా అవుంగ్షీ ప్రోత్సహిస్తోంది.

 తను ఏ విధంగానైతే హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లి శిక్షణ తీసుకుని వస్తూ వస్తూ కొన్ని ఆపిల్‌ మొక్కల్ని కొని తెచ్చుకుందో వాళ్లకూ అదే దారిని చూపిస్తోంది. ఈ ఆరేళ్లతో తనకు ఎదురైన కష్టనష్టాల గురించి కూడా ఆమె వారికి చెబుతోంది. ‘‘కష్టనష్టాలంటే ఏం లేదు. మొక్కల్ని పశువులు తినకుండా కాపాడుకోవాలి. పండ్లు వచ్చాక దొంగలు పడకుండా కాపు కాయాలి’’ అని తియ్యగా నవ్వుతుంది అవుంగ్షీ. ఏమైనా వజ్రాల ఉద్యోగాన్ని మించినదవుతుందా ఆపిల్‌ పండ్ల పెంపకం?! ‘‘కాకపోవచ్చు. అక్కడికి మించిన ఉద్యోగ సంతృప్తి.. ఈ పంట సాగులో ఉంది’’ అంటుంది ఈ యువ కృషీవలురాలు. 
∙సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement