నేచురల్‌గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా? | Sakshi
Sakshi News home page

నేచురల్‌గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా?

Published Sun, May 26 2024 8:22 AM

What Are The Precautions To Be Taken By Pregnant Women? Dr Bhavana Kasu Instructions

నాకు 42 ఏళ్లు. ప్రెగ్నెంట్‌ని. మూడో నెల. పిల్లల కోసం కొన్నేళ్లు ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాను. ఇప్పుడు నేచ్యురల్‌గానే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – ఆకునూరి శైలజ, వైరా

ఈరోజుల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాతే గర్భం దాలుస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన మందులు, చెకప్స్‌ ఉండాలి. పాజిటివ్‌గా ఉండాలి. హై రిస్క్‌ ప్రెగ్నెన్సీస్‌ని డీల్‌ చేసే ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్స్‌ ద్వారా 40 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలు కలుగుతున్నారు. అయితే ఈ వయసులో గర్భం దాల్చినవాళ్లకు బీపీ, సుగర్, థైరాయిడ్‌ సమస్యలు ఎక్కువ రావచ్చు.

బిడ్డకీ జన్యుపరమైన సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే ప్రసవించడం వంటి చాన్సెస్‌ పెరగొచ్చు. అయితే కరెక్ట్‌ డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్‌తో వీటిని మేనేజ్‌ చేయవచ్చు. ఇది తొలి చూలు అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్‌ తక్కువుంటుంది. మలి చూలు అయి.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్‌ లేదా గర్భస్రావం అయినా.. 40 ఏళ్ల తర్వాత ఇంకా రిస్క్‌ పెరుగుతుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సుగర్‌ వ్యాధి రిస్క్‌ నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి చెకప్‌లో యూరిన్‌లో సుగర్‌ టెస్ట్‌ చేస్తారు. ఒకవేళ యూరిన్‌లో సుగర్‌ నిర్ధారణ అయితే అప్పుడు బ్లడ్‌ సుగర్‌ టెస్ట్‌ చేస్తారు. డయాబెటాలజిస్ట్, డైటీషియన్‌ కన్సల్టేషన్‌తో మేనేజ్‌ చేస్తారు.

సుగర్‌ కంట్రోల్‌ కానప్పుడు మాత్రమే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్‌ వస్తాయి. రెగ్యులర్‌గా బిడ్డ ఎదుగుదలను చెక్‌ చేస్తే స్కాన్స్‌ని రిఫర్‌ చేస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన గర్భిణీల్లో అయిదవ నెల లోపు గర్భస్రావం అయ్యే రిస్క్‌ ఎక్కువ. అందుకే 3 నుంచి 5 నెలల్లో డాక్టర్‌ సూచించిన మందులను తప్పకుండా వాడాలి. శారీరకంగా ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి. 7 వ నెల నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. బిడ్డ కదలికలను ఎలా ట్రాక్‌ చేయాలో వివరిస్తారు. కదలికలు తక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు ప్రసవానికి ప్లాన్‌ చేస్తారు. సిజేరియన్‌ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యపరిస్థితిని బట్టి డెలివరీ ప్లాన్‌ చేస్తారు. బీపీ, సుగర్‌ ఉన్నవారిలో ప్రసవం తర్వాత బ్లీడింగ్‌ ఎక్కువ ఉండొచ్చు. దానికి సిద్ధపడే మందులు ఇస్తారు. ప్రెగ్నెన్సీ, ప్రసవం.. ఆరోగ్యంగా.. సుఖంగా జరిగిపోవడానికి బరువును నియంత్రణలో పెట్టుకోవాలి.

సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ జోలికి వెళ్లకూడదు. నిపుణుల పర్యవేక్షణలో యోగా, వ్యాయామం వంటివి చేయాలి. కాఫీ, ఆల్కహాల్‌ వంటివి మానెయ్యాలి. ఇన్‌ఫెక్షన్స్‌ సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీటల్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌తో క్రమం తప్పకుండా మూడవ నెల, అయిదవ నెలల్లో స్కాన్స్‌ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ప్రెగ్నెన్సీ రిస్క్‌ని తగ్గించవచ్చు.


– డా. భావన కాసు, గైనకాలజిస్ట్‌ & ఆబ్‌స్టేట్రీషియన్‌, హైదరాబాద్‌

Advertisement
 
Advertisement
 
Advertisement