హ్యాపీ పేరెంటింగ్‌: వసపిట్ట పాఠాలు | Sakshi
Sakshi News home page

హ్యాపీ పేరెంటింగ్‌: వసపిట్ట పాఠాలు

Published Sat, Mar 18 2023 12:22 AM

Vasapitta: Madhuri Krishna about Parents and Kids - Sakshi

తల్లిదండ్రులుగా పిల్లలను చూసుకోవాల్సిన విధానాన్ని, తల్లిగా తన అనుభవాన్ని కళ్లకు కడుతూ యూ ట్యూబర్‌గా రాణిస్తోంది హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఉంటున్న చిలుకూరి కృష్ణమాధురి, నాలుగు, ఏడాదిన్నర వయసున్న పిల్లలతో కలిసి, తన స్వీయ అనుభవాలను షేర్‌ చేస్తుంటుంది. మాధురి మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నాలు... పిల్లల పెంపకంలో తను తీసుకునే జాగ్రత్తలు ఎంతోమంది తల్లులకు పాఠాలు అవుతున్నాయి. ఈ విషయాల గురించి మాధురి మాట్లాడుతూ ...

‘‘నేను పుట్టి పెరిగింది రాజమండ్రిలో. మావారిది గుంటూరు. మా వారి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉండేవాళ్లం. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఉన్న నేను పిల్లల పుట్టడంతో ఇంటి దగ్గరే ఉండిపోయాను. పిల్లలపై తపన, వారి ఆరోగ్య జాగ్రత్తలు, పెంపకం విషయాలన్నీ తల్లిగా నాకు ప్రతిరోజూ ఓ పాఠమే. వీటిని నలుగురితో పంచుకుంటే కొంతమంది తల్లులకైనా ఉపయోగపడుతుంది కదా అని సరదాగా వీడియోలు తీసి, యూ ట్యూబ్‌లో పోస్ట్‌ చేసేదాన్ని.

వాయిస్‌ ఆఫ్‌ వసపిట్ట
పిల్లల అల్లరి మాటలకు పెద్దవాళ్లు ముద్దుగా పెట్టే పేరు వసపిట్ట. నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని చిన్నప్పటి నుంచి కాస్త ఎక్కువగా మాట్లాడేదాన్ని. అందుకే, అందరూ నన్ను వసపిట్ట అని పిలిచేవారు. దీంతో ఛానెల్‌కి ఇదే పేరు బాగుంటుందని ఎంచుకున్నాను. మూడేళ్లు అవుతోంది ఇది స్టార్ట్‌ చేసి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాక నా పోస్ట్‌లు మరిన్ని పెరిగాయి.

పెంపకాన్ని పరిచయం చేస్తూ..
అమ్మ తన పిల్లలను ఏ విధంగా పెంచుతుందనే విషయాల గురించి వెతికితే తెలుగులో ఎక్కువ బ్లాగర్స్‌ లేరు. ఉన్నా, వివరంగా చెప్పేవారు లేరు. పిల్లల పెంపకం అనగానే చాలా వరకు డాక్టర్లు, డైటీషియన్లు కనిపిస్తారు. వాళ్లు చెప్పేవి అందరూ ఆచరణలో పెడుతున్నారో లేదో తెలియదు. నేను డాక్టర్‌ దగ్గరకు పిల్లలను తీసుకెళ్లినప్పుడు, అక్కడ వారిచ్చిన మందులు, జాగ్రత్తల నుంచి అన్నీ నా ఛానెల్‌ ద్వారా పరిచయం చేస్తుంటాను.

రోజువారి పనులు
చిన్న పిల్లలున్న ఇల్లు ఎలా ఉంటుందో తల్లులందరికీ అనుభవమే. ఇల్లు పీకి పందిరేస్తారు అంటుంటారు. ఇలాంటప్పుడు చిన్నపిల్లలకు క్రమశిక్షణ ఎలా అలవాటు చేయాలి, దుమ్ము, కాలుష్యం నుంచి వారిని ఎలా కాపాడాలి, టీవీ చూడకుండా తినడం ఎలా అలవాటు చేయాలి, స్క్రీన్‌ టైమ్‌ ఎందుకు తగ్గించాలి.. ఇలాంటివి పిల్లలను ఇన్‌వాల్వ్‌ చేసి చెప్పడం వల్ల చాలా మంది కనెక్ట్‌ అయ్యారు. అంతేకాదు, వాళ్లంతట వాళ్లు పనులు చేసుకోవడం, వంటలో సాయం చేయడం.. వంటివి పిల్లలకు పెద్దవాళ్లు అలవాటు చేయాలి. వీటిని మా పిల్లలను చూపిస్తూ ‘హ్యాపీ పేరెంటింగ్‌’ అనేది తెలియజేయాలనుకున్నాను. అదే చేస్తున్నాను.

ఆనందకరమైన లక్ష్యం
మదర్‌ హుడ్, ఫాదర్‌ హుడ్‌ ఎంజాయ్‌ చేస్తూ పిల్లలు కూడా మంచి ఫీలింగ్‌తో పెరగాలనేది నా ఆలోచన. మేం సమస్యలను ఎలా అధిగమిస్తున్నామో కూడా చూపిస్తున్నాను. వీటిని చూడటానికి నాలుగు లక్షలకు పైగా వీక్షకులున్నారు. వీరిలో పిల్లలున్నవారు 70 శాతం మంది ఉన్నారు. నా వీడియోలు చూసి తాము కూడా బ్లాగ్స్‌ చేస్తున్నామని కొందరు చెబుతుంటారు.

ఆరోగ్య జాగ్రత్తలు...
వీక్షకులలో చాలా మంది డాక్టరు చెప్పే జాగ్రత్తలు, కిడ్స్‌ ఫుడ్‌ గురించి సలహాలు సూచనలు అడుగుతుంటారు. పిల్లలు సరిగా తినరు అనేది పెద్దలు ప్రతిసారి చెబుతుంటారు. కానీ, ఎందుకు తినరు, ఎలా తింటారు.. అనే వివరాలను మా పిల్లలను ఉదాహరణగా చూపిస్తూ వివరిస్తుంటాను. వివిధ సమయాలలో పిల్లల ప్రవర్తన, మనం వారితో మాట్లాడటం, ్రపాక్టికల్‌గా చేస్తూ చెబుతుంటాను. పిల్లలు కూడా ఈ విధానాన్ని బాగా ఇష్టపడుతున్నారు. మా పిల్లలకు ఓ సారి ర్యాషెష్‌ వచ్చాయి.

వాటిని ప్రాక్టికల్‌గా చూపించి, డాక్టరు చెప్పిన సూచనలతో పాటు, నేను స్వయంగా ఎలాంటి కేర్‌ తీసుకుంటున్నానో చూపించాను. అలాగే.. డెంటల్‌ ట్రీట్‌మెంట్, గర్భిణిగా ఉన్నప్పుడు, తల్లిపాల ప్రాముఖ్యత.. ఆ సమయాల్లో నేనెలాంటి జాగ్రత్తలు తీసుకున్నాను.. మరికొన్ని ఇతరుల ద్వారా సేకరించిన సూచనలూ ఇస్తుంటాను. మా నాన్న రైల్వేలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ప్రతి విషయంలో నా అభిప్రాయాన్ని కూడా అడిగేవారు. అలా వారి నుంచే నాకు నా పిల్లల పెంపకాన్ని మరింతగా నలుగురికి తెలియజేయాలనే ఆలోచన పెరుగుతూ వచ్చింది’’ అని తల్లిగా తన అనుభవ పాఠాలను ఆనందంగా వివరించారు మాధురి.

– నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement