
ప్రకృతికి పక్షపాతం కొంచెం ఎక్కువే. దక్షిణాదిన కేరళను అక్కున చేర్చుకుంది. ఉత్తరాన ఉత్తరాఖండ్‌ను ఒడిలో దాచుకుంది. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అనే భుజకీర్తి ఒకరిది. ‘దేవభూమి’ అనే అతిశయం మరొకరిది. ఆ రెండు రాష్ట్రాల్లో పుట్టని వాళ్లేం చేయాలి? వీలయినప్పుడు అక్కడికి వెళ్లి చూసి రావాలి? హైదరాబాద్‌లో రైలెక్కి ఢిల్లీలో రైలు దిగుదాం. ఢిల్లీలో బస్సెక్కి ఉత్తరాఖండ్ టూర్‌కి చెక్కేద్దాం. ఇది... మూడు వేల అడుగుల ఎత్తు మొదలు... ఏడు వేల అడుగుల ఎత్తుకు సాగే ప్రయాణం.
1వ రోజు
ఉదయం ఆరు గంటలకు ట్రైన్ నంబర్ 12723 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది.
2వ రోజు
ఉదయం 7.40 గంటలకు ఢిల్లీ స్టేషన్‌కు చేరుతుంది. హోటల్‌లో రిఫ్రెష్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్ తరవాత కార్బెట్‌కు ప్రయాణం. కార్బెట్‌కు చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్కడ హోటల్ గదిలో చెక్, రాత్రి భోజనం, బస.
3వ రోజు
తెల్లవారు జామున లేచి కార్బెట్ సఫారీకి వెళ్లడం, జలపాతాల వీక్షణం తర్వాత హోటల్‌కి వచ్చి బ్రేక్‌ఫాస్ట్, రిఫ్రెష్‌మెంట్ తర్వాత గది చెక్ అవుట్ చేయాలి. నైనితాల్‌కు ప్రయాణం. నైనితాల్‌లో హోటల్‌లో చెక్ ఇన్, రాత్రి భోజనం, బస అక్కడే.
వేటగాడి జ్ఞాపకం!
చందమామ కథల్లో చెప్పుకున్నట్లు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి కాదు కానీ ఇది దట్టమైన అటవీప్రదేశం అని చెప్పడంలో సందేహం లేదు. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పాటయిన నేషనల్ పార్క్ ఇది. తొలి తొలి నేషనల్ పార్క్ కూడా. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ పార్కుగా పేరు మార్చుకుంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం. నిజానికి పులులను సంరక్షించడంలో జిమ్ కార్బెట్ పాత్ర ఏమీ లేదు.
ఇతడు గొప్ప వేటగాడు. కుమావ్ రీజియన్‌లో మనుషులకు హాని కలిగిస్తున్న పులులను, చిరుత పులులను హతమార్చిన ఘనత ఇతడిది. తన పులుల వేట కథనాలను రాశాడు కూడా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సఫారీలో మనకు పులులు, ఏనుగుల గుంపులు, జింకలు, రకరకాల పక్షులు కనువిందు చేస్తాయి. నగరవాసుల ఈ టూర్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగులుతుంది.
ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన శివాలిక్ రీజియన్ ఉంది. అటవీప్రదేశంలో పర్వతసానువులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అడవి మధ్యలో ప్రవహిస్తున్న రామ్ గంగ నది, దాహం తీర్చుకోవడానికి నది తీరానికి వచ్చిన జంతువులను చూస్తూ పిల్లలు కేరింతలు కొడతారు. వన్య్రప్రాణుల సంరక్షణ కోసం ఎకో టూరిజమ్ పాలసీ అమలులో ఉంది. కాబట్టి ప్రకృతికి, వన్య్రప్రాణులకు హాని కలిగించే వస్తువులను అనుమతించరు.
4వ రోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత నైనితాల్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనం. రాత్రి బస నైనితాల్‌లో.
ప్రకృతి అద్భుతం ఈ నయనం!
నైనితాట్ పట్టణానికి పౌరాణిక ప్రాశస్త్యంతోపాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ (వింటర్ క్యాపిటల్, వింటర్ సెషన్స్), నైనితాల్ సమ్మర్ క్యాపిటల్, అలాగే జ్యూడిషియల్ క్యాపిటల్ కూడా, గవర్నర్ బంగ్లా కూడా నైనితాల్‌లోనే. తాల్ అంటే సరస్సు, నయనం (కన్ను) ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ తటాకానికి నైనితాల్ అని పేరు. ప్రకృతి దేవత రూపంలో కొలిచే సంస్కృతిలో భాగంగా నెలకొన్న నయనాదేవి (నైనాదేవి) ఆలయం కూడా ఉంది.
ఇక్కడ ఒక పర్వత శిఖరానికి నైనా పీక్ అని పేరు. అది ఎనిమిది వేల అడుగులకు పైగా ఉంటుంది. చర్చ్, ప్రాచీన కాల నిర్మాణశైలి మసీదు నిర్మాణశైలి సునిశితంగా ఉంటుంది. హనుమాన్ ఘరి ఆలయం నైనితాల్‌లోని మాల్ రోడ్‌లో ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం మంచి వ్యూ ΄ాయింట్. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్ధుతంగా ఉంటాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలను కూడా చూడవచ్చు.
5వ రోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అల్మోరా, ముక్తేశ్వర్ దిశగా ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి నైనితాల్‌కు చేరాలి. రాత్రి బస నైనితాల్‌లో.
ఇక్కడ ఆది మానవుడు నివసించాడు!
అల్మోరాలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చిన ప్రముఖుల పాదముద్రలే పర్యాటక ప్రదేశాలు. స్వామి వివేకానందుడు ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతల «మధ్య ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. మహాభారత కాలంలో కూడా ఈ ప్రదేశం ప్రస్తావన ఉంది. అది కేవలం పుక్కిటి పురాణం కాదనడానికి నిదర్శనంగా చంద్ రాజవంశం నివసించిన భవనాలున్నాయి.
రాజభవనాలంటే మనకు రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లే గుర్తొస్తాయి. కానీ ఇక్కడి రాజభవనాన్ని చూస్తే రాజు అత్యంత నిరాడంబరంగా జీవించాడనిపిస్తుంది. పెద్ద రాతి గోడలు, ఆకు పచ్చ రంగు రేకులతో ఏటవాటు పైకప్పు భవనమే చంద్ రాజవంశపు కోట. కుమావ్ పర్వతశ్రేణుల్లో రాజ్యాన్ని స్థాపించి అల్మోరా రాజధానిగా పాలించారు. ప్రాచీనకాలంలో ఇక్కడ మనుషులు నివసించారని నిరూపించే లఖుదియార్ గుహలున్నాయి. క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ పూర్వికులు అల్మోరా వాసులే.
అదిగో మంచుకొండ
ముక్తేశ్వర్ శైవ క్షేత్రం. ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని చెబుతారు. ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాలయాలు పర్యాటకులతో దోబూచులాడుతూ ఉంటాయి. పర్వత సానువుల మధ్య ప్రయాణం సాగుతున్నప్పుడు కొంత మేర ఆకాశాన్నంటే శిఖరాలతో ప్రపంచంతో సంబంధాలు తెగి΄ోయినట్లయినిపిస్తాయి. ఒక మలుపు తిరగ్గానే సూర్యకిరణాలతో ధగధగలాడుతూ మంచుకొండలు దర్శనమిస్తాయి. కొండవాలులో ప్రయాణిస్తున్నప్పుడు లోయలు వెన్నులో భయాన్ని పుట్టిస్తాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్నామని చూపిస్తుంది. ఇక భయాన్ని అదిమిపెట్టి లోయవైపు చూడకుండా కొండంత అండగా కనిపిస్తున్న కొండనే చూస్తూ ముందుకు సాగిపోవాలి.
6వ రోజు
బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం గది చెక్ అవుట్ చేసి ఢిల్లీకి ప్రయాణం. ఢిల్లీ చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్షరధామ్ టెంపుల్ సందర్శనం తర్వాత హోటల్‌లో చెక్ ఇన్. రాత్రి బస.
లోహరహిత నిర్మాణం
అక్షరధామ్ ఆలయం విశాలమైన నిర్మాణం. ఇది స్వామి నారాయణ ఆలయం. ఈ ఆలయాన్ని ్ర΄ాచీన భారత శిల్పశాస్త్రాన్ని అనుసరించి నిర్మించారు. ఇంత భారీ నిర్మాణంలో ఎక్కడా లోహాలను ఉపయోగించలేదు. అందుకే పిల్లర్‌లు ఎక్కువగా కనిపిస్తాయి. 234 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం మీద సునిశితమైన శిల్పచాతుర్యమయం. ఉత్తరాది నిర్మాణాలకు పాలరాయి ఒక వరం అనే చె΄్పాలి.
పాలరాతితో పూలరెక్కలను కూడా అంతే సున్నితంగా చెక్కగలిగిన నిపుణులు ఉండడం మనదేశ గొప్పదనం. అందుకే పాలరాతి ఆలయాలకు వెళ్లినప్పుడు చుట్టూ చూసి సరిపెట్టుకోకుండా తలెత్తి పైకప్పును కూడా చూడాలి. అక్షరధామ్ ఆలయ సందర్శనంలో వాటర్ ఫౌంటెయిన్‌లు, లేజర్ షోలను మిస్ కాకూడదు.
7వ రోజు
బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కుతుబ్‌మినార్, లోటస్ టెంపుల్ సందర్శనం, మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. నాలుగు గంటలకు 12724 నంబర్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఎనిమిదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుతుంది.
ఏనాటిదో ఈ మినార్!
కుతుబ్ మినార్ నిర్మాణం గురించి చరిత్ర తవ్వకాల్లో కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అప్పటికప్పుడు ఓ చిన్న వివాదం, ఆ తర్వాత సమసి΄ోవడం, కొత్త వాస్తవాలను స్వీకరించడం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని క్రీ.శ పన్నెండవ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడనే ఆధారాలను కొట్టి పారేస్తూ ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడనే ఆధారాలు వ్యక్తమయ్యాయి.
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలను కొనసాగిస్తోంది. ఈ వాస్తవాలెలా ఉన్నప్పటికీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఓ గొప్ప నిర్మాణ విశేషం. అందుకే యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది.
ధ్యాన కలువ
ప్రతి ఆర్కిటెక్చర్ స్టూడెంట్ చూడాల్సిన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ లేదు. కలువ రెక్కల లోపల లోహపు కడ్డీల ఆధారంగా నిర్మించారు. గొప్ప ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా ధ్యానం కోసం నిర్మించిన బహాయీ ధ్యానమందిరం ఇది. లోటస్ టెంపుల్ గిన్నిస్ రికార్డు సాధించిన ఆలయం. ఈ ఆలయం, నిర్మాణ వైశిష్ట్యాలను వివరిస్తూ ఐదు వందల వ్యాసాలు, వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి.
ఈ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ శబ్దం వినిపించదు. నిర్వహకులు పిన్‌డ్రాప్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. చక్కటి గార్డెన్‌ల మధ్య మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లి కొద్ది సేపు ధ్యానం చేసి బయటకు రావడం గొప్ప అనుభూతినిస్తుంది.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి