
కేరళ విద్యావ్యవస్థలో అభ్యుదయం వెల్లివిరుస్తుంటుంది. జెండర్ వివక్ష లేని సమాజం కోసం బాల్యం నుంచే పాఠాలు బోధిస్తుంటుంది. ఒకప్పుడు పాఠ్యపుస్తకాలలో కుటుంబ ముఖచిత్రంలో అమ్మతోపాటు నాన్న కూడా ఇంటి పనులు చేయడాన్ని ప్రచురించింది. తాజాగా ఇప్పుడు ఓ ట్రాన్స్‌జెండర్ జీవితగాధను పాఠ్యాంశంగా తీసుకుంది. ఎనిమిదవ తరగతి ఆర్ట్స్ టెక్ట్స్ బుక్‌లో ట్రాన్స్ ఆర్టిస్ట్ నేఘా ఎస్ విజయగాధను చేర్చింది.
అంతరించి పోవాలి!
ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) కొత్త కరికులమ్‌లో నాటకరంగం, శిల్పకళ, సంగీతం, సినిమా, నాట్యరంగాలను చేర్చింది. ఆయా రంగాల్లో ప్రముఖుల గురించిన పాఠాలను పాఠ్యపుస్తకాలలో ప్రచురించింది. ఈ క్రమంలో సినీ నటి నేఘా ఎస్ గురించిన పాఠానికి చోటు కల్పించింది ఎస్‌సీఈఆర్‌టీ. మలయాళ నటి నేఘా ఎస్... 2022లో నటించిన ‘అంతరం’ సినిమాకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్మ్ అవార్డు అందుకున్నారు. ఒక ట్రాన్స్ ఉమన్‌కు ఇలాంటి గౌరవం దక్కడం ఇదే తొలిసారి. పాఠ్యపుస్తకంలో తన జీవిత పాఠం గురించి తెలుసుకున్న నేఘా ఎస్ భావోద్వేగాలకు లోనయ్యారు. ‘టెక్ట్స్‌బుక్‌లో పాఠాన్ని చూడగానే నాకు కన్నీళ్లు వచ్చాయి.
సమాజం ఇన్నేళ్ల వరకు నన్ను నా పేరుతో గుర్తించనే లేదు. అలాంటిది 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఓ పాఠంలో నా పేరు ఉండడం నన్ను కదిలించింది’ అన్నారామె. సమాజం వేరుగా చూసిన వారిని సమాజంలో భాగంగా చూపించడానికి ఆ రాష్ట్ర విద్యావ్యవస్థ చేసిన ప్రయత్నం గొప్పది. ఆమె సొంతూరు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తీయన్నపురం. కేరళలో నటిగా పురస్కారం అందుకునే వరకు తన సొంత రాష్ట్రం కూడా తనను గుర్తించలేదని, పురస్కారం సందర్భంగా మీడియా కవరేజ్ తర్వాత తనను తన రాష్ట్రం స్వాగతించిందని, అయినప్పటికీ తమిళరాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం తనకు గుర్తింపు రాలేదన్నారామె.
విద్యార్థుల్లో జెండర్ అవేర్‌నెస్ కోసం ఆమె అనేక ప్రభుత్వ స్కూళ్లలో క్లాసులు తీసుకున్నారు. ట్రాన్స్‌జెండర్‌ల పట్ల సమాజంలో నెలకొని ఉన్న తక్కువ భావనను తొలగించడానికి ఈ పాఠం ఒక మంచి ప్రయత్నం. అయితే ప్రపంచంలో కరడుగట్టి ఉన్న అంతరం తొలగిపోవడానికి ఇది సరిపోదు. అంతరించిపోయే వరకు ఇంకా చాలా చేయాలంటూ ‘నా జీవిత పాఠం చదివిన విద్యార్థులు తమను తాము శక్తిమంతంగా తీర్చిదిద్దుకోగలగాలి’ అని ఆశాభావం వ్యక్తం చేశారామె.