
తిరువనంతపురం: దక్షిణాదికి చెందిన తమిళనాడులో హిందీ వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కేరళలోనూ ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. అయితే దీనిని భాషా వివక్ష చర్యగా కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి(Kerala Education Minister V Sivankutty) అభివర్ణించారు. ఇప్పడు అతని మాటలకు అన్నివైపుల నుంచి మద్దతు లభిస్తోంది.
వివరాల్లోకి వెళితే కేరళ విద్యా మంత్రి వి. శివన్కుట్టి.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)కు చెందిన ఆంగ్ల మాధ్యమ పాఠ్యపుస్తకాలకు హిందీ పేర్లు(Hindi names) పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇది సాధారణ తర్కానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ చర్యను భాషా వివక్షగా శివన్కుట్టి అభివర్ణించారు. ఆంగ్లమాధ్యమ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టడమనేది దేశంలోని సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధమని శివన్కుట్టి పేర్కొన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే విద్యార్థులు సహజంగానే ఆంగ్ల పదజాలానికి అలవాటుపడి ఉంటారని, అయితే పుస్తకాలపై హిందీ పేర్లను ప్రవేశపెట్టడం వలన వారిపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుందని అన్నారు.
ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) నిర్ణయం విద్యార్థులలో గందరగోళానికి దారితీస్తుందని, వారి అభ్యాస ప్రక్రియపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేవలం విద్యాపరమైన సమస్యగా మాత్రమే కాకుండా, దేశంలోని భాషా వైవిధ్యానికి ఏర్పడిన ముప్పుగా చూడాలన్నారు. ఒక భాషకు ఇతర భాషల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను తగ్గిస్తోందని ఆయన ఆరోపించారు. ఇది దేశంలోని సాంస్కృతిక సమతుల్యతను దెబ్బతీస్తుందని శివన్కుట్టి అభిప్రాయపడ్డారు. కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నదని, ఈ నిర్ణయాన్ని ఎన్‌సీఈఆర్‌టీ పునఃపరిశీలించాలని కోరారు. దీనిపై ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ అభిప్రాయాలను తెలియజేయాలని, భాషా వైవిధ్యాన్ని కాపాడటానికి కలిసి రావాలని శివన్కుట్టి పిలుపునిచ్చారు. కాగా ఈ వివాదం జాతీయ స్థాయిలో భాషా విధానాలపై చర్చను రేకెత్తించే అవకాశం ఉంది. ప్రత్యేకించి విద్యా రంగంలో ప్రాంతీయ భాషలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంపై ఈ అంశం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇది కూడా చదవండి: ట్రంప్ టార్గెట్: ఇక ఔషధాలు, సెమీకండక్టర్ల వంతు