
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత ట్రంప్(Trump) తన పాలనలో ప్రత్యేక మార్క్ చూపిస్తున్నారు. తాజాగా ఔషధాలు, సెమీకండక్టర్ల దిగుమతులపై కొత్త టారిఫ్‌లను విధించేదిశగా ట్రంప్ యోచిస్తున్నారని సమాచారం. ఇందుకోసం జాతీయ భద్రతపై వాటి ప్రభావంపై పరిశోధించేందుకు కసరత్తు మొదలుపెట్టారు.
ట్రంప్ సర్కారు ఔషధాలు, సెమీకండక్టర్ల దిగుమతులపై కాత్త టారిఫ్‌లను(tariffs) నిర్ణయించాలన్న నిర్ణయాన్ని 1962 ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్ ఆధారంగానే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చట్టం జాతీయ భద్రతకు అనుగుణంగా పలు ప్రధానమైన వస్తువులపై టారిఫ్‌లను విధించడానికి వీలు కల్పిస్తుంది. దీనిపై ట్రంప్ చేపట్టిన పరిశోధన విదేశీ ఉత్పత్తుల విషయంలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీనిపై ట్రంప్ సర్కారు 21 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ గడువు విధించింది. ఔషధాలు, సెమీకండక్టర్ల టారిఫ్‌ల ప్రక్రియ అనేది గతంలో ప్రకటించిన పరస్పర సుంకాల విధానాలను అనుసరించి ఉంటుందని అంటున్నారు.
ట్రంప్ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాలనేవి దిగుమతి సుంకాలు(Import tariffs) గణీయంగా పెరిగేలా చేశాయి. వీటి కారణంగా నిరుద్యోగంతో పాటు ధరలు పెరగడంలాంటివి జరుగుతాయని నిపుణులు హెచ్చరించారు. అయితే ట్రంప్ మాత్రం తన టారిఫ్‌లను దేశ ఆర్థిక, జాతీయ భద్రతా విధానాలలో ముఖ్యమైన భాగమని చెబుతున్నారు. ట్రంప్ సర్కారు తెలిపిన వివరాల ప్రకారం చైనాతోపాటు ఇతర దేశాల నుండి వచ్చే ఔషధాలు తదితర ఉత్పత్తులు అమెరికాలోని స్థానిక పరిశ్రమలకు హాని కలిగిస్తున్నాయి. అందుకే ఈ విధమైన టారిఫ్‌లు విధిస్తే అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి వీలవుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కాగా డెమోక్రాట్‌లు, ఆర్థిక నిపుణులు ఈ ట్టారిఫ్‌లు గ్లోబల్ ట్రేడ్‌ను దెబ్బతీస్తాయని వాదిస్తున్నారు. అయితే ట్రంప్ మద్దతుదారులు ఇది అమెరికాలో ఉద్యోగాలు, ఉత్పత్తుల సంరక్షణకు దోహదపడుతుందని అంటున్నారు. ఈ టారిఫ్ విధానాల కారణంగా చైనాతో అమెరికా వాణిజ్య ఘర్షణలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలున్నాయి.
ఇది కూడా చదవండి: ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్