
మన(సు)లో మాట
నాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలయింది. మాది మధ్య తరగతి కుటుంబం. నాది ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, నా భార్య ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఇతరులతో పోల్చుకునే తత్వం ఎక్కువ. స్నేహితులు, చుట్టాలు సోషల్ మీడియాలో పెట్టే రకరకాల పోస్టులు చూసి వాళ్ళలాగా ఖరీదైన బట్టలు, నగలు కొనుక్కోవాలి, రెస్టారెంట్లుకి తరచు వెళ్ళాలి, విలాసవంతమైన లైఫ్ గడపాలి అని నన్ను ఇబ్బంది పెడుతుంటుంది. అందుకోసం అప్పులు చేస్తుంది.
నాతో కూడా అప్పులు చేయించింది. హోటల్‌కు కానీ, టూర్‌కి కానీ వెళ్లినా, అక్కడి ఫుడ్‌ని, ప్లేస్‌ని ఎంజాయ్ చేయకుండా తన ఆలోచన అంతా ఫోటోలు తీయడం, వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మీదే ఉంటుంది. ఆ తర్వాత వాటికి ఎన్ని లైక్‌లు, కామెంట్స్ వచ్చాయని చూసుకోవడం... రోజంతా ఇదే సరిపోతుంది. ఆమె పైన ఉన్న ప్రేమతో ఇప్పటిదాకా నేను సహించాను కానీ ఇక నావల్ల కావట్లేదు. ఆమె పద్ధతి మార్చే మార్గముంటే చె΄్తారని ఆశిస్తున్నాను.
– శ్రీకుమార్, విశాఖపట్టణం
సోషల్ మీడియాలో చూసి ఇతరులతో పోల్చుకుంటూ వాళ్లలా ఉండటం కోసం అప్పులు చేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమవుతాయో చెప్పడానికి మీ జీవితమే ఒక ఉదాహరణ. ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాల్లోని వారు కనెక్టవడం కోసం, స్నేహితులు, బంధువులతో మన సంతోషాలు, బాధలు పంచుకోవడం కోసం, సోషల్‌మీడియా ఒక ΄్లాట్‌ఫాం లాగా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది వాస్తవ జీవితానికి దూరంగా, డిజిటల్ లైఫ్‌లోనే బతుకుతూ, సోషల్ మీడియా మాయలో పడి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు.
ముఖ్యంగా నల్గురితో ఫ్రీగా కలవలేనివారు, ఆత్మన్యూనతతో బాధపడేవారు, జీవితంలోని ప్రత్యేక సంఘటనలను ఫిల్టర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, వాటికి వచ్చే కామెంట్స్, లైక్స్ చూసుకుని ఒక ‘ఫేక్ సక్సెస్’(కృత్రిమ విజయం)ని ఆనందిస్తున్నారు. ఎవరి జీవితాల్లోనూ అన్నీ సంతోషాలే ఉండవు. తమ బాధలను, కష్టాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు, కేవలం సక్సెస్ సోరీస్’ మాత్రమే పోస్ట్ చేస్తుంటారు. అది చూసి ఇతరులు కూడా తమ బాధలను పక్కన పెట్టి సక్సెస్‌ను మాత్రమే పోస్ట్ చేయాలన్న తాపత్రయంతో ఇలాంటివి పోస్ట్ చేసి కృత్రిమ ఆనందాన్ని పొందుతుంటారు.
సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమని నమ్మి మీ భార్యలాంటి చాలామంది లేనిపోని ఆర్భాటాలకు పోయి ఇలా అప్పుల పాలవుతున్నారు. కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళటం, సరదాగా ప్రయాణాలు చేయాలనుకోవటం తప్పేం కాదు, కానీ మన స్థోమతని బట్టి అందుబాటులో ఉన్న ప్రదేశాలకి వెళ్ళడం.. అలా వెళ్ళే ప్రదేశమేదైనా కానీ అక్కడ అందరూ సరదాగా గడిపిన క్షణాలు, కబుర్లే మనకు మర్చిపోలేని తీపి జ్ఞాపకాలని గుర్తుంచుకోవాలి. నిజమైన సంతోషం అంటే లాంగ్‌టూర్లు, కాస్ట్‌లీ రెస్టారెంట్లూ కాదు, మనవారితో గడిపే సంతోష క్షణాలే! మీరిద్దరూ కలిసి, ఒకసారి మానసిక వైద్యనిపుణుని కలిస్తే ఆమెకేవైనా వ్యక్తిత్వ సమస్యలు, ఇతర మానసిక ఇబ్బందులు ఉంటే, పరీక్షించి, వాటికి తగిన కౌన్సెలింగ్, చికిత్స ఇస్తారు. మీరు కూడ ఇక ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆశిద్దాం! ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com