కరువు కాలపు పంట బ్రహ్మజెముడు | Spineless cactus as a fodder crop better in summer | Sakshi
Sakshi News home page

కరువు కాలపు పంట బ్రహ్మజెముడు

May 12 2026 6:31 AM | Updated on May 12 2026 6:31 AM

Spineless cactus as a fodder crop better in summer

పశుగ్రాసంతో పాటు 5 ఉపయోగాలు

ముళ్ళు లేని బ్రహ్మజెముడు (స్పైన్‌లెస్‌ కాక్టస్‌) కరువుప్రాంతాల్లో రైతులకు చక్కని పశుగ్రాసం సహా 5 రకాలుగా ఉపయోగపడే ఒక చక్కని పంట. వాతావరణ మార్పులను తట్టుకోగల పంట. తక్కువ నీటితో పెరుగుతుంది. సారహీనమైన నేలల్లో కూడా (చౌడు భూముల్లో తప్ప) పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న తోటల్లో మధ్యలో వరుసలుగా దీన్ని పెంచవచ్చు. ఇది చిన్న రైతులను ఆదుకునే పంట. కరువు పీడిత రైతులకు బహుళ ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. సుస్థిర జీవనోపాధిని కల్పిస్తుంది.

హెక్టారుకు 80 నుంచి 100 టన్నులు
ముళ్ళు లేని బ్రహ్మజెముడు ఒక్కసారి నాటితే 25 సంవత్సరాలకు పైగా ఫలసాయాన్నిచ్చే దీర్ఘకాలిక పంట. చిన్న పండ్లతో సహా ఈ చెట్టులోని ప్రతి భాగం విలువైన పశువుల మేతగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో సమకూరే పచ్చిమేతను అందిస్తుంది. సంవత్సరానికి హెక్టారుకు 80 నుంచి 100 టన్నుల వరకు బ్రహ్మజెముడు ఆకుల దిగుబడి వస్తుంది. కరువు సమయంలో నమ్మకంగా, తక్కువ ఖర్చుతో కూడిన పశుగ్రాసాన్ని అందిస్తుంది. తద్వారా పశుగ్రాస ఖర్చులను తగ్గిస్తుంది. 

దీని ఆకులను అంగుళం ముక్కలుగా కోసి పశువులకు మేపాలి. పాలిచ్చే పశువులకు రోజుకు 10–15 కిలోలు (రోజువారీ పచ్చిమేతలో 25% వరకు) మేపవచ్చని కర్నాల్‌లోని ఎన్‌డీఆర్‌ఐ నిపుణులు చెబుతున్నారు. ఇతర పశువులకు రోజుకు 8–12 కిలోల వరకు, ఆర్నెల్లు పైబడిన దూడలకు 2–4 కిలోలు మేతగా ఇవ్వొచ్చు. క్రమంగా అలవాటు చెయ్యాలి.

బయోగ్యాస్‌ తయారీకి ఉపయోగం
ముళ్ళు లేని బ్రహ్మజెముడు బయోగ్యాస్‌ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఆకులకు 60–65% మీథేన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. బయోగ్యాస్‌ తయారీ తర్వాత వెలువడే స్లర్రీ విలువైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. 3 కిలోల బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల విస్తీర్ణం గల బయో–లెదర్‌ షీట్‌ను తయారు చేయొచ్చు. దీనితో రెండు జతల బూట్లు లేదా మూడు చిన్న బ్యాగులు తయారు చేయవచ్చు. దీని పండ్లు పోషక విలువలతో కూడి ఉంటాయి. దీని ఆకులను కూరగానూ వండుకొని తినొచ్చు.

ఎవరిని సంప్రదించాలి?
ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును వ్యాప్తిలోకి తేవాలంటే రైతులకు దీని గురించి తెలియజె΄్పాలి. నాటుకునే బ్రహ్మజెముడు ఆకులను అందించాలి. మార్కెట్‌ను అనుసంధానం అవసరం. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్‌ సంస్థలు కలసి పనిచేస్తే ఈ కరువు కాలపు పంటను వేగంగా రైతులకు అందించవచ్చు.
ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) అనుబంధ సంస్థ ఇండియన్‌ గ్రాస్‌ల్యాండ్‌ అండ్‌ ఫాడర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. అదనపు సమాచారం కోసం డా. శివ్‌ కుమార్‌ అగర్వాల్‌ను సంప్రదించవచ్చు. 
sk.agrawal@cgiar.org   
 

Advertisement
 
Advertisement
Advertisement