
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు.
ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు.
భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.

పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండా
ఇక్కడ పొలాల్లో, రోడ్‌లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు.

గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు.
ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..
-సిమ్మాదిరప్పన్న.