చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్‌ చలానా! | Small Mistake At Swiss Trip Huge Fine for Indian Tourist Aunty Viral | Sakshi
Sakshi News home page

చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్‌ చలానా!

Jun 1 2026 1:51 PM | Updated on Jun 1 2026 7:53 PM

Small Mistake At Swiss Trip Huge Fine for Indian Tourist Aunty Viral

విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్‌ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. 

పోన్‌ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్‌లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్‌ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్‌ టూర్‌ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్‌ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్‌ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.

ఈ పోస్ట్‌ వైరల్‌గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్‌లో ట్రాఫిక్‌ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్‌ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.

‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్‌ వీసా లేదంటే యూరప్‌ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్‌ ఫీజుపై అప్పీల్‌ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.

ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్‌లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్‌ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్‌ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

షెంగెన్‌ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్‌ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్‌ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్‌లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్‌లో విధించిన ట్రాఫిక్‌ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్‌ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement