Shanta Balu Life Story: పూనా పవార్‌.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా..

Shanta Balu Pawar to train childrens to stick fight - Sakshi

అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని, స్వీయరక్షణలో శిక్షణ పొందినప్పుడు ఆత్మస్థయిర్యం దానంతట అదే పెంపొందుతుందని పర్సనాలటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా నిపుణులు చెప్తున్నారు. మహిళల రక్షణ కోసం పని చేసే విభాగాల ప్రముఖులందరూ ఈ విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోర్సులను పాఠశాల స్థాయిలోనే ప్రవేశ పెట్టాలనే సూచనలు కూడా చేస్తున్నారు. అయితే వీటన్నింటి గురించి ఏ మాత్రం తెలియని ఓ మామ్మ శాంతాబాలు పవార్‌ తాను నివసించే పూనా నగరంలో అమ్మాయిలకు కర్రసాములో శిక్షణనిస్తోంది.

శాంతాబాలు పవార్‌ వయసు 86. మహారాష్ట్రలో శరద్‌ పవార్‌ ఎంత ఫేమసో పూనాలో శాంతాబాలు పవార్‌ అంత పాపులర్‌. దాదాపు ఎనభై ఏళ్లుగా ఆమె పూనా వీధుల్లో విన్యాసాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కర్రసాము, తాడు మీద నడవడం వంటి విన్యాసాలు చేస్తూ పెరిగింది. ఇప్పటికీ ముఖం మీద నుంచి మాస్కు తీసి చీరకట్టుకు దూర్చి, ఆమె రెండు చేతుల్తో కర్రలు పట్టుకుంటే గాలి పక్కకు తప్పుకుంటుంది.

ఆమె చేతి ఒడుపు తగ్గలేదు, వేగమూ తగ్గలేదు. ఒకప్పుడు వీధి ప్రదర్శనకు మాత్రమే పరిమితం అయిన కళ... ఇప్పుడు పూనాలోని ఆడపిల్లలకు స్వీయరక్షణ విద్యగా మారింది. వారియర్‌ ఆజి దగ్గర శిక్షణ తీసుకుంటే తమ ఆడపిల్లల రక్షణ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, భరోసా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు. శాంతాబాలు అజి రెండేళ్ల కిందట కరోనా సమయంలో ప్రారంభించిన శిక్షణకేంద్రం ఇప్పుడు ఆడపిల్లల కర్రసాముతో ధైర్యవికాసం పొందుతోంది. అప్పట్లో సోనూసూద్, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ వంటి సెలబ్రిటీలు శాంతా బాలూ పవార్‌ను అభినందనలతో ముంచెత్తారు.

ఆమె చేతిలోని కర్రసాము యుద్ధవిద్య పూనా అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు ఇరవై మంది సభ్యులున్న ఆజి కుటుంబాన్ని పోషించడానికి ఆధారం అయింది. కరోనా కారణంగా ఆమె కొడుకులకు పని లేకపోవడంతో ఆమె కర్రసాముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. ‘ఇంట్లో ఊరికే కూర్చోవడం నాకు నచ్చదు’’ అంటోంది శాంతాబాలు పవార్‌. అన్నట్లు ఈ వారియర్‌ ఆజీలో నటనాకౌశలం కూడా దాగి ఉంది. 1972లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన హిట్‌ మూవీ ‘సీత ఔర్‌ గీత’లో నటించింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top