ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం తలుపు తట్టినా మన మధ్యతరగతిని వణికించేవి రెండు మాత్రమే! మొదటిది ఇంధన ధరలు, రెండోది బంగారం ధరలు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికెక్కి, అందని నక్షత్రంలా మెరుస్తోంది. బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, తరతరాల సంప్రదాయం కూడా! నేటి ట్రెండ్, రేపటి భద్రత. ‘ఏమైనా సరే, నగలు కొనాల్సిందే!’ అనుకునే వారికి రంగు రంగుల్లో దొరికే బంగారు మిశ్రమ లోహాలు సహా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బడ్జెట్‌లోనే మెరిపించే బంగారు మార్గాల గురించిన ప్రత్యేక కథనం...
బంగారానికి ప్రత్యామ్నాయ లోహాలు...
బంగారం అంటే భారతీయులకు తగని మోజు. ముఖ్యంగా భారతీయులకు బంగారం చూసినప్పుడల్లా దాని మెరుపు మాయలో పడిపోవటం అలవాటు. కాని ఇప్పుడు దానిని తాకగానే, బడ్జెట్ ఒక్కసారిగా సీరియస్ అయి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్‌లో ఒక కొత్త కథ మొదలైంది. ‘బంగారం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం’ అని చెప్పే లోహాలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాయి. పెరుగుతున్న ధరలు, రోజురోజుకీ మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తేలికగా ఉండే డిజైన్లపై పెరుగుతున్న ఆసక్తి, ఇలా ఇవన్నీ కలిసి బంగారానికి ప్రత్యామ్నాయ ఆభరణాలుగా మారి చిన్న చిన్న తారల్లా తళుక్కుమంటున్నాయి.
పైగా ఇవి సరసమైన ధరల్లో దొరుకుతుండటమే కాకుండా, స్టయిల్‌లో కూడా తగ్గేదే లేదంటూ సూపర్ మోడల్స్‌లా మెరిసిపోతున్నాయి. దీంతో అన్ని వయసుల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బంగారం మాత్రమే వివాహాది శుభకార్యాలకు తప్పనిసరి ఎంపికగా ఉండేది. ఇప్పుడు ఆ ఎంపికల ప్రపంచం పెద్దదైంది. అందుకే ఇప్పుడు ఈ ‘న్యూ హీరోస్’ గురించి తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఫ్యాషన్ అడ్వెంచర్‌లాంటిదే!
ప్లాటినమ్ – లగ్జరీ లెజెండ్
జ్యూలరీ ప్రపంచంలో ఒక సైలెంట్ కింగ్ ప్లాటినమ్. ఎక్కువ హడావిడి చేయకుండా, తన క్లాస్‌తోనే అందరినీ ఆకట్టుకుంటుంది. సహజంగా వెండిలాంటి తెల్లటి మెరుపుతో కనిపించే ఈ లోహం చాలా బలమైంది. కాలం గడిచినా తన అందాన్ని కోల్పోదు. అందుకే ‘ఒకసారి కొనిస్తే, సంవత్సరాలు గడిచినా కొత్తదానిలానే మెరిసిపోతుంది’ అంటారు. చరిత్రలో కూడా ప్లాటినమ్ రాజరికపు కథలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీనితో నగలు చేయించుకునేవారు.
ఆ కాలంలో ప్లాటినమ్ ధర కేవలం డబ్బుతో కాదు, ప్రతిష్ఠతో కూడా కొలిచేవారు. ఇప్పటికీ పెళ్లి ఉంగరాలు, ఎంగేజ్‌మెంట్ రింగ్స్, ప్రీమియం జ్యూలరీలో ప్లాటినమ్‌ను ఒక శాశ్వత బం«ధానికి గుర్తుగా భావిస్తారు. స్క్రాచ్‌లు వచ్చినా, వేడి, చెమట, నీరు ఏదైనా సరే తన మెరుపును అలాగే నిలబెట్టుకుంటుంది. అందుకే మెడికల్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ రంగాల్లో కూడా ప్లాటినమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ధరలో సాధారణంగా బంగారంతో సమానంగా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది.
వెండి – బంగారానికి దగ్గరి బంధువు
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభించే విలువైన లోహం వెండి. ఇది బంగారానికి దగ్గరి బంధువు లాంటిది. మెరుపులో ఏమాత్రం తగ్గదు, కానీ ఖర్చులో మాత్రం మనసుకు కాస్త హాయినిస్తుంది. బంగారం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వెండి తక్కువ ధరలో సులభంగా దొరుకుతుంది. అయితే వెండి కథ కేవలం ఫ్యాషన్ తోనే మొదలైపోలేదు; దానికి గొప్ప చరిత్ర, సంప్రదాయం కూడా ఉన్నాయి.
పురాతన కాలంలో రాజులు, సంపన్నులు వెండి పాత్రల్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యానికి మంచిదని, నీటిని శుభ్రంగా ఉంచుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఇప్పటికీ చాలా ఇళ్లలో చిన్నపిల్లలకు వెండి గ్లాస్, వెండి చెంచా వాడే సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు, వెండి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో చిన్న గాయాలకు కూడా వెండి పూత వాడేవారు.
అలాగే పండుగల సమయంలో, ముఖ్యంగా శుభకార్యాల్లో వెండి నాణేలను కానుకగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పరిశ్రమల ప్రపంచంలో కూడా వెండి ఒక ట్రెండీ హీరోనే. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టి రోజువారీ నగలు, స్టయిలిష్ అండ్ సింపుల్ గొలుసులు, మోడ్రన్ జ్యూలరీ డిజైన్ల రూపంలో అందరి చేతుల్లో మెరిసిపోతోంది. సింపుల్‌గా చెప్పాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, స్టయిల్, అందుబాటు ఈ నాలుగు కలిసి వెండిని ఒక స్మార్ట్ చాయిస్‌గా నిలబెడుతున్నాయి.
పలేడియమ్ – సైలెంట్ స్టార్
పలేడియమ్ ప్లాటినమ్ కుటుంబానికి చెందిన అరుదైన లోహం. అందుబాటు కొంచెం తక్కువే, కానీ స్టయిల్‌లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. మొదట్లో ఇది పెద్దగా ఫ్యాషన్ లో కనిపించలేదు. కాని, ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్, ప్రీమియం డైలీ వేర్ జ్యూలరీలో ఇది సైలెంట్‌గా ట్రెండ్ సెట్ చేస్తోంది. సహజంగా తెల్లటి మెరుపుతో ఉండటం వల్ల ప్రత్యేక కోటింగ్ అవసరం లేకుండా సింపుల్‌గా మెరిసిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ, బరువు తక్కువ, లుక్ మాత్రం హై–ఎండ్. ఇదే దీని అసలు స్టయిల్ సీక్రెట్. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.
ఆ తర్వాత కాలక్రమేణా జ్యూలరీ ప్రపంచం దాని ప్రత్యేకతను గుర్తించింది. ముఖ్యంగా వైట్ గోల్డ్‌కు ఒక సులువైన ప్రత్యామ్నాయంగా దీనిని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, పలేడియమ్‌కు కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కొన్ని రోజులు బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో ఉంటుంది, మరికొన్ని రోజులు ‘నేను కూడా లగ్జరీనే!’ అని అంటుంది. బడ్జెట్‌కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ ఎంపికగా పలేడియమ్ నిలుస్తోంది.
టైటానియమ్ – ఫ్యూచర్ మెటల్
టైటానియమ్ అంటే మోడర్న్ జ్యూలరీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్. బరువు తక్కువ, బలం ఎక్కువ. ఇదే దీని అసలైన స్టయిల్. చేతిలో పెట్టుకున్నప్పుడు లైట్‌గా అనిపించినా, మన్నికలో మాత్రం స్టీల్‌కే చాలెంజ్ చేస్తుంది. అందుకే స్పోర్టీ లుక్ కోరుకునే వారికి టైటానియమ్ బెస్ట్ చాయిస్. అయితే, టైటానియమ్ మొదట విమానాలు, రాకెట్ల తయారీలో ఉపయోగించారు.
అక్కడ తన దారుఢ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మెన్స్ జ్యూలరీ, స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్‌లో ఇది ఫుల్ స్పీడ్‌తో ట్రెండ్ అవుతోంది. ఇది తుప్పు పట్టదు, స్క్రాచ్‌లు తక్కువగా పడతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పైగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా సేఫ్. దీంతో, అలెర్జీ సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఇది బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.
బంగారం రంగుల రహస్యం..
బంగారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దాని పసుపు రంగు మెరుపు. అయితే, బంగారం కేవలం ఒక రంగు కథ మాత్రమే కాదు, అది ఒక రంగుల పండుగ. శతాబ్దాలుగా మనుషులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ విలువైన లోహం, కాలంతో పాటు కొత్త కొత్త అవతారాలు తీసుకుంటూ ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తోంది. పసుపు నుంచి తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఇంకా నీలం, నలుపు వరకు ఇలా ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మిశ్రమం, ప్రత్యేక స్టయిల్ దాగి ఉంది.
యెల్లో గోల్డ్ – సంప్రదాయానికి చిరునామా..
బంగారం అసలైన రూపం యెల్లో గోల్డ్. ఇది శతాబ్దాలుగా సంపద, రాజసం, శుభం అనే భావాలకు ప్రతీకగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం అత్యంత శుద్ధమైన రూపం. దాదాపు 99.9 శాతం బంగారం ఉంటుంది. కానీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు లాంటి మిశ్రమాలను ఎక్కువగా వాడుతారు. పెళ్లి నగలు, గొలుసులు, సంప్రదాయ ఆభరణాలు తదితరమైన వాటన్నింటికీ ఇప్పటికీ ఇది మొదటి ఎంపిక. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం, మెరుపు ఎక్కువ కాలం నిలవడం, సింపుల్‌గా మెయింటైన్ చేయగలగడం దీని ప్రధాన ప్లస్ పాయింట్స్. అయితే ఎక్కువ క్యారెట్ల బంగారం కొంచెం సాఫ్ట్‌గా ఉండటం వల్ల సులభంగా గీతలు పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా ‘క్లాసిక్ లుక్’ అంటే ఇప్పటికీ యెల్లో గోల్డ్‌నే.
వైట్ గోల్డ్ – స్టయిల్‌కు సిల్వర్ టచ్
వైట్ గోల్డ్ అంటే మోడ్రన్ ఫ్యాషన్ కు సింబల్. సాధారణ పసుపు బంగారానికి భిన్నంగా, బంగారంలో నికెల్, పలేడియమ్ లేదా వెండిలాంటి ఇతర తెల్లటి లోహాలను కలిపి ఈ ప్రత్యేక రంగు బంగారాన్ని తయారు చేస్తారు. తర్వాత దీనిపై రోడియమ్ అనే మెటల్‌తో కోటింగ్ వేయడం వల్ల ఇది మరింత ప్రకాశవంతంగా, ప్లాటినమ్‌లా మెరిసే లుక్‌ను ఇస్తుంది. చరిత్రలో చూస్తే, 1920ల కాలంలో ప్లాటినమ్ చాలా ఖరీదుగా ఉండటంతో, తక్కువ ఖర్చులో అందించడానికి వైట్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది.
అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది మోడ్రన్ జ్యూలరీలో ఒక ముఖ్యమైన ట్రెండ్‌గా కొనసాగుతోంది. ఇది స్ట్రాంగ్‌గా ఉండటం, స్క్రాచ్‌లు తక్కువగా కనిపించడం దీని ప్రత్యేకత. అయితే రోడియం కోటింగ్ కొంతకాలానికి తగ్గిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు మళ్లీ కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా స్లీక్, స్మార్ట్, మోడ్రన్ లుక్ కోసం వైట్ గోల్డ్ బెస్ట్ చాయిస్.
గ్రీన్ గోల్డ్ – అందాల ఆకుపచ్చ మెరుపు
గ్రీన్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. బంగారంలో ఎక్కువ శాతం వెండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. పాత కాలంలో దీనిని ‘ఎలెక్ట్రం’ అని పిలిచేవారు. ఇది మార్కెట్‌లో ఎక్కువగా కనిపించదు. కాని, ఫ్యాషన్‌లో చాలా పాత ట్రెండ్. ప్రాచీన రాజులు, కళాకారులు ప్రత్యేక ఆభరణాల కోసం ఈ మిశ్రమాన్ని వాడేవారు, ఎందుకంటే ఇది బంగారంతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించేది.
కొన్నిసార్లు రాగిలాంటి లోహాలను కూడా బంగారంలో కొద్దిగా కలిపి మరింత స్ట్రెంగ్త్ ఇస్తారు. ఇది కాస్త నేచురల్ గ్రీన్ టచ్‌లా సాఫ్ట్‌గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో ఉన్న వెండి కారణంగా రంగు కొంచెం డార్క్ కావచ్చు, అదే దానికి ఒక యూనిక్ క్యారెక్టర్‌ను ఇస్తుంది. భారతీయ దుస్తులైనా, వెస్ట్రన్ ఔట్‌ఫిట్‌లైనా ఏ స్టయిల్‌కైనా ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్, క్లాసీ లుక్ కావాలని అనుకునే వారికి గ్రీన్ గోల్డ్ ఒక బెస్ట్ చాయిస్.
రోజ్ గోల్డ్ – ప్రేమకు గులాబీ మెరుపు
స్టయిల్‌లో సాఫ్ట్‌నెస్ ఇచ్చేదే ఈ రోజ్ గోల్డ్. దీని రంగు కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తుంది. బంగారంలో రాగి ఎక్కువగా కలిపితే ఈ అందమైన గులాబీ టోన్ వస్తుంది. అందుకే దీనిని ‘పింక్ గోల్డ్’ అని, పాతకాలంలో ‘రష్యన్ గోల్డ్’ అని పిలిచేవారు, ఎందుకంటే 19వ శతాబ్దంలో రష్యాలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. చరిత్రలో రాజ కుటుంబాలు, ప్రత్యేక సందర్భాల ఆభరణాల్లో ఈ రంగును ఉపయోగించేవారు.
ఇది సాఫ్ట్‌గా కనిపించినా, రాగి కారణంగా ఇతర గోల్డ్ రకాల కంటే కొంచెం బలంగా ఉంటుంది. పైగా దీని రంగు కాలక్రమేణా తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. అన్నిరకాల చర్మానికి ఈ రంగు సూట్ అవ్వడం వల్ల యువతలో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా ఎంగేజ్‌మెంట్ రింగ్స్, గిఫ్ట్ జ్యూలరీ, డైలీ వేర్ ఆభరణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రొమాంటిక్‌గా, ట్రెండీగా కనిపించాలనుకునే వారు రోజ్ గోల్డ్ ఎంచుకోవటం మంచిది.
బ్లూ గోల్డ్ – అరుదైన నీలి మెరుపు
జ్యూలరీలో రేర్ స్టార్ బ్లూ గోల్డ్. బంగారంలో ఇండియమ్ లేదా ఐరన్ వంటి లోహాలను కలిపి, నియంత్రిత ప్రక్రియలో ఆక్సిడేషన్ చేయడం వల్ల దీనికి నీలి రంగు వస్తుంది. ఈ షేడ్ గాఢంగా కాకుండా, మెటాలిక్ టచ్‌తో సాఫ్ట్‌గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రకం బంగారం ఎక్కువగా ఆధునిక కాలంలోనే అభివృద్ధి చెందింది, ముఖ్యంగా ప్రత్యేక డిజైన్లు, ఆర్టిస్టిక్ జ్యూలరీ కోసం దీనిని ఉపయోగించేవారు. ఇది మార్కెట్‌లో అసలు కనిపించదు; ఎక్కువగా స్టేట్‌మెంట్ జ్యూలరీ, కలెక్షన్ పీసెస్, ప్రత్యేక ఆర్డర్ డిజైన్లలో మాత్రమే కనిపిస్తుంది. తయారీ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, నైపుణ్యం అవసరం కావడం వల్ల దీని ధర కూడా ఎక్కువే. బ్లూ గోల్డ్ ఎక్కువగా కలెక్షన్ ఐటమ్స్ లేదా ప్రత్యేక సందర్భాల కోసం మాత్రమే తయారు చేస్తారు, అందుకే బ్లూ గోల్డ్ ఒక లగ్జరీ స్టేటస్‌గా నిలుస్తోంది.
బ్లాక్ గోల్డ్ –బోల్డ్ స్టయిల్
బ్లాక్ గోల్డ్ అంటే బోల్డ్ స్టేట్‌మెంట్. ఇది సహజంగా ఏర్పడే రంగు కాదు. ప్రత్యేక టెక్నాలజీ, కోటింగ్ లేదా ట్రీట్‌మెంట్ ద్వారా తయారు చేసే మిశ్రమం. రోడియం ప్లేటింగ్, ఆక్సిడేషన్ లేదా లేజర్ ట్రీట్‌మెంట్ వంటి ఆధునిక పద్ధతులతో బంగారానికి ఈ నలుపు రంగు అందిస్తారు. ముఖ్యంగా మోడ్రన్ జ్యూలరీ ట్రెండ్స్ పెరిగిన తర్వాత ఎక్కువగా పురుషుల జ్యూలరీ, హై ఫ్యాషన్ డిజైన్లు, స్టేట్‌మెంట్ రింగ్స్, బ్రేస్‌లెట్స్‌లో ఇది కనిపిస్తుంది. జ్యూలరీతో అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే బ్లాక్ గోల్డ్ ఒక ట్రెండీ ఆప్షన్.
కొత్త డిజైన్లు..
బంగారం ధరలు రోజు రోజుకీ పైకి ఎగబాకుతున్నాయని, స్టయిల్‌లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం స్మార్ట్‌గా డిజైన్స్ ఎంపిక చేసుకుంటే, తక్కువ ఖర్చులోనే అందమైన నగలను పొందుతూ అందం, ఆనందం రెండింటినీ ఆస్వాదించవచ్చు.
అవతారాలు ఎత్తే ఆభరణం
ఒకే నగను మూడు విధాలుగా మార్చుకునే డిజైన్లు ఇప్పుడు చాలా పాపులర్. పెద్ద హారం నుంచి చిన్న చైన్‌గా, లేదా లాంగ్ నెక్లెస్‌ను రెండు చిన్న నెక్లెస్‌లుగా మార్చుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి, మూడు సందర్భాల్లో వివిధ విధాలుగా వాడుకోవచ్చు.
పాతకు కొత్త రూపం
పాతకాలపు ఆభరణాలను కొత్తగా మార్చి, ఆధునిక డిజైన్స్ తో కలిపి తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. దీంతో పాత బంగారం అమ్మి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా, వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. పెళ్లి కూతురి నగలలో కూడా కొత్త ఆకృతులు, కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు బంగారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, సృజనాత్మకతకు కొత్త వేదిక.
హాలో టెక్నిక్
ఈ టెక్నిక్ ఒక చిన్న మ్యాజిక్‌లాంటిది. నగ లోపల ఖాళీగా ఉండేలా తయారు చేస్తారు. బయట నుంచి చూస్తే మాత్రం పెద్దగా, ఘనంగా కనిపిస్తుంది. 40 గ్రాముల్లా కనిపించే నెక్లెస్ అసలు బరువు 20 నుంచి 25 గ్రాములే ఉండొచ్చు. పాతకాలపు భారీ టెంపుల్ జ్యూలరీ కూడా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ లో వస్తోంది. అంటే స్టయిల్ డబుల్, ఖర్చు హాఫ్.
రెండు మెరుపులు
బంగారాన్ని ఇతర లోహాలతో కలిపి తయారు చేసే మిక్స్‌డ్ మెటల్ డిజైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో టాప్‌లో ఉన్నాయి. ఒకే నగలో రెండు రంగుల మెరుపు కనిపించడం వల్ల అది కొత్తగా, మోడర్న్‌గా కనిపిస్తుంది. ఖర్చు తగ్గుతుంది, డిజైనర్ లుక్ కూడా వస్తుంది.
పూత పరి^è యాలు
ఈ టెక్నిక్‌లో నగ పూర్తిగా బంగారంతో కాకుండా, పైపైన మాత్రమే బంగారం పొర వేస్తారు. దీంతో అది గోల్డ్‌లా మెరిసిపోతుంది, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వన్ గ్రాము గోల్డ్ లాంటివే కనిపిస్తాయి, కానీ అసలు బంగారం కాదు. పార్టీలు, ఫంక్షన్ లలో గ్రేస్ చూపించడానికి ఇది సూపర్ చాయిస్.
తక్కువలో ఎక్కువ అందం.
ఇప్పటి యువత ఎక్కువ నగలు ధరించడం కన్నా, ఒకే నగతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక అందమైన ఉంగరం, ఒక జత చెవిపోగులు. ఇవే ఇప్పుడు పూర్తి అలంకరణగా మారుతున్నాయి. సాదాసీదాగా, కానీ ఆకర్షణీయంగా కనిపించడం – అందానికి ఇదే నేటి కొత్త మంత్రం.
సంప్రదాయం చిన్న ప్యాక్‌లో
జ్యూలరీలో ‘లైట్ ఈజ్ రైట్’ అనే ట్రెండ్ సూపర్ హిట్‌గా మారింది. పెద్దగా కనిపించే హారం అయినా, చెవి రింగులు అయినా లోపల స్మార్ట్‌గా తక్కువ బంగారంతో డిజైన్ చేసి, బయటకు మాత్రం బీడ్స్, రంగురంగుల స్టోన్స్ , మెరిసే ముత్యాలు జోడించి ఫుల్ రిచ్ లుక్ తీసుకొస్తున్నారు. చేతిలో పెట్టుకుంటే బరువు తక్కువగా ఉంటుంది, కానీ చూసినవారికి మాత్రం ‘ఇది ఎంత గ్రాండ్‌గా ఉంది!’ అనిపించేలా మెరుస్తుంది.
కాలం మారుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, బంగారం ధర రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయినా మన ఇంట్లో ఒక మాట మాత్రం మారదు. ‘బంగారం కొంటేనే భద్రత’ అనే నమ్మకం. అందుకే, బంగారం ఎప్పటికీ ప్రత్యేకమే!
∙ దీపిక కొండి


