
పది వేల సంవత్సరాల వ్యవసాయ సంస్కృతి వారసత్వానికి సజీవ సాక్ష్యాలు మనకున్న దేశీ వరి వంగడాలు. వరి పంట జీవవైవిధ్యానికి మూలాధారమైన ప్రాంతంగా భారతావనికి ప్రపంచవ్యాప్త గుర్తింపుంది. అనాదిగా రైతులు అనంతమైన జీవన గమనంలో తమకు తారసపడిన అపురూప సుగుణ సంపత్తి గల వరి వంగడాలను గుర్తించి, వాటిని జాగ్రత్తగా సాగు చేస్తూ, ఆ పంటలో నుంచే మేలైన పనితీరు చూపిన ధాన్యాన్ని విత్తనాలుగా ఎంపిక చేసి ఇతర రైతులతో పంచుకుంటూ ఉన్నారు. ఈ వారసత్వ వ్యవసాయక పరంపరలో నుంచి వచ్చినవి కాబట్టే వీటిని హెయిర్‌లూమ్ వెరైటీస్ అని హెరిటేజ్ రైస్ వెరైటీస్ అని ఆత్మగౌరవం ఉప్పొంగేలా ఇప్పటికీ పిలుచుకుంటూ ఉన్నాం.
అధిక జనాభాలకు తగిన అధిక దిగుబడుల కోసమని అందుకు అనుగుణమైన అతికొద్ది రకాలను వాణిజ్యపరమైన సాగు కోసం రూపొందించు కున్నాం. అయితే, ఈ హరితవిప్లవ క్రమంలో వ్యాప్తిలోకి తెచ్చిన ఇంప్రూవ్‌డ్ వంగడాల్లో పోషక / ఔషధ విలువలు ఉన్నాయా లేదా అన్న గ్రహింపు లేకుండా అరవయ్యేళ్లు గడిచిపోయాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) – భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) సంయుక్తంగా రెండేళ్ల క్రితం వెల్లడించిన అధ్యయనం ప్రకారం.. గత ఏభయ్యేళ్లలో మనం విరివిగా పండిస్తున్న వరి, గోధుమ వంగడాల్లో పోషకాలు 45% తగ్గిపోయాయి. విషతుల్య పదార్థాలైన భార లోహాలు వచ్చి చేరాయి.
ఇదీ చదవండి: Kullakar Rice : అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 3 నెలల్లోనే ఫలించిన కల
రసాయనిక సేద్యం, పెచ్చరిల్లిన కాలుష్యం మూలాన ఈ విషతుల్య పదార్థాలు మన ధాన్యంలోకి చేరిపోతున్నాయని తేలింది. నేలలో ఉన్న విషతుల్య పదార్ధాలను తీసుకోకుండా జాగ్రత్తపడే ‘ప్రజ్ఞ’ను ఈ ఆధునిక వంగడాలు కోల్పోవటం వల్లే బియ్యంలోకి భార లోహాలు చేరుతున్నాయని కూడా ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. మనం విస్మరించిన దేశీ వరి వంగడాలకు ప్రకృతే ఈ ‘ప్రజ’ను సమకూర్చింది.
దేశీ వరితో కూడిన ఆరోగ్య జీవన విధానం ఇదే!
బాలింతలు, గర్భవతులు, పిసిఓడి సమస్యలు ఉన్న వారు కుల్లాకర్ బియ్యాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యం పొందదవచ్చు లేదా ఆరోగ్య సమస్యలు తగ్గించుకునే పద్ధతులు.
గర్భవతులు,పాలిచ్చే తల్లులకు సూచనలు: గర్భవతులు 3వ నెల నుంచి ఇలా చేయాలి. వెండి గిన్నెలో దేశీ ఆవు పాలను రాత్రి పూట తోడు పెట్టి పెరుగు తయారు చేసుకోవాలి. కుల్లాకర్ బియ్యంతో అన్నం వండి ఆ పెరుగుతో కలిపి ఉదయపు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్)గా తినాలి.
పాలు ఇచ్చే తల్లులకు కుల్లాకర్ బియ్యంతో పాల తాలికలు చేసి సాయంత్రం వేళల్లో వారంలో రెండు సార్లు పెట్టాలి. లేదా.. కుల్లాకర్ బియ్యంతో పరమాన్నం చేసి సాయంత్రం ఆహారంగా వారంలో రెండు రోజులు పెట్టాలి.
కుల్లాకర్ అన్నాన్ని రోజూ మధ్యాహ్న భోజనంలో కుటుంబంలో అందరూ తినవచ్చు. కుల్లాకర్ బియ్యాన్ని 3 గంటలు నానబెట్టి, ఇత్తడి పాత్రలో ఎసరు పెట్టి అన్నం వండుకొని ప్రతి రోజూ మధ్యాహ్నం తినాలి. కనీసం 8 వారాలు అలా చేయాలి.
ఇదీ చదవండి: ట్రెల్లిస్ : అవకాడో, దానిమ్మ.. ఇలా పండించవచ్చు!
పీసీఓడి సమస్యలు ఉన్న మహిళలు, గర్భాశయ సమస్యలు, రుతుక్రమంలో సమస్యలు వున్న వారు కుల్లాకర్ బియ్యాన్ని ఉపయోగించే విధానాన్ని జాగ్రత్తగా గమనించి పాటించాలి.
కుల్లాకర్ బియ్యంతో రాత్రి పూట అన్నం వండాలి. ఒక కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్ళు ఇత్తడిపాత్రలో పోసి ఎసరు పెట్టి వండాలి. పాతకాలం ఇత్తడి గిన్నె లేదా మట్టి పాత్రలో వండాలి. గంజి వంచాలి. ఆ గంజిని పక్కన పెట్టి, మరునాడు సాయంత్రం 4 గంటలకు తాగాలి. వండిన అన్నాన్ని ఇత్తడి పాత్ర నుంచి తీసి వేసి మట్టి పాత్ర లేదా స్టీల్ పాత్రలో వుంచి అన్నం మునిగే వరకూ నీళ్లు పోసి రాత్రంతా వుంచాలి. మరునాడు పొద్దున్నే నానిన అన్నం నుంచి నీటిని వేరు చేయాలి (ఆ నీటిని సాయంత్రం గంజి నీళ్లలో కలిపి తాగలి). నానిన అన్నానికి మజ్జిగ కలిపి దాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. అలా 40 రోజులు చేయాలి. ఇతర ఆహారాలు, పండ్లు, ఊరగాయలు ఏవీ కూడా దీనితో కలిపి బ్రేక్‌ఫాస్ట్‌లో తినకూడదు. రోజూ చేయలేని వారు ఇలా వారంలో కనీసం 5 రోజుల చొప్పున 8 వారాలు చేయాలి. – ఎం. సురేంద్రనాద్, దేశీ ఆహార చైతన్య ప్రచార కార్యక్రమం, సేవ్ స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్
చదవండి: ఓ మహిళ పశ్చాత్తాప స్టోరీ : ‘భర్తలూ మిమ్మల్ని మీరే కాపాడుకోండయ్యా!’