
ద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్ లేదా తీగజాతి పంటలను Y ఆకారంలో ఉండే ఇనుప ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చెయ్యటం తెలిసిందే. అయితే, ఫ్రటెల్లి ఫ్రూట్స్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఎఫ్‌పీసీ) దానిమ్మ, అవకాడో వంటి పొద పంటలను సైతం వినూత్నంగా ఈ పద్ధతిలోనే సాగు చేస్తోంది. మహారాష్ట్ర రాష్ట్రం నాసిక్ సమీపంలో పింపాల్‌గోన్ బసంత్ వద్ద ఫ్రటెల్లి ఫ్రూట్స్ వ్యవసాయ క్షేత్రం ఉంది. అనంత్ బి మోర్ దీనికి చైర్మన్‌గా ఉన్నారు. భారతీయ ఉద్యాన తోటల సాగు రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా చెప్పుకోవచ్చు.
డ్యూక్ 7 వేరు మూలంపై గ్రాఫ్ట్ చేసిన మలుమ అవకాడో చెట్లను, భగువ రకం దానిమ్మ చెట్లను ట్రెల్లిస్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రెసిషన్ ఫార్మింగ్‌లో భాగంగా ట్రెల్లిస్ పద్ధతిలో ద్రాక్షతో పాటు దానిమ్మ, అవకాడో తోటలను పెంచుతున్నారు. మొక్కలు నాటేటప్పుడే శాస్త్రీయ పద్ధతిలో నేలను సిద్ధం చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతిని అనుసరిస్తున్నారు. కొమ్మలను ట్రెల్లిస్‌కు అనుగుణంగా ప్రూనింగ్ చేస్తూ పెంచుతున్నారు. కొమ్మలన్నిటికీ సూర్యరశ్మి, గాలి తగలడానికి, కాయ కోతకు, పిచికారీ చేసే ద్రావణాలు/ పురుగుమందులు చెట్టు మొత్తానికీ అందించడానికి, సమర్థవంతంగా చీడపీడలను నియంత్రించ డానికి.. ఇలా ఈ పద్ధతి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెబుతున్నారు.
కాయలన్నిటికీ ఎండ తగిలేలా చూడటం ద్వారా మచ్చలు లేని, నిగారింపుతో కూడిన నాణ్యమైన కాయలను పండిస్తోంది ఫ్రటెల్లి ఫ్రూట్స్ ఎఫ్‌పీసీ. సమస్యాత్మక వాతావరణ పరిస్థితుల్లో, భారీ వర్షాల తర్వాత కూడా ఆరోగ్యదాయకమైన దానిమ్మ పండ్ల దిగుబడి తీస్తుండటం విశేషం. ఎఫ్‌పీసీ సభ్యులైన రైతులకు అధిక దిగుబడులు సాధించడానికి లాభదాయకమైన, మెరుగైన సాగు పద్ధతులపై ఈ ఎఫ్‌పీసీ శిక్షణ ఇస్తోంది.
చదవండి: 6 నెలల్లో 27 కిలోలు తగ్గాను..ఇదంతా దాని పుణ్యమే!
25–26 తేదీల్లో బయోచార్‌పై జాతీయ సదస్సు
భూసారం పెంపుదలతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగించటంలో ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసే కట్టె బొగ్గు (బయోచార్) ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. అంతర్జాతీయంగా కార్బన్ క్రెడిట్స్ పొందే అవకాశం ఉండటంతో రైతులతో పాటు అనేక మంది వ్యక్తులు, వాణిజ్య సంస్థలు బయోచార్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25,26 తేదీల్లో ‘ప్రోగ్రెస్సివ్ బయోచార్ సొసైటీ, హైదరాబాద్’ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎన్‌ఐ–ఎంఎస్‌ఎంఈ (నిమ్స్‌మే) ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. సొసైటీ అకడమిక్స్ డైరెక్టర్ డా. ఎం.ఎ. ఆరిఫ్ ఖాన్ – 97018 76662.