తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.
కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్‌లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.
కోర్టును ఆశ్రయించిన తల్లి
పేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్‌ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్య
హైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.
‘ది పేరెంట్’ ఏకవచనమే
‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.
చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్‌ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
పాప భవిష్యత్తే ముఖ్యం
‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి


