మీకిది తెలుసా? ఓ మోసగాడి లీలతో ‘హిప్నాటిజం’, ప్లాసిబో ఎఫెక్ట్‌ పుట్టుకొచ్చిందని

Psychic Day 2021: History And Significance Of Hypnosis - Sakshi

మైమరచిపోయేలా చేయడం.. మంత్ర  ముగ్ధులను చేయడం.. మెల్లగా వశం చేసుకుని చెప్పినట్టు చేసేలా చేయడం.. ఇదంతా హిప్నాటిజం. మరి ఈనాటి ఈ హిప్నాటిజానికి మూలం ఏమిటో తెలుసా?.. 18వ శతాబ్దం నాటి మెస్మరైజేషన్‌.. తన అంతరాత్మకు అనంతమైన శక్తి ఉందని.. ఆ ‘సైకిక్‌ పవర్‌’తో వ్యాధులన్నీ నయం చేస్తానని జనాన్ని నమ్మించిన ఓ వ్యక్తి లీలలే. అతడు తెలియక చేసినా.. చివరికి అదంతా సైన్స్‌ అని తేలడం, రెండు కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపడం విశేషం. ఈ ఆదివారం (ఆగస్టు 1) ‘సైకిక్‌ డే’ సందర్భంగా ఆ కథేంటో తెలుసుకుందామా? 

అది 1770వ సంవత్సరం.. ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలం.. అనారోగ్యానికి గురైన వారి రక్తాన్ని జలగలతో పీల్పించడం, రోగం తగ్గుతుందంటూ గాయాల నుంచి రక్తం మరింతగా కారిపోయేలా చేయడం జరుగుతున్న కాలం.. శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేస్తే భయంతో తిరస్కరిస్తున్న కాలం. మంత్రతంత్రాలను విపరీతంగా నమ్మే ఆ సమయంలో ఓ వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఏ రోగాన్నైనా తగ్గించగలనంటూ జనాన్ని ఆకర్షించాడు. ఆయనే ఫ్రాంజ్‌ ఆంటోన్‌ మెస్మర్‌. ఆయన పేరులోని మెస్మర్‌ నుంచే మెస్మరైజేషన్‌ అనే పదం పుట్టింది. 

‘యానిమల్‌ మ్యాగ్నెటిజం’ పేరుతో.. 
ఆస్ట్రియాకు చెందిన మెస్మర్‌.. జనాన్ని మాయ చేయడానికి తనదైన ఓ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. దానికి ‘యానిమల్‌ మ్యాగ్నెటిజం’ అని పేరుపెట్టాడు. భూమితోపాటు సూర్యచంద్రులు, ఇతర గ్రహాల అయస్కాంత, గురుత్వాకర్షణ శక్తులు మనుషుల శరీరంపై ప్రభావం చూపిస్తాయన్నాడు. మన శరీరం ఒక శక్తివంతమైన అయస్కాంతం అని, అందులోని జీవశక్తి ‘మ్యాగ్నెటిక్‌ ఫ్లూయిడ్‌’ అని చెప్పాడు. వీటి పనితీరును గ్రహాల శక్తులు దెబ్బతీయడం వల్లే ఏవేవో రోగాలు వస్తాయని ప్రకటించాడు. తనకున్న సైకిక్‌ శక్తులను ఉపయోగించి కేవలం తన చేతులతో ఏ రోగాన్నైనా తగ్గిస్తానని ప్రచారం చేశాడు.ఈ మాటలు జనంపై విపరీతంగా ప్రభావం చూపాయి. ఆయనకు విపరీతంగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. సాధారణ ప్రజలే కాదు.. ఫ్రాన్స్‌ మహారాణి మేరీ ఆంటోనెట్టే కూడా మెస్మర్‌ వైద్యం మాయలో పడ్డారు. 

ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి.. 
శారీరక, మానసిక సమస్యలతో బాధపడే చాలా మంది మెస్మర్‌ ప్రచారాన్ని నమ్మి చికిత్స కోసం వచ్చేవారు.‘గ్రహాల శక్తులు, యానిమల్‌ మ్యాగ్నెటిజం’ వంటి అంశాలు మానసిక సమస్యలున్న వారిని ఆకర్షించాయి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, డిప్రెషన్, ఏదో ఒక విషయంగా తీవ్రంగా భయపడటం వంటి ఇబ్బందులు ఉన్నవారు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. 
మెస్మర్‌ వారిలో కొందరికి ఒంటరిగా.. మరికొందరికి గ్రూపులుగా ‘రోగాలు నయం చేసే ప్రక్రియలు’ నిర్వహించేవాడు. పెద్ద బాత్‌టబ్‌లలో నీళ్లు నింపిపెట్టి.. అవి అయస్కాంత నీళ్లుగా చెప్తూ వాటిలో కూర్చోబెట్టేవాడు. తన చేతులను వారి ముందు తిప్పుతూ ఏదో శక్తులను ప్రయోగిస్తున్నట్టు చేసేవాడు. ఆ సమయంలో పేషెంట్లు మైమరపు (ట్రాన్స్‌)లోకి వెళ్లేవారు.  తిరిగి లేవగానే తమలో ఏదో కొత్త ఉత్తేజం వచ్చినట్టు ఉత్సాహపడేవారు. 

‘నమ్మకమే చికిత్స’ అని తేలింది అప్పుడే 
ఓవైపు మెస్మర్‌కు జనంలో విపరీతంగా ఆదరణ పెరగడం, మరోవైపు ఆయన చికిత్స విధానాన్ని శాస్త్రవేత్తలు తప్పుపట్టడంతో అప్పటి ఫ్రాన్స్‌ ప్రభుత్వం రంగంలోకి దిగింది. మెస్మర్‌ వైద్య ప్రక్రియలు, పద్ధతులపై విచారణ చేయించాలని నిర్ణయించింది. 1784లో ప్రఖ్యాత శాస్త్రవేత్త, రాజకీయ నేత బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి బాధ్యత అప్పగించింది. శాస్త్రవేత్తలు ‘యానిమల్‌ మ్యాగ్నెటిజం’ అంతా ఉత్త కల్పనే అని తేల్చారు. 
► చిత్రమేమిటంటే.. మెస్మర్‌ దగ్గరికి వెళ్లినవారిలో చాలా మందికి వ్యాధులు తగ్గుముఖం పడుతుండేవి. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి బయటపడేవారు. మరి ఇదెలా సాధ్యమైందన్న దానిపై శాస్త్రవేత్తలు గట్టిగా పరిశోధన చేశారు. అప్పుడే ఓ అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అదే ‘ప్లాసిబో’ ఎఫెక్ట్‌. 

ఏమిటీ ‘ప్లాసిబో’ ఎఫెక్ట్‌
ఏదైనా రోగం/మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నవారికి ఏదైనా మందు, చికిత్సతో నయమవుతుందని పూర్తి విశ్వాసం కలిగించగలిగితే.. వారిలో ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. నిజానికి వారికి ఎలాంటి మందు ఇవ్వకున్నా, చికిత్స చేయకున్నా సరే.. ఉత్తుత్తి మందులు, చికిత్సతోనే కొంతవరకు కోలుకుంటారు. బాధితులు తమకు నయమైపోతుందన్న నమ్మకంతో ఆందోళనలను వదిలేసి, ఉత్సాహంగా ఉండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. దీనినే ‘ప్లాసిబో’ ఎఫెక్ట్‌గా పిలుస్తారు. కొందరు వైద్యుల దగ్గరికి వెళ్తే తమకు త్వరగా వ్యాధులు తగ్గిపోతాయని జనం నమ్ముతుంటారు. అందరు వైద్యులు ఇచ్చేది దాదాపు ఒకే రకమైన మందులు అయినా కూడా.. వారి దగ్గరికి వెళ్లినవారు త్వరగా కోలుకుంటుంటారు. దీనికి ప్లాసిబో ఎఫెక్ట్‌ కారణమని చెప్పొచ్చు. 

హిప్నాటిజానికి బీజం పడింది అప్పుడే.. 
► మెస్మర్‌కు శక్తులేమీ లేవని, అదంతా కల్పితమని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఆయన ఫ్రాన్స్‌ వదిలి వెళ్లిపోయాడు. సాధారణ జీవనం గడిపి.. 1815లో చనిపోయాడు. ఆయన పేరుతో ‘మెస్మరిజం (మాయచేయడం, మంత్రముగ్ధులను చేయడం)’ పదం పుట్టి చిరస్థాయిగా నిలిచిపోయింది. 
► మెస్మర్‌ విధానాలు కల్పితమే అయినా అందులోని నిగూఢమైన సైన్స్‌ సంగతులు బయటికొచ్చాయి. ప్లాసిబో ఎఫెక్ట్‌ను గుర్తించడానికి, హిప్నాటిజం పుట్టుకకు కారణమయ్యాయి. 
► 1841లో ప్రఖ్యాత స్కాటిష్‌ వైద్యుడు జేమ్స్‌ బ్రెయిడ్‌ ‘హిప్నాటిజం’ ప్రక్రియను ప్రతిపాదించాడు. మెస్మర్‌ ‘యానిమల్‌ మ్యాగ్నెటిజం’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూనే.. మనుషుల్లో నమ్మకం కలిగించడం, వారిని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి మానసిక సమస్యలకు చికిత్స చేయడం వంటివి హిప్నాటిజం ద్వారా సాధ్యమని చెప్పాడు. మొత్తంగా ఓ మోసగాడి లీలలు.. వైద్యంలో రెండు కీలక ప్రక్రియలకు మూలంగా నిలవడం విశేషం. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top