
ఈ వర్షాకాలం అనంగానే వ్యాధుల భయం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులకు జలుబు, జ్వరం వంటి అనారోగ్యాలు తక్షణమే అటాక్ అవుతాయి. ఓ పట్టాన తగ్గవు. దాంతో సాధారణంగా తల్లిదండ్రులు సమీపంలో ఉన్న మెడికల్ షాఫుకో లేక ఇంట్లోనే ఎప్పటిదో పారాసెటమాల్ సిరప్ ఉంటే వెంటనే వేసేస్తాం. తగ్గిపోతే సరే లేదంటే ఇక తప్పని పరిస్థితుల్లో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. చాలామటుకు తల్లిదండ్రులు ఇలానే చేస్తారు. కానీ ఇలా పారాసెటమాల్ ఉపయోగించేటప్పుడూ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.
ప్రీడియాట్రిక్ నిపుణులు పిలల్లకు జ్వరం రాగానే పారాసెటమాల్ వేయడం వరకు కరెక్టే అయినా..అది వైద్యుల సిఫార్సు మేరకు వేయడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎందుకంటే..డాక్టర్లు కూడా పారాసెటమాలే సూచిస్తారు. కానీ ఎంత మోతాదు ఉపయోగించాలనేది బాటిల్‌పై ఉండే ఇన్ఫర్మేషన్‌ని అనుసరించి ఉంటుందని నొక్కి చెబుతున్నారు. నెలల పిల్లలకు సాధారణంగా చుక్కల మోతాదుని సూచించడం జరుగుతుంది.
దాన్ని ఒక నిడిల్ సాయంతో డ్రాప్స్ మాదిరిగా ఇస్తాం అందులో గాఢత పరిమాణం ఎక్కువ. అలా కాకుండా 2 నుంచి 5 ఎంఎల్ మాదిరిగా అయితే మాత్రం కాస్త గాఢత తక్కువ ఉంటుంది. అది గమనించి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వయసుల వారిగా చిన్నారులకు ఇవ్వాల్సిన మోతాదులో వ్యత్సాసం కూడా చాలా వేరుగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు.
అలాగే ఇంట్లో ఒకసారి సీల్ తీసిన పారాసెటమాల్ సీసాలను మరొసారి వినియోగించేటప్పుడూ ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. ఎందుకంటే..పారాసెటమాల్‌ని ఒక్కసారి వినియోగించిన బాటిల్‌ని మహా అయితే ఆ తర్వాత నెల వరకు వినియోగించ్చొచ్చట. అదే నెలల తరబడి వాడితే ఆ మందులోని గాఢత తగ్గిపోతుందట. అదీ సరిగా పనిచేయకపోవచ్చు లేదా ఒక్కోసారి దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
సాధ్యమైనంత వరకు తల్లిందండ్రులు పిల్లలకు జ్వరం అనంగానే పారాసెటమాల్ ఇవ్వొద్దనే అంటున్నారు. చిన్నారి పరిస్థితి అనుసరించి ముందుగా వైద్యులను సంప్రదించి, వాళ్ల సూచనల మేరకు వాడితేనే శ్రేయస్కరమని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రలూ..జ్వరం అనగానే పారాసెటమాల్ కాదు..ఎంత వరకు ఉపయోగించాలి, అవసరమా కాదా అన్నది బేరీజు వేసుకుని ఉపయోగించండి మరి..!.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: అందువల్లే భారత్‌కి తిరిగి రావాలనుకుంటున్నా..? రూ. 1.2 కోట్లు శాలరీ చాలా..)