కళ్లల్లో కారం కొట్టడం ద్వారా గంజాయి మానరు.. కొట్టాలా? తిట్టాలా? ఎలా నచ్చజెప్పాలా?

Parenting Tips: How to Teach Good Behavior To Children, Know More - Sakshi

పేరెంటింగ్‌

చెడు అలవాటుకు బానిసైన తొమ్మిదో క్లాసు అబ్బాయినిస్తంభానికి కట్టేసి కంట్లో కారం పెట్టింది తల్లి. పాత రోజుల్లో తల్లిదండ్రులు ఇంతకుమించిన కఠిన శిక్షలే వేశారు. తాళ్లతో కట్టి బావుల్లో వదిలి భయపెట్టారు. భయంతో పరివర్తన వస్తుందా? ప్రేమతో వస్తుందా? నచ్చచెప్పడంతోనా? పెడత్రోవ పట్టిన  వ్యసనాల బారిన పడిన పిల్లలను దారికి తెచ్చేది ఎలా? 

 మన దేశంలో పిల్లలు ఇల్లు విడిచి పారిపోవడానికి ప్రధాన కారణం ఇద్దరు.
– దండించే తల్లిదండ్రులు
– దండించే స్కూల్‌ టీచర్లు.
∙∙ 
పిల్లల లోకం చాలా చిన్నది. వారి ఊహల్లో భయాలు చాలా పెద్దవి. ‘రేపు హోమ్‌వర్క్‌ చేసుకుని రాకపోతే డొక్క చింపుతా’ అనే వార్నింగ్‌ ఆ సంగతి మర్చిపోయి నిద్ర లేచిన పిల్లాడికి తీవ్ర భయం రేపుతుంది. స్కూల్‌కి వెళ్లనంటే ‘వీపు పగులుతుంది’ అనే తల్లిదండ్రులు సిద్ధం. అటు స్కూల్లో.. ఇటు ఇంట్లో దండన భాష తప్ప మరో భాష వినపడదు. పిల్లాడేం చేస్తాడు? పారిపోతాడు.

‘నాలుగు దెబ్బలేయండి సార్‌. దారికొస్తాడు’ అని తల్లిదండ్రులు స్కూల్లోకొచ్చి చెబుతారు. అంటే పిల్లాడికి స్కూల్లో రక్షణ లేదని అర్థమవుతుంది. ‘మీ పిల్లాడు మా మాట వినడం లేదు. నాలుగు తగిలించి దారిలో పెట్టండి’ అని తల్లిదండ్రుల్ని స్కూలుకు పిలిచి వార్నింగ్‌ ఇస్తాడు హెడ్‌మాస్టర్‌. అంటే.. ఇంట్లో కూడా కోటింగే. పిల్లాడు ఏం చేయాలి. పారిపోతాడు. 


కోదాడలో జరిగిన తాజా ఘటన ఇప్పుడు చర్చ లేవదీసింది. అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు. తల్లి, తండ్రి ఎంత మందలించినా గంజాయి మానలేదు కానీ చదువు మానేశాడు. కొంతకాలం ఇంటిలోనుంచి ఎటో వెళ్లిపోయాడు. మొన్న గంజాయి తాగి ఇంటికొచ్చిన కొడుకును చూసి తల్లి రగిలిపోయింది. స్తంభానికి కట్టి కళ్లల్లో కారం కొట్టింది. ఆ మంటకు పిల్లవాడు ఆర్తనాదాలు చేశాడు. అందరూ అది వీడియో తీశారు. దానిని వైరల్‌ చేశారు. ‘మమకారం’ అని టైటిల్స్‌ పెట్టారు. ఆ పిల్లాడు రేపటి నుంచి ఎలా ఈ ‘చెడ్డపేరు’ను తట్టుకుంటూ వీధుల్లో తిరగాలో ఎవరూ ఆలోచించలేదు. ఆ దండించాలనుకున్న తల్లి ఆ పిల్లాడి ప్రైవసీని కాపాడాలి అనుకోలేదు. ఆ తల్లి మంచి పని చేసిందని కొంతమంది తక్షణం స్పందించారు. కాని లోతుగా ఆలోచిస్తే ఇలాంటి శిక్షలు ఏ మాత్రం మేలు చేయవు. హాని తప్ప.
∙∙ 
ఎంత చిత్రమో చూడండి. గతంలో సంతానం ఎక్కువగా ఉండేది. ఏ పిల్లాడు ఏం చేస్తున్నాడో పెద్దగా పట్టేది కాదు. లేదా బతుకు బాదరబందీలో మునిగి ఉండేవారు. కొందరు పిల్లలు స్కూల్‌ ఎగ్గొట్టడం, ఈతకు వెళ్లడం, సిగరెట్ల కాల్చడం, పేకాట, సినిమాలు... ఈ వ్యసనాలకు మరిగేవారు. ఎప్పుడో తెలిసేది. తండ్రి జుట్టు పట్టుకుని వచ్చి ఇంట్లో పడేసి బెల్టుతో తన్నేవాడు. తల్లి చీపురు తిరగేసేది. చేతులూ కాళ్లూ కట్టేసి ఎండలో పడేసేవారు. తాడు కట్టి బావిలో వదిలేవారు. ఊహించని శిక్షలు వేసి రికార్డులకెక్కిన తల్లిదండ్రులు ఉన్నారు. కాని చిన్నపిల్లలు వాళ్లు. వాళ్లకు ఎప్పుడూ అర్థమయ్యేది ప్రేమ భాషే. భయం అదుపు చేస్తుంది. ప్రేమ పరివర్తన తెస్తుంది. ఈ చిన్న విషయాన్ని నేటికీ చాలామంది తల్లిదండ్రులు, గురువులు తెలుసుకోరు.


∙∙ 
వ్యసనాలకు అలవాటు పడే వీలు తల్లిదండ్రులే కల్పిస్తారు. ఏది ఎంత వరకు అనుమతించారో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పరు. సెల్‌ఫోన్, గేమ్స్, ఫ్రెండ్స్‌తో చాటింగ్‌.. తమ జోలికి రావడం లేదు కదా అని వదిలేస్తారు. తీరా వారు అడిక్ట్‌ అయ్యాక దండనకు దిగుతారు. దాని బదులు వారి కోసం సమయం వెచ్చించాలి అనుకోరు. పిల్లల స్నేహితులు ఎవరు? వారు స్కూల్‌కు వెళుతున్నారా? స్కూల్‌ అయ్యాక ఎవరితో తిరుగుతున్నారు, ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నారు తల్లిదండ్రులకు తెలియదు. ఏదో ప్రమాదం ఇంటి మీదకు వస్తే తప్ప. ఇవాళ పదో క్లాసులోనే స్మోకింగ్, ఆల్కహాల్‌ వరకూ వెళుతున్న పిల్లలు ఉన్నారు. పోర్నోగ్రఫీ బారిన పడుతున్నారు. ప్రేమ వ్యసనం ఒకటి ఎలాగూ ఉంది. కన్నదే ఒకరిద్దరు అయినప్పుడు వారికి తగినంత ఖర్చుకు ఇవ్వాలి కదా గారం చేయాలి కదా అని అనుకోవడం కూడా ప్రమాదంగా మారింది.

ఏదీ తక్కువ వద్దు. ఏదీ ఎక్కువ వద్దు. అతి ప్రేమ... అతి కోపం ఏదీ వద్దు. పిల్లలతో చేసే ఎడతెగని సంభాషణే పిల్లల్ని, తల్లిదండ్రులని కాపాడుతుంది. పిల్లలు చాలామంచి రిసీవర్స్‌. వారు వ్యసనాలను ఎంత తొందరగా రిసీవ్‌ చేసుకుంటారో పరివర్తనను కూడా అంతే తొందరగా చేసుకుంటారు. వారితో సంభాషించాలి అంతే. కళ్లల్లో కారం కొట్టడం ద్వారా గంజాయి మానరు. అది తక్కువ మార్కులు వస్తున్నందుకు విధించిన దండన అయితే గనుక మార్కులూ రావు. నిపుణుల సహాయం తీసుకోవాలి. కౌన్సిలర్‌లు ఈ వ్యసనాల నుంచి ఎలా బయటపడాలో చెబుతారు. ట్యూషన్లు పెడితే మార్కులు ఎలా రావాలో వారు చెబుతారు. అంతే తప్ప మనం దండించడం వల్ల, కడుపు మాడ్చడం వల్ల, నలుగురి మధ్యలో అవమానించడం వల్ల ఫలితం ఉండదు.

పిల్లలు ఇలా అయ్యారు అని దండించే ముందు వాళ్లు ఎందుకు అలా అయ్యారు ఎవరి పాత్ర ఎంత? వారిని సంస్కరించడంలో ఎవరి భాగస్వామ్యం ఎంత? అనేది పరిశీలించుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. ఇంట్లో పదహారు ఓటీటీలు మనమే పెట్టించి ‘ఎప్పుడూ టీవీ చూస్తుంటావేమిరా’ అని కారం డబ్బా అందుకుంటే ఆ కారం కొట్టాల్సింది ఎవరి కంట్లో. ప్రేమ, సంభాషణ... సమస్య, అవగాహన ఇవే తల్లిదండ్రులను, పిల్లలను కాపాడుతాయి. ఈ విషయాన్నే ఇప్పుడు వైరల్‌ చేయాల్సింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top