నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా.. | Operation Sindoor: Led by Two lady officers Sofiya Qureshi Vyomika Singh | Sakshi
Sakshi News home page

నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..

May 7 2025 4:30 PM | Updated on May 9 2025 12:29 PM

Operation Sindoor: Led by Two lady officers Sofiya Qureshi Vyomika Singh

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత మే 7 బుధవారం తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి బదులిచ్చింది.  నాడు ఆ విషాదకర ఘటనలో మోదీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ 'సిందూరం' పేరుతోనే ఆపరేషన్‌ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్‌. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే..ఈ ఆపరేషన్‌ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పడం విశేషం. అంతేగాదు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది మీడియా ముందు వెల్లడించారు కూడా. మరీ ఆ ఆదిపరాశక్తులు ఎవరు? ఏవిధంగా ఈ ఆపరేషన్‌ని విజయవంతంగా ముగించారు తదితర విశేషాలు చూద్దామా..!

వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సిందూర్‌ ఆపరేషన్‌ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సిందూర్‌ ఆపరేషన్‌కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. 

సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్‌ హోదాలో ఆపరేషన్‌ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్‌గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్యంసం సృష్టించగా, వ్యోమికా సింగ్‌  ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. 

ఈ ఇరువురి మహళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ బలగాలు పాకిస్థాన్‌ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై మెరుపులు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్‌లో ఉన్న టెర్రర్‌ ఇండక్షన్‌లు, ట్రైనింగ్‌ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేగాదు విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్‌ గురించి ప్రపంచానికి తెలియజేయడమే గాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలెట్‌ చేసింది. 

	ఉగ్ర గుట్టు విప్పారు ఎవరీ సోఫియా, వ్యోమికా?

సాహసాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఇరువురు..

  • ఇక్కడ  సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. అంతేగాదు సోఫియా ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.

  • సోఫియా యూఎన్‌ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు సేవలందించారు.

  • ఐక్యరాజ్యసమితి మిషన్‌లో (2006) గణనీయమైన సేవలు అందించారు

  • వ్యోమిక తన పేరుకు తగ్గట్టే పైలట్‌ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారామె. అంతేగాదు తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా వ్యోమిక పేరుగడించింది. డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. 

  • భారత్‌లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుత వంటి విమానాలను నడిపారామె

  • ఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు.
  • 2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలకమైన రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించింది

  • 2021లో త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారు

హర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధితులు..
ఆ ఆపరేషన్‌ గురించి వినగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయన్నారు పహల్గామ్‌ బాధితులు. మా కుంకుమను నేలరాల్చిన వారికి అదే పేరుతో ఆపరేషన్‌ చేపట్టి మట్టికరిపించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని గద్గద స్వరంతో అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ధీమాగా చెప్పారు.

(చదవండి: Operation Sindoor: మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్‌ సిందూర్‌.. పహల్గాం బాధితుల రియాక్షన్‌)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement