ఐఏఎస్‌ కల : మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు! | National Doctors day special chit chat with Dr Harsh Khandalia | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ కల: మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!

Jul 1 2025 2:40 PM | Updated on Jul 1 2025 3:14 PM

ప్రతీకాత్మక చిత్రం

స్టడీస్‌

ఎలాగైనా యూపీఎస్‌సీ పరీక్ష రాసి ఐఏఎస్‌ సాధించాలనే తపనతో చదువుతున్నాడు మిస్టర్‌ రంజిత్‌ (పేరు మార్చాం). అతడు నరాలు తెగే ఏకాగ్రతతో చదువుతుంటే గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌) అనే సమస్య అతడి నరాలను దెబ్బతీసింది.  జీబీఎస్‌ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఏదైనా ఇన్ఫెక్షన్‌కు గురైన తర్వాత వస్తుందిది. ఇందులో నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపైన ఉండే ‘మైలీన్‌’ అనే పొర దెబ్బతింటుంది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్‌ వెలువడి... అవి తమ సొంత మైలీన్‌ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌ అందక సొంత అవయవాలు అచేతనమవుతాయి. 

అందునా ఈసారి రంజిత్‌కు వచ్చిన వ్యాధి మామూలు జీబీఎస్‌ కాదు. జీబీఎస్‌ వచ్చేవాళ్లలోనూ ప్రతి 1000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన, అత్యంత తీవ్రమైన గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌  (Guillain-Barré syndrome (GBS) రకమిది. నరాల కూడలి (నోడల్‌) ప్రదేశాల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘నోడోపతి’ అంటారు. అది ఎంతటి తీవ్రమైనదంటే... సాధారణంగా కాళ్ల నుంచి పైకి చచ్చుబడిపోయేలా చేసే ఆ వ్యాధి... ఇతడిలో మాత్రం దేహమంతా అచేతనమయ్యేలా చేసింది. ఊపిరి తీసుకునేందుకు సహాయపడే కండరాలు అచేతనమైపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణం పోతుంది కదా. అలాంటిది అతడి కంటికి సంబంధించిన కండరాల్లో కొంత మినహాయించి మిగతా దేహమంతా కదలిక లేకుండా పోయింది. 

సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ అతడిని దెబ్బతీసిందేమో కానీ పరిస్థితులు అతడి సంకల్ప బలాన్ని ఏమాత్రమూ దెబ్బతీయలేకపోయాయి. సొంత కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డ తీరు అసామాన్యం, అనితరసాధ్యం, నిరుపమానం, నిరంతర స్ఫూర్తి. సొంత సోదరి కూడా ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతుండటంతో ఆమె అతడిలో మోటివేషన్‌ నింపుతూ ఉంది. 

అతడి పరిస్థితికి అతడిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐవీఐజీ అనే తరహా ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సి ఉంది. ఇది బాగా ఖరీదైన చికిత్స. అతడిది కేవలం ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. దాంతో అతడి మనోబలాన్ని పెంచేందుకూ, అతడిలో స్ఫూర్తి రగిలించేందుకూ మేం డాక్టర్లం కూడా అతడికి ఆర్థికంగా కొంత  సహాయం (క్రౌడ్‌ ఫండింగ్‌) చేశాం. ఆసుపత్రి కూడా తనవంతు అండదండలందించింది. 

అన్నివైపుల నుంచి అందుతున్న సహకారాలతో అతడు రెండునెలల పాటు ఐసీయూలో వ్యాధితో పోరాడాడు. ఈలోపు మరో రెండుసార్లు ఇన్ఫెక్షన్‌ వచ్చి అతడిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్లింది. దాంతో అతడి పరిసరాలు అత్యంత శుభ్రంగా ఉండేలా చేశాం. అతడికి అందే ఆహారాలు బలవర్థకంగా ఉండేలా చూశాం. రిటుక్సిమాబ్‌ అనే ఇమ్యూన్‌ సపోర్ట్‌ మందులిచ్చాం. ఇలా అనేక ప్రయత్నాలు చేసి అతడిని కాపాడాం. రెండు నెలల పాటు అతడి నరాలకు ఏ ఆహారమూ అందకపోవడంతో, అవి రెండునెలల పాటూ ఏ పనీ చేయకపోవడంతో... ఆ తర్వాత ఎంతో బలహీనపడి శక్తిపుంజుకునేందుకు ఎంతో కష్టమైంది. అయినప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో అతడెంతో కష్టపడి బయటకొచ్చాడు. ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు. 

చదవండి: బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్‌స్పైర్‌ చేసిన ఇంట్రస్టింగ్‌ కథనం

ఈ ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది పరీక్ష రాద్దువుగానీ అంటే... ‘‘లేదు సర్‌... మీరిచ్చిన ప్రోత్సాహంతో ఈ ఏడాది కూడా పరీక్ష రాయాల్సిందే. అది కుదరకపోతే నేను చెబుతుంటే ఎవరైనా స్క్రైబ్‌ను పెట్టుకునైనా సరే’’ అన్నాడా అబ్బాయి. మేం ఒక టీమ్‌గా పనిచేసే డాక్టర్లమంతా కలిసి, మా శక్తియుక్తులన్నీ వెచ్చించి,  సంయుక్తంగా అతడిని మృత్యుదేవత ఒడిలోంచి బలవంతంగా వెనక్కుతీసుకొచ్చామంటే అది  అతిశయోక్తి కాదు. 

ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్‌ వీడియో

క్రిటికల్‌ కేర్‌లో పనిచేసే మేము రోజులోని 24 గంటలూ క్రిటికల్‌ కేసుల్నే చూస్తాం. ఇటీవలే మేం ఒక డబుల్‌ ట్విన్స్‌ కడుపులో ఉన్న మహిళను రక్షించాం. అత్యంత సంక్లిష్టమైన టీబీ ఇన్ఫెక్షన్లూ, చాలా అరుదుగా కనిపించే మెనింజైటిస్‌ విత్‌ టీటీపీ అనే  కేసులూ చూశాం. కానీ ఇలా చదువుకోసం తాపత్రయపడే ఓ చురుకైన కుర్రాణ్ణి మేమంతా ఓ టీమ్‌గా రక్షించిన ఉదంతం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది.

డాక్టర్‌ హర్ష్‌ ఖండేలియా సీనియర్‌ కన్సల్టెంట్‌ 
క్రిటికల్‌ కేర్‌ ఫిజీషియన్, కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

-యాసీన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement