
మనిషిలో సమతుల్యత అనేది భూమి మధ్యలో వున్న ఇరుసు లాంటిది. మానవుడిని అతిగా భవిష్యత్ లేక గతం వైపు వెళ్లకుండా ఒక నిశ్చలమైన, నిర్దిష్టమైన సమతుల్య స్థితిలో ఉంచేది అతనిలో అంతర్గతంగా సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థలో ఉన్న సుషుమ్నా నాడి. అదే మనలోని ఇరుసు (అక్షం). మనం ఎప్పుడూ మనలోని ఇరుసు అయిన సుషుమ్న మీదనే ఉండాలి.
అలాగే భూమి ఇరుసే (అక్షం) సుషుమ్న. భూమాతలో నిక్షిప్తమై ఉన్న ఇరుసు ఎంత బలంగా పనిచేస్తుందంటే, విశ్వం ఎంత విశాలంగా వ్యాప్తి చెంది ఉన్నా సరే, భూమి తన ఇరుసు ఆధారంతో అత్యంత వేగంగా తిరుగుతూనే ఉంటుంది. తద్వారా పగలు మనం పనిచేసుకొనేటట్లు, రాత్రి నిద్రించేటట్లుగా మనలను సమతుల్య స్థితిలో ఉంచడానికి అది పగలు, రాత్రులను సృష్టించింది. అంతేకాకుండా తాను సూర్యుని చుట్టూ తిరుగుతూ, సగం దేశాలలో వేసవికాలం, సగం దేశాలలో శీతాకాలాన్ని కలిగించేలా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇరుసే ఇదంతా నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఈ ఇరుసు విశ్వంలో పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలకు భూమిని అవసరమైనంత దూరంలో ఉంచుతుంది.
చదవండి: World Sparrow Day 2025 : పిచ్చుకలు మెచ్చేలా!
ఈ కేంద్రం లేక ఇరుసు భూమి మేధస్సునే కాదు, పరిమళాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఈ కేంద్రమే భూమి సుషుమ్నా నాడి అని చెప్పవచ్చు. ఈ కేంద్రం ద్వారానే ’స్వయంభూలు’ వెలుస్తూ ఉంటాయి. భూకంపాల లాంటి గొప్ప విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. నిజానికి కదిలేది ఈ ఇరుసే. అదొక గొప్పశక్తి. ఆ శక్తి భూమాతలోని లావాను వివిధ దిశలలో పంపిస్తుంది. ఆ లావా భూమిపైకి చొచ్చుకుని రావడం వల్ల భూకంపాలు, అగ్ని పర్వతాలలాంటివి ఏర్పడతాయి. ఇవన్నీ భూమాతలోని ఇరుసుకు ఉన్న అవగాహన వలననే ఏర్పడతాయి. అంతేకాదు ఋతువులు కూడా ఏర్పడతాయి. వివిధ రకాల ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు, వాటిని మనకు అందించడానికే ఈ కాలాలు సృష్టించబడ్డాయి. భూమాత తనలోని ఉష్ణాన్ని కోల్పోతే, మొత్తం మంచుతో గడ్డకట్టిపోవడం వలన మనకు తినడానికి ఏమీ ఉండదు. చంద్రగ్రహమే ఇక్కడ ఉన్నట్లుగా ఉంటుంది.
(తరువాయి వచ్చేవారం)
– డా. పి.రాకేష్
(పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)