తెలంగాణ ఇక్కత్‌ చీరలో రాధికరాజే గైక్వాడ్ ! ఏకంగా నాలుగేళ్లు.. | Maharani Radhikaraje Gaekwad of Barodas stunning Telangana Ikat saree | Sakshi
Sakshi News home page

అద్భుతమైన తెలంగాణ ఇక్కత్‌ చీరలో రాధికరాజే గైక్వాడ్ ! ఏకంగా నాలుగేళ్లు పాటు..

May 25 2026 3:01 PM | Updated on May 25 2026 3:24 PM

Maharani Radhikaraje Gaekwad of Barodas stunning Telangana Ikat saree

పూర్వపు బరోడా (వడోదర) రాచరిక రాష్ట్ర మహారాణి సాంప్రదాయ భారతీయ నేత కళల పునరుద్ధరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారామె. అంతేగాదు ఒకప్పుడు కేవలం మరాఠా రాజ కుటుంబాల కోసం మాత్రమే నేయబడి..ఇప్పుడు కనుమరుగైన చారిత్రాత్మక బరోడా శాలు పునరుద్ధరణ కోసం, రాజమాత శుభాంగిని రాజేతో కలిసి నాయకత్వం వహించారు కూడా. ఆమె వద్ద 100 ఏళ్లకు ముందు ఉండే పురాతనమైన వారసత్వపు చీరలతో సహా, అబ్బురపరిచే చీరల సేకరణ కూడా ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ప్రసిద్ధ నేత చీరలను ధరించి, ఫోటోలను షేర్‌  చేస్తూ ఉంటారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పురాతన చీరలకు నిధిలా ఉంటుంది. అవి మనకు రకరకాల నేతలు, వాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంటుంది. అలానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పోస్ట్‌ సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. ఆ చీరకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే విస్తుపోతారు. మరి అవేంటో సవివరంగా తెలుసుకుందామా.!.

మహారాణి రాధికరాజే గైక్వాడ్‌ తాజా ఇన్‌స్టాగ్రామ్‌లో సికింద్రాబాద్‌కు చెందిన వరశ్రీ వారు రూపొందించిన తెలంగాణ సుప్రసిద్ధ ఇక్కత్‌ చేనేత చీరలో కనిపించారు. ఆ చీరపై డబుల్ ఇక్కత్‌, కంబైన్డ్‌ ఇక్కత్‌ పద్ధతులు అరుదైన సమ్మేళ్లనంతో 30 రంగులలో నేసిన 108 అసలైన తేలియా రుమాల్ జ్యామితీయ నమూనాలు ఉన్నాయి. 

ఆమె ఆ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ఇక్కత్‌లలో ఒక అద్భుతమైన కొత్త భాష ఉంటుంది. ఇది సాంప్రదాయ నైపుణ్యం, గణితం, సహనం, సృజనాత్మకత, ఆవిష్కరణల కలయిక. ఈ కళ సంక్లిష్టత మాత్రమే తనని ఆకట్టుకోలేదని, దాని వెనుకున్న అంకితభావం, నెలల తరబడి పరిశోధన, మరచిపోయిన నమునాల సంగ్రహాలు, అంతులేని గ్రాఫ్ పేపర్లు, 60 రంగులద్దే సెషన్‌లు, నిపుణులైన సమిష్ట స్ఫూర్తి తదితరాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారామె. 

అందువల్ల తనకు ఆ చీర అత్యంత గొప్పదిగా కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ రాధికారాజే ధరించిన చీర ఏకంగా నాలుగు నెలలపాటు నేశారట. ఇంద్రధనుష్‌గా పిలిచే ఈ చీరలో మోటీఫ్‌ల మధ్య ఇంద్రధనుస్సుని తలపించే రంగులు, డబుల్ ఇక్కత్‌ మోటిఫ్‌లలో చదరంగం గళ్ల వంటి నిర్మాణాలు, తెలంగాణ ఇక్కత్‌ కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తదితరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చీరలు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ చీర అరుదైన కలెక్షన్స్‌కి చెందిన శారీగా పేర్కొనవచ్చు అని రాధికారాజే అంటున్నారు.

తెలియా రుమాల్ చరిత్ర
తెలియా రుమాల్ అనేది తెలంగాణలోని నల్గొండ జిల్లా పుట్టపాక, ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ చేనేత వస్త్ర కళ. ఈ కళలో నూలును నువ్వుల నూనె, ఆముదం తదితర మూలికలతో శుద్ధి చేసి, డబుల్ ఇక్కత్ పద్ధతిలో జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇది 19వ శతాబ్దానికి చెందిన కళ. దీనికుండే  జిడ్డు స్పర్శ, వాసన వాటన్నింటిని సూచిస్తుంది. సాధారణంగా ఇలాంటి ఫ్యాబ్రిక్‌ని తల లేదా మెడ, నడుము కట్టుకునే వస్త్రాలుగా ఉపయోగించేవారు. 

దీన్ని 'ఆసియా రుమాల్' గా వాణిజ్య ఎగుమతి చేసేవారు. గుజరాత్‌కు చెందిన పటోలా లాగా, చేనేత మగ్గంపై నేయడానికి ముందు వార్ప్, వెఫ్ట్ దారాలు రెండింటికీ రెసిస్ట్-డైయింగ్ చేసే డబుల్ ఇకాట్ పద్ధతిలో నేయబడిన కొన్ని దక్షిణాసియా వస్త్రాలలో ఇది ఒకటి. ఈ తేలియా రుమాల్‌లోని నూనె దుమ్మును దూరంగా ఉంచడం తోపాటు వాష్‌బుల్‌ కానీ విధంగా ధరించేవారట.

ఇక డబుల్ ఇక్కత్‌ అనేది ఒక సంక్లిష్టమైన నేత పద్ధతి, దాని ఫలితంగా, తేలియా రుమాల్ వస్త్రంలో ఉపయోగించే మూలాంశాలు మొదట్లో "వజ్రాలు, నక్షత్రాలు, చతురస్రాలు, చుక్కలు, చారలు, గడులు వంటి సరళమైన జ్యామితీయ ఆకారాలుగా ఉండేవి, ఇవి తరచుగా మొజాయిక్ పనిని పోలిన కలయికలలో అమర్చబడేవి. అయితే, 1920, 1930ల మధ్య, అవి మార్పులు చోటు చేసుకోవడంతో మనుషుల నమూనాలను, విమానాలు, గ్రామఫోన్లు, గడియారాలు వంటి కొన్ని సమకాలీన మూలాంశాలను కూడా చేర్చడం మొదలైంది. అంతేగాదు 2020లో తెలంగాణకు చెందిన తేలియా రుమాల్‌కు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్‌) కూడా  లభించింది.

 

(చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్‌ ట్రెండ్‌..! ఇది పెద్దలకు మంచిదా?)

Advertisement
 
Advertisement
Advertisement