
విద్యానగర్(కరీంనగర్): కృష్ణ అనే రెండు అక్షరాలు ప్రణవ మంత్రము, మొదలైన పవిత్ర మంత్రాలన్నింటితో సమానమైనవి. సర్వ భయాలు, విఘ్నాలను తొలగించి విజయ పథంలో నడిపించే అద్భుత చైతన్యం కృష్ణనామం. సత్యం జ్ఞాన మనస్తం బ్రహ్మ, ఆనందోబ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్యాన్ వంటి ఉపనిషత్ వాక్యాల సారం శ్రీకృష్ణ నామమే.
కృష్ణతత్వం..
కృష్ అంటే భూమి న అంటే లేకపోవడం అని అర్థం. కృష్ణుడు అన్ని మతాలు, దేశాలు, కాలాలకు వర్తించే దివ్య సందేశాన్ని భగవద్గీత ద్వారా అందించి చిరస్మరణీయుడయ్యాడు. పరమ దుషు్టలైన కంస, జరాసంధ, శిశుపాల, నరకాసురాది రాక్షసులను సంహరించి జగద్రక్షకుడయ్యాడు. భారతదేశాన్ని యుధిష్టరుని పాలనలో ఏకచత్రాధిపత్యం కిందికి తెచ్చిన రాజనీతి దురంధరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు.
కృష్ణావతారం..
సమగ్రమైన ఐశ్వర్యం అంటే శాసించే అధికారం, సంపూర్ణ ధర్మం, నిర్మలమైన యశస్సు, పరిపుష్టమైన సౌభాగ్యం, విజ్ఞానం, నిశ్చలమైన వైరాగ్యం ఈ 6 భగవంతుడి లక్షణాలు. నారాయణుని దశావతారాల్లో ప్రతీ అవతారానికి ఇందులో కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని లక్షణాలున్న పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, చతుర్భుజుడు, శంకచక్ర, గద, పద్మాదరుడు, మణిమయ రత్నమకుట కంకణ ధారుడై శ్రీమహా విష్ణువు ఎనిమిదో అవతారం కృష్ణావతారం. సుమారు 5వేల సంవత్సరాల క్రితం కారాగారంలో దేవకి–వాసుదేవులకు శ్రావణ బహుళ కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఆ బాల గోపాల పుణ్యాల పున్నమిగా శ్రీకృషుŠ?ణ్డ జన్మాష్టమి వేడుకలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. బాల కృష్ణుడి లీలలు వయోభేదం లేకుండా అందరినీ అలరించేవే. పాలు, పెరుగు, వెన్నె చౌర్యంతో చిలిపి చేష్టలతోపాటు పసి వయసులోనే పలువురు రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలావినోదం వర్ణనలకు అతీతమైంది. అందుకే పారాడే పసిబిడ్డలందరూ ఈరోజు బాలకృష్ణులు మాత్రమే కాదు.. వాళ్ల అల్లరిని ఆనందించి, అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లులందరూ యశోదమ్మలే.
ఉట్ల పండుగ
శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున పిల్లలకు బాలకృష్ణుడి వేషధారణ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాల్యంలోని శ్రీకృష్ణుడి విన్యాసాలకు చిహ్నంగా ఉట్ల పండుగను వేడుకగా జరుపుతారు. అందనంత ఎత్తులో ఉట్టిని కట్టి.. అందులోని వెన్నను సాహసంతో తీసుకొచి్చన వాళ్లను బాలకష్ణుడి ప్రతీకలుగా భావించేవారు. ప్రస్తుతం ఉట్లలో పాలు, వెన్నకు బదులు డబ్బులు ఉంచి గెలిచినవారికి బహుమతిగా ఇస్తున్నారు. ఉట్టి కొట్టే వేడుక ఆద్యంతం పిల్లలు, యువకులతోపాటు అందరినీ అలరిస్తుంది. ఉట్టిని అందుకునేందుకు చేసే ప్రయత్నాలను సున్నితమైన పద్ధతుల్లో భంగపరుస్తూ వినోదిస్తుంటారు.
శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాల ప్రయోజనాలు వేర్వేరు. ఆదర్శ మానవుడికి ప్రతీక శ్రీరాముడు. అందుకే ఆయన ఏకపత్నీవ్రతుడు. దైవానికి ప్రతీక శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కర్మయోగి, కష్టసుఖాల ఎరగక అలసట తెలియక పనులు చేసి ఉచ్చనీచాలన్నీ భరించాడు. లోకోద్ధరణ కృష్ణావతార పరమార్థం. ఉపనిషత్తులు, వేదాల సారాన్ని అందరికీ విడమరిచి అందుబాటులో ఉండేట్లు భగవద్గీతగా చెప్పాడు. జ్ఞానం కంటే పవిత్రమైంది వేరేది లేదు. ఆత్మ జ్ఞానం లభించిన వాడు శాంతి పొంది చివరకు భగవంతుని చేరగలడని జగత్తుకు ఉపదేశమిచ్చి శ్రీకృష్ణుడు జగద్గురువైయ్యాడు.
– పవనకృష్ణశర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్