జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్‌ అనిపించుకుంది! హెయిర్‌లెస్‌ మోడల్‌గా సత్తా చాటింది

Ketaki Jani An Alopecian Model The Bald And Beautiful  - Sakshi

‘‘నిర్దిష్టమైన లక్షణాలు, ముఖ కవళికలు అందాన్ని నిర్వచించలేవు. ఎందుకంటే జుట్టు ఉన్నా లేకపోయినా గుండెల్లో ఆత్మవిశ్వాసం... పెదవులపై చిరునవ్వూ ఉంటే అందంగానే ఉంటారు’’ అని నిరూపించి, ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది కేతకీ జానీ. నలభైఏళ్ల వయసులో అలోపేసియా వ్యాధితో కేతకీ జుట్టు రాలిపోయినప్పటికీ కృంగిపోకుండా హెయిర్‌లెస్‌ మోడల్‌గా రాణిస్తూనే అలోపేసియా బాధితులకు అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తోంది. 

అహ్మదాబాద్‌లో పుట్టిన కేతకీ జానీ పుణెలో పెరిగింది. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక బిఏ, బిఈడీ, ఎమ్‌ఏ చేసింది. మహారాష్ట్ర టెక్ట్స్‌బుక్‌ ప్రొడక్షన్‌లో ప్రత్యేక అధికారిగా పనిచేసేది. ఉన్నట్టుండి కేతకీ జుట్టు రాలిపోవడం మొదలైంది. అలా రాలిపోయిన ప్రదేశంలో కొత్త వెంట్రుకలు వచ్చేవి కావు. విచిత్రంగా అనిపించింది. జుట్టు ఇలా రాలిపోవడానికి అలోపేసియా అంటే పేనుకొరుకుడు వ్యాధి కారణమని డాక్టర్‌ చెప్పారు. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లేదని తెలిసి కేతకి తీవ్రనిరాశకు గురైంది. 

జుట్టు రాలిపోయి తను అసహ్యంగా మారిపోతుందేమో అని భయపడిపోయింది. ఒకపాప, బాబుకు తల్లి అయిన కేతకికి భర్త కూడా మద్దతుగా నిలవకపోవడం, బంధువులు, ఇరుగు పొరుగు క్యాన్సరా? అని అడగడం, అంతా అవహేళన  మాటలు, చూపులు... దాంతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని త్యజించాలనుకుంది. కానీ తను లేకపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందో తలచుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంది. వ్యాధితోనే పోరాడుతూ బతకాలని నిర్ణయించుకుంది. గుండులా మారిన తలపైన టాటూలతో అందంగా అలంకరించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. 

అవహేళన కాదు అండగా నిలవండి..
‘‘ఎంతో ఒత్తుగా ఉండే నా జుట్టు 2010 నుంచి ఊడిపోవడం మొదలైంది. దీంతో తీవ్ర నిరాశలో కృంగిపోయాను. అందరూ నన్ను అదోరకంగా చూస్తుండడంతో ఆఫీసుకు త్వరగా వెళ్లి త్వరగా వచ్చేసేదాన్ని. ఇలా కొన్నాళ్లు భయంభయంగా గడిపాను. జుట్టు లేకపోతేనేం? గుండు మీద టాటూలు వేసుకుంటే అందంగా కనిపించవచ్చన్న ఆలోచన వచ్చింది. వెంటనే టాటూలు వేసుకున్నాను. ఫరవాలేదనిపించి ధైర్యంగా మోడలింగ్‌లో అడుగు పెట్టాను. అక్కడ దక్కిన గౌరవంతో హెయిర్‌లెస్‌ మోడల్‌గా ఎదిగాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగిన తరువాత... నాకున్న సమస్య గురించి వివరించి చెప్పడం మొదలు పెట్టాను. అలోపేసియా గురించి అవగాహన కలిగించి గుండెల్లో ధైర్యం నింపితే బాధితులకు ఊరటగా ఉంటుంది’’ అని కేతకీ జానీ కోరుతోంది.

యాడ్‌ చూసి...
ఒకరోజు మిసెస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ కాంపిటీషన్‌ యాడ్‌ చూసి కాంపిటీషన్‌లో పాల్గొంది. ఆ పోటీలో పాల్గొన్న తొలి అలోపేసియా బాధితురాలిగా నిలిచింది. ఆ తర్వాత మిసెస్‌ యూనివర్స్‌ కాన్ఫిడెంట్‌గా, మిసెస్‌ పూనె, మిస్‌ అండ్‌ మిసెస్‌ పూనే ఇంటర్నేషనల్, మిసెస్‌ పాపులర్‌ వంటి అనేక టైటిల్స్‌ను వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. కొప్పున్నా లేకున్నా ఆత్మవిశ్వాసమే అందం అని నిరూపించింది. హెయిర్‌లెస్‌ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతకి తనలా మరెవరూ బాధపడకూడదన్న ఉద్దేశ్యంతో అలోపేసియా గురించిన అవగాహన కల్పిస్తోంది. వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది బాధితులకు ధైర్యాన్ని నూరిపోస్తోంది.  

(చదవండి: ఆమె మదర్‌ ఆఫ్‌ 'పిల్‌'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top