‘తొలి ఉమన్‌ ఆఫ్‌ కలర్‌’ ఆమె

Kesha Ram Celebrates US Senate Seats In Salwar Kameez - Sakshi

సెనెట్‌లో సల్వార్‌ కమీజ్‌

జనవరి 6న యూఎస్‌ సెనెట్‌లో ఒక రికార్డు నమోదు అయింది. వెర్మాంట్‌ రాష్ట్ర సెనెటర్‌గా కేషా రామ్‌ అనే 34 ఏళ్ల మహిళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రానికి సెనెటర్‌ అయిన ‘తొలి ఉమన్‌ ఆఫ్‌ కలర్‌’ ఆమె. అంటే నాన్‌–వైట్‌. అదే ఆమె సృష్టించిన రికార్డు. అయితే అంతకన్న ఆసక్తికరమైన సంగతి మరొకటి ఉంది. సూట్‌లు, కోట్‌లు, సూట్‌ గౌన్‌లతో ఉండే వంద మంది సెనెటర్‌ల ఆ∙పాశ్చాత్య సభలో కేషా రామ్‌.. సల్వార్‌ కమీజ్‌ దుస్తుల్లో తన ప్రమాణ స్వీకారానికి భారతీయతను చేకూర్చారు! కేషా రామ్‌ భారత సంతతి మహిళ. సర్‌ గంగారామ్‌ ముని మనవరాలు. సల్వార్‌ కమీజ్‌ వేసుకుని ఆమె సెనెట్‌కు వెళ్లడం మనకొక ముచ్చటయింది ఇప్పుడు.

ప్రమాణ స్వీకారం జరిగిన మూడు వారాలకు కేషా రామ్‌ సల్వార్‌ కమీజ్‌లో ఉన్న ఫొటో మొన్న మంగళవారం ట్విట్టర్లో ప్రత్యక్షం అయింది. లాహోర్‌లోని యూఎస్‌ కాన్సొలేట్‌ జనరల్‌ ఆ ఫొటోను పోస్ట్‌ చేసింది. ‘ఆధునిక లాహోర్‌ పితామహులు సర్‌ గంగారామ్‌ మునిమనవరాలు కేషా రామ్‌ వెర్మాంట్‌ స్టేట్‌ సెనెటర్‌ అయ్యారు. ప్రమాణ స్వీకార సందర్భంలో ఆమె సల్వార్‌ కమీజ్‌లో కనిపించారు’ అని కాన్సొలేట్‌ ఆమె ఫొటోను పెట్టి, ట్వీట్‌ను జతపరిచింది. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ కేషా రామ్‌ స్పందించారు. ‘నాకొక ఫ్రెండ్‌ చెప్పారు.

లాహోర్‌ ప్రజలు ప్రతిరోజూ మా గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ కోసం ప్రార్థనలు జరుపుతూ ఉంటారని! మహిళల ఆరోగ్యం కోసం, విద్య కోసం ఆయన ఎంతో చేశారని ఈ రోజుకూ తలచుకుంటూ ఉంటారట’ అని ట్వీట్‌ చేశారు. ‘ముత్తాతగారి వారసురాలిగా నన్ను గుర్తించడం నాకెంతో సంతోషకరమైన సంగతి’ అయిందని కూడా ఆమె అన్నారు. దీంతో సహజంగానే ఈ ‘గ్రేట్‌’ గ్రాండ్‌ ఫాదర్, ‘గ్రేట్‌’ గ్రాండ్‌ డాటర్‌లు వార్తల్లోకి వచ్చారు. 
∙∙ 
కేష తండ్రి ముకుల్‌ రామ్‌. 1960 లలో పై చదువుల కోసం లాహోర్‌ నుంచి యూఎస్‌ వలస వచ్చారు. లాజ్‌ ఏంజెలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో చదివారు. తర్వాత ఉద్యోగం చూసుకుని, పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయారు. కేషా తల్లి జెవిష్‌–అమెరికన్‌. కేషా చదువు కూడా కాలిఫోర్నియాలోనే. పై చదువులు యూనివర్సిటీ ఆఫ్‌ వెర్మాంట్‌లో. అక్కడ ఆమె విద్యార్థి సంఘానికి అధ్యక్షురాలు కూడా. 2008లో డిగ్రీ పూర్తయింది. వెంటనే పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. వెర్మాంట్‌ సభకు పోటీ చేసి గెలిచి, 21 ఏళ్ల వయసులో అతి చిన్న వయసు లేజిస్లేచర్‌గా గుర్తింపు పొందారు. 2016లో వెర్మాంట్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నరుగా డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడి ప్రేమరీ రేస్‌లోనే ఓడిపోయాక, కొన్నాళ్లు రాజకీయాలకు విరామం ఇచ్చారు. తిరిగి వెర్మాంట్‌ సెనెటర్‌గా పోటీ చేసి గెలిచారు. 

ఇక కేష తాతగారి గురించి ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. లాహోర్‌కి 64 కి.మీ. దూరంలో ఉన్న మాంగ్తన్‌వాల పట్టణంలో 1851లో ఆయన జన్మించారు. రూర్కీలోని ప్రఖ్యాత థాంప్సన్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ (నేటీ ఐ.ఐ.టి.రూర్కీ) లో స్కాలర్‌షిప్‌తో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేశారు. గోల్డ్‌మెడల్‌ సాధించారు. 1900లో లార్డ్‌ కర్జన్‌ దగ్గర సూరింటిండెంట్‌గా ఉన్నారు. లాహోర్‌ పట్టణ నిర్మాణానికి  పన్నెండేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా వ్యవహరించారు. ఆ కాలానికి ‘గంగారామ్‌ పీరియడ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌’ అని ఈనాటికీ పేరు. ఢిల్లీలో, లాహోర్‌లో ఇప్పుడున్న గంగారామ్‌ హాస్పిటళ్లు ఆయన పేరు మీద వెలసినవే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top