కథాకళి: ఫటాఫట్‌ | kathakali funday story | Sakshi
Sakshi News home page

కథాకళి: ఫటాఫట్‌

Apr 19 2026 9:43 AM | Updated on Apr 19 2026 9:44 AM

kathakali funday story

అతని శ్రావ్యమైన కంఠం, మెత్తని నడవడిక అతనిలోని దుర్మార్గానికి తెరలని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది.ఆ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుజీవ్‌ ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. పౌడర్‌ తప్ప మరే మేకప్‌ లేని, కనుబొమలని కట్‌ చేసుకుని దిద్దుకోని ఆమె సహజమైన అందం, ఆమె చురుకుదనం అతన్ని ఆకర్షించాయి.సుజీవ్‌ తండ్రి ఉద్యోగరీత్యా తూర్పు గోదావరి జిల్లాకి పోలీస్‌ సూపరింటెండెంట్‌. ఆయన అన్యాయార్జితంతో తన పేర స్థాపించిన ఫైనా¯Œ ్స కంపెనీని సుజీవ్‌ మేనేజ్‌ చేస్తున్నాడు. హైద్రాబాద్‌లో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ఇరవై ఆరు అంతస్తుల భవంతిలో, టాప్‌ ఫ్లోర్‌లో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్‌మెంట్‌లో సుజీవ్‌ ఒంటరిగా ఉంటాడు. అది సుజీవ్‌ తండ్రి అక్రమసంపాదనతో తన భార్య పేర కొన్న ఆస్తి.

ఓరోజు ఆఫీస్‌లో లంచ్‌ చేస్తూ సుజీవ్‌ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. ‘‘నా భార్యకి పబ్‌ కల్చర్‌ అంటే ఇష్టం. వద్దన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి బతిమాలి తెస్తానని ఎదురుచూసింది. కాని విడాకులు తీసుకుంటానని ఆమె ఊహించలేదు. నువ్వు అన్నీ ఫటాఫట్‌ చేసేస్తూంటావు. మన వ్యాపారానికి అది ముఖ్యం. నీకు అభ్యంతరం లేకపోతే మన పెళ్ళి గురించి మీ పెద్దలతో మాట్లాడతాను.’’ఆమె దిమ్మెరపోయింది. తను ఎక్కడ? అతను ఎక్కడ? ఆమె గాల్లో తేలుతూ ఇంటికి వెళ్ళింది. వారం తర్వాత ఆమె అర్జెంట్‌ కాగితాల మీద సంతకాలు తీసుకోడానికి అతని అపార్ట్‌మెంట్‌కి వచ్చింది. 

అతను చొరవ తీసుకుంటే ఆమె సిగ్గుగా అభ్యంతరం చెప్పింది తప్ప ఎదురు తిరగలేదు.మూడు వారాల తర్వాత ఓరోజు ఆమెకి సుజీవ్‌ నించి ‘నువ్వు అర్జెంట్‌గా నా ఇంటికి వస్తావా?’ అనే మెసేజ్‌ వచ్చింది. ‘మా నాన్నగారికి వడదెబ్బ కొట్టి ఇప్పుడే తేరుకుంటున్నారు. అందుకే సెలవు పెట్టాను సర్‌. ఆయన్ని చూసుకోవాలి’ సమాధానం పంపింది.‘‘పర్సనల్‌గా మాట్లాడాలి. ఓ అరగంట వచ్చి వెళ్ళలేవా?’’ ఫోన్‌ చేసి అడిగాడు.‘‘సరే సర్‌.’’ అతని కంఠంలోని అభ్యర్థనని గుర్తించి చెప్పింది.‘‘జాగ్రత్తమ్మా. నగరంలో హీట్‌ వేవ్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని టీవీలో చూపిస్తున్నారు.’’ తల్లి హెచ్చరించింది. ఆమెని చూడగానే సుజీవ్‌ చెప్పాడు.‘‘మా నాన్నగారు చిక్కుల్లో పడ్డారు. బయటపడటానికి ఒకరిని మంచి చేసుకోవాలి.

 లేదా ఆయన ఉద్యోగం ఊడొచ్చు.’’‘‘అయ్యో.’’‘‘అందుకు నువ్వో మనిషిని సంతోషపెట్టాలి.’’‘‘నాకు అర్థం కాలేదు సర్‌.’’ అయోమయంగా చూస్తూ చెప్పింది.‘‘అర్థం కాకపోడానికి ఏంలేదు. నన్ను సంతోషపెట్టినట్లే. అతన్ని వచ్చే బుధవారం మన ఆఫీస్‌ గెస్ట్‌ హౌస్‌లో కలుసుకోవచ్చు.’’ఆమె తను విన్నది నమ్మలేకపోయింది. తనని పెళ్ళి చేసుకుంటానని అడిగిన ఇతనేనా ఈ మాట అన్నది? అతను తనని పెళ్ళి చేసుకోడని ఆమెకి వెంటనే తట్టింది. ఆమె దుఃఖం కోపంగా మారడంతో కంఠం పెంచి చెప్పింది.‘‘సారీ! నేను అలాంటిదాన్ని కాదు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను.’’‘‘నీకా అవకాశం లేదు. ఆ ఏíసీబీ డైరెక్టర్‌ని నువ్వు తృప్తి పరచాలి.’’అతను లేప్‌టాప్‌లో వాళ్ళిద్దరి రతికేళి వీడియోని ప్లే చేసాడు.‘‘ఏమిటిది? ఏమిటీ మోసం?’’ ఆమె మరోసారి నిర్ఘాంతపోతూ గట్టిగా అరిచింది.

‘‘దీన్ని మీ తల్లిదండ్రులు చూడకూడదనుకుంటే, బుధవారం ఎక్కడ పికప్‌ చేయటం నీకు సౌకర్యమో చెప్పు.’’తను బ్లాక్‌మెయిల్లో చిక్కుకుందని ఆమెకి అర్థమైంది.  ఆమె కన్నీళ్ళు ఆపుకుంటూ లేచి మెట్లెక్కి టెర్రేస్‌లోకి వెళ్ళింది.ఆమె ఏకాంతంగా ఏడవడం కోసం పైకెళ్ళిందని సుజీవ్‌కి అర్థమైంది. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతను టెర్రేస్‌లోకి వెళ్ళాడు. తలుపు వెనక పొంచి ఉన్న ఆమె చటుక్కున మెట్లమీదకి వెళ్ళి టెర్రేస్‌ తలుపు మూసి గడియ పెట్టింది.‘‘తలుపు తీయి. ఏమిటిది?’’ సుజీవ్‌ తలుపు బాదుతూ అరిచాడు.తలుపు తెరచుకోలేదు.

 పావుగంట తర్వాత ఇక ఆమె తలుపు తెరవదని బోధపడింది. పిట్టగోడ మీంచి దూకడానికి వీలులేకుండా లోపలివైపు ఆరడుగుల ఎత్తున గ్లాస్‌ వాల్‌ ఉండటంతో, అతను కింద రోడ్‌ మీద వారిని సహాయం కోరే అవకాశం లేకపోయింది. ఎక్కడా నీడ కనిపించలేదు. ఎండకి చెమటతో అతని షార్ట్స్, టీషర్ట్‌ తడిసిపోయాయి. టీషర్ట్‌ విప్పి తల మీద కప్పుకున్నాడు. అతని ఒంట్లోని నీరు చెమట రూపంలో కారిపోతూ దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది.  లేప్‌టాప్‌లోని తమ వీడియోని డిలీట్‌ చేశాక, టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన ఆమె సూర్యాస్తమయ సమయంలో పైకెళ్ళి టెర్రేస్‌ తలుపు తెరిచింది. 

ఆమె ఆశించినట్లుగా నేల మీద మగతగా పడున్న సుజీవ్‌కి వడదెబ్బ కొట్టింది. చక్కెర, ఉప్పు నీళ్ళు తాగించి, సెలైన్‌ ఎక్కిస్తే అతను జీవిస్తాడని ఆమెకి తెలుసు. అతన్ని కిందకి మోసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అతను ఏం జరుగుతోందో కూడా అర్థం కానంత అపస్మారకంలో ఉన్నాడు. ఆమెని వంచించడానికి సుజీవ్‌ ఏ మంచాన్ని ఆయుధంగా చేసుకున్నాడో ఆ మంచం మీదే ఆ రాత్రి ఆమె ఫటాఫట్‌ నిర్ణయంతో ప్రాణం వదిలాడు.  
 ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement