అనుకూలమైన వనంలో బంధు మిత్రుల కలయిక... అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం, మరో వైపు ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం – కార్తీక మాసంలో వన సమారాధనలంటే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. అయితే ఈ వన భోజనాల వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది. బయటకు చాలా సరదాగా కనిపిస్తునే, లోపల చాలా లోతైన ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే ఈ పిక్నిక్ యొక్క పరమార్థమేమిటో శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల నుంచి తెలుసుకోవచ్చును.
మన ప్రాచీన భారత దేశంలో ఋషులు, మునులు ఏర్పాటు చేసిన సంప్రదాయాలు అన్నీ మన సూక్ష్మ శరీరంలో కుండలినీ శక్తి జాగృతి కోసం, చక్ర నాడుల శుద్ధి కోసం ఉద్దేశించి చేసినవే. నైమిశారణ్యంలో సూత మహాముని తన తోటి మునులందరితో కలిసి ఉసిరి చెట్టు క్రింద వన భోజనాలు చేసినట్లుగా పురాణాలలో ఉంది.
అంతే కాకుండా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు కూడా గోపాలురతో కలిసి వనభోజనాలు చేసినట్లుగా మన పురాణాలలో ఉంది. దేవతల ఆరాధన కన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆనందిస్తూ, గౌరవిస్తూ ఆరాధించడం ముఖ్యమని చె΄్పారు. గోవర్ధన గిరిని పైకి ఎత్తి ఈ ప్రకృతి మనకు ఏ విధంగా గొడుగులా రక్షణగా నిలుస్తుందో చూపించారు. ఈ గోవర్ధన పూజ పర్వదినం కూడా కార్తీక మాసంలోనే శుక్ల పక్ష పాడ్యమి నాడు వస్తుంది.
మన చుట్టూ ఉండే ప్రకృతిని, గోవులను శ్రీ కృష్ణ భక్తులందరూ గౌరవించి, పూజలు చేస్తారు. అదే గౌరవ భావాన్ని మన దైనందిన జీవితంలో ప్రతి నిత్యం ప్రకృతి పట్ల మనం కలిగి ఉండాలి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేస్తారు. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవని వంటిది. ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా కాస్తాయి. ’సి’ విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇది మన జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఈ చెట్టు గాలి కూడా చాలా మంచిది.
ఉసిరిలో ఆరు రుచులలో ఒక్క లవణం (ఉప్పు) తప్ప మిగలిన ఐదు రుచులూ ఉంటాయి. అంటే మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కషాయం(వగరు), కటువు(కారం), తిక్తం(చేదు) ఈ ఐదు రుచుల సంగమం. ముఖ్యంగా ఉసిరిలో ఆమ్ల గుణం అంటే పులుపు ఎక్కువగా కనిపిస్తుంది.. కనుక దీనిని ఆమ్లా లేదా ఆమలకము అని పిలుస్తారు కూడా. కార్తీక మాసంలోనే ఉసిరికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆరోగ్య రహస్యం దాగి ఉందని తెలుస్తోంది.
ఈ నెల నుంచి శీతాకాలం మొదలు అవుతుంది. దీంతో రుతు సంబంధ వ్యాధుల తోపాటు దగ్గు, జలుబు వంటివి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ నెలలో ఉసిరిని తినడం.. లేదా ఉసిరి చెట్టు నీడన ఉండడం వలన ఈ దోషాలు నివారింపబడతాయి. సకల మానవాళిని రక్షిస్తుందని.. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చరక సంహిత పేర్కొంది. మానవ శరీరం పంచ భూతాలైన భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని అనే ఐదు మూలకాలతో తయారవుతుంది.
ఈ పంచ భూతాల తత్త్వాల తోనే మన సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాలు రూపొందాయి. ఉదాహరణకు మన సూక్ష్మ శరీరంలో మొదటి శక్తి కేంద్రమైన మూలాధార చక్రం భూతత్త్వంతో ఏర్పడుతుంది. ఈ శక్తి కేంద్రంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు, మనం భూమి మీద కూర్చొని, రెండు చేతులూ భూమి మీద పెట్టి సహజ యోగ పద్ధతిలో ధ్యానం చేస్తే, ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ఆ విధంగా పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి మానవుల సూక్ష్మ శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలను చైతన్య పరిచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. వన భోజనాల ద్వారా సమకూరే మరో ప్రయోజనం సహజ యోగులలో సామూహిక జీవనం మరింతగా బలపడుతుంది.
మానవుడు సంఘజీవి. సామూహికంగా అందరూ కలిసి జరుపుకునే పిక్నిక్ ల వలన సహజ యోగుల మధ్య అభి్ర΄ాయ భేదాలు, మనస్పర్థలు ఏమైనా ఉంటే తొలగిపోయి, సామరస్యం ఏర్పడుతుంది. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరూ కలిసి సహకరించుకోవడం వలన మనుష్యుల మధ్య ప్రేమ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అహంకార, ప్రత్యహంకారాలు కరిగి΄ోయి హృదయం విశాలమవుతుంది. అటువంటి వాతావరణం పెరుగుతున్న పిల్లల మీద సానుకూల ప్రభావాన్ని చూపించి, వారిలో సానుకూల దృక్పథం ఏర్పడేటట్లు చేస్తుంది.
మన విశుద్ధి చక్రం ఆకాశ తత్త్వాన్ని కలిగి ఉంటుంది. వన భోజనాల వంటి సామూహిక కార్యక్రమాలలో ΄ాలుపంచుకొన్నప్పుడు, మన విశుద్ధి చక్రం అభివృద్ధి చెంది చక్కటి సంభాషణా చాతుర్యం అలవడి అందరితో సత్సంబంధాలను పెంపొందించుకొనగలుగుతాం. మన లోపల గల షట్చక్రాలు సహజమైన ప్రకృతిలో లభించే పంచ భూతాల తత్త్వాలతో చాలా వేగంగా స్పందిస్తాయి.
కాబట్టి కనీసం ఏడాదికి ఒకసారి ఇలా కార్తీక మాసంలో వన భోజనాల ద్వారా అయినా ప్రకృతి ఒడిలో అందరూ మమేకమై, ధ్యానంతో, భజనలతో ఆట పాటలతో హాయిగా సేద తీరితే, సహజకుటుంబాల సామూహికత మరింత బలోపేతం అవుతుందని ఆశిద్దాం.
– డా. పి. రాకేశ్(మాతాజీ నిర్మలాదేవి ప్రసంగాలు, ప్రవచనాల ఆధారంగా)
(చదవండి: Sabarimala Pedda Padam: వనయాత్ర అంటే..! పెద్దపాదం మార్గం విశిష్టత..)


