వాళ్ల పెళ్లి  ఏకంగా పది రోజుల సెలవులిచ్చింది!

Japan Company Give Leave To Employees Over Their Favourite Singers Marriage - Sakshi

‘పెళ్లి కుదిరింది. ఓ పదిహేను రోజులు సెలవి’మ్మంటేనే కొరకొరా చూసే బాస్‌లున్న కాలమిది. పైగా ‘వారం సరిపోతుందిలే’ అంటూ సలహాతో కూడిన ఆర్డరూ సరేసరి. ఇక రక్త సంబధీకులు కాని వారి పెళ్లికి సెలవంటే అంతెత్తున లేచి ‘గయ్‌’మనడం మామూలే. అలాంటిది మనం అభిమానించే నటీనటులో, గాయనీ గాయకులో, ఆటగాళ్లో వృత్తి నుంచి రిటైరవుతున్నారనో, లేక పెళ్లి చేసుకుంటున్నారనో లీవ్‌ అడిగితే? ఇంకేముంది ఉద్యోగానికి నీళ్లొదిలేసుకోవడమే అంటారా! నిజమే కానీ.. మేమిస్తాం అంటోంది జపాన్‌లోని హిరోరో కంపెనీ. టోక్యోలో ఉంటుందిది. టీవీ యాడ్సు, మ్యూజిక్‌ వీడియోలూ చేస్తుంటుంది. ఇటీవల ఈ సంస్థ అధిపతి షిజెన్‌ సురుమి తన ఉద్యోగుల కోసం కొత్త పద్ధతిలో సెలవులివ్వనున్నట్లు ప్రకటించాడు. దీనికి ‘ఓషి వెకేషన్‌ సిస్టమ్‌’ అని పేరు పెట్టాడు. దీని ప్రకారం కంపెనీలోని ఉద్యోగి తనకు ఇష్టమైన గాయనీ గాయకుల పెళ్లి లేదా రిటైర్మెంట్‌కు సెలవు తీసుకోవచ్చు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా పది రోజులు.

ఒకవేళ సదరు ఉద్యోగికి ఒకరికంటే ఎక్కువ అభిమాన గాయనీ గాయకులు ఉన్నా ఈ లీవ్‌ వర్తిస్తుంది. అయితే, ఇలాంటప్పుడు సెలవుల సంఖ్య మూడు రోజులకు మించదు. సురుమి ఈ పద్ధతిని ప్రవేశపెట్టడానికి రెండు సంఘటనలు కారణం. ఓ రోజు ఆఫీసులో ఉద్యోగి ఒకరు పనిలో అన్యమనస్కంగా ఉండడం గమనించాడు సురుమి. ఆరా తీస్తే ఆ రోజు సదరు ఉద్యోగి అభిమానించే పాప్‌ గాయని, డబ్బింగ్‌ కళాకారిణి పెళ్లి చేసుకుంటోందని తేలింది. మరో రోజు ఇంకో ఉద్యోగి సైతం పనిపై తగిన శ్రద్ధ పెట్టకపోవడం సురుమి గుర్తించాడు. దానికి కారణం అతనికిష్టమైన పాప్‌ గాయని ఆ రోజు రిటైర్‌ అవుతుండడమే. దీనితో బాగా ఆలోచించిన సురుమి కొత్త రకం లీవులకు తెరతీశాడు. సాధారణంగా జపాన్‌లో పాప్‌ మ్యూజిక్‌ ప్రదర్శనలకు, బ్యాండ్‌లకు విపరీతమైన ఆదరణ ఉంటుంది.

అందులో పాటలు పాడుతూ అభినయించే గాయక నటీనటులను ఆరాధించేవాళ్లూ ఎక్కువే. తనది మ్యూజిక్‌కు సంబంధించిన కంపెనీ కావడం, తన ఉద్యోగుల్లోనూ అనేక మందికి పాప్‌ మ్యూజిక్‌ సింగర్లంటే విపరీతమైన అభిమానం ఉండడంతో సురుమి ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం అభిమాన పాప్‌ సింగర్ల పెళ్లికే కాదు, వారి రిటైర్మెంట్‌కూ, ఏదైనా మ్యూజిక్‌ బ్యాండ్‌లోని సభ్యులు విడిపోయి మరో జట్టుగా ఏర్పడినప్పుడూ సెలవు ఇస్తారన్నమాట. ఈ కొత్త సెలవు విధానంలో ఇంకో సౌకర్యమూ ఉంది. ఎవరైనా ఉద్యోగి తనకు లభించిన పది రోజుల సెలవులను తనకు అనుకూలమైన సమయాల్లో వినియోగించుకోవచ్చు. అయితే, అదీ పాప్‌ మ్యూజిక్‌ ప్రదర్శనలు చూడ్డానికి మాత్రమే వాడుకోవాలి.
చదవండి: మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కూల్‌డ్రింక్‌ ప్రిజర్వేటివ్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top