
దక్షిణాది వాళ్లకు ఉత్తరాదికి యాత్రలంటే...కాశీ విశ్వనాథుడు... విశాలాక్షి దర్శనాలు. అయోధ్య బాల రాముడు... సరయు నది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం...నైమిశారణ్యం పర్యటన... ఇవే ప్రధానం. రాముడు పడfనెక్కిన శృంగేశ్వర్‌పూర్..? గంగారామాయణ యాత్రలో ఇది ప్రత్యేకం!
తొలి మూడు రోజులు..
మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. బోన్‌గిర్, జనగాన్, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్ కోయింజహార్ రోడ్, భద్రక్, బాలాసోర్‌ల మీదుగా మూడవ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు బనారస్‌కు చేరుతుంది. హోటల్ గదికి చేరిన తర్వాత సాయంత్రం వీలును బట్టి స్వయంగా వారణాసిలో ప్రదేశాలను చూడవచ్చు లేదా విశ్రాంతి తీసుకోవచ్చు.
నాల్గోరోజు..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాశీ విశ్వనాథ కారిడార్‌లో విహారం, ఆలయ దర్శనం, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల సందర్శనం. సాయంత్రం గంగాహారతి వీక్షణం, ఆ తర్వాత రాత్రి బస.
విశ్వానికి నాథుడు
కాశీలో శివుడి పేరు విశ్వనాథుడు. ఇక్కడ శివలింగాన్ని భక్తులు తాకవచ్చు. తెల్లవారు ఝామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఐదు దాటిన తర్వాత గర్భగుడిలోకి అనుమతించరు. గది ఇవతల నుంచే దర్శనం చేసుకోవాలి. కొత్తగా నిర్మించిన ఆలయం గంగానది తీరం వరకు విస్తరించి చాలా చక్కగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పోలీసు గస్తీ కూడా బాగుంటుంది.
ఇక్కడ దర్శనం క్యూలో ఉన్నంత సేపు పక్కనే ఉన్న జ్ఞాపవాపి ని చూడవచ్చు. అందులో ఉన్న నంది విశ్వనాథుడి ఆలయంలో ఉన్న శివలింగానిక అభిముఖంగా ఉంటుంది. కాశీ నగరం ప్రాచీనమైన నివాస ప్రదేశం కావడంతో ఆర్గనైజ్‌డ్‌గా ఉండదు. ఒక్క మనిషి మాత్రమే నడవగలిగినంత ఇరుకు రోడ్లుంటాయి. విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ, వారాహి ఆలయాలకు వెళ్లాలంటే ఇరుకు రోడ్ల మధ్య మనం ఊహించనన్ని మలుపులు తిరుగుతూ వెళ్లాలి.
తెల్లవారు ఝామున విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఐదున్నరకు గంగానది తీరానికి చేరితే నది నీటిలో ప్రతిబింబించే సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రి బస కాశీలో కాబట్టి ముందురోజు సాయంత్రం గంగాహారతిని కూడా వీక్షించవచ్చు. కాశీలో టీ దుకాణాల్లో ఉదయం పూట మట్టి ప్రమిదలో తాజా మీగడలో చక్కెర వేసిస్తారు. చాలా రుచిగా ఉంటుంది.
ఐదోరోజు
ఉదయం ఏడు గంటలకు రూమ్ చెక్ అవుట్ చేసి వారణాసి రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయోధ్యలోని అయోధ్యధామ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి రామజన్మభూమి, హనుమాన్‌గరి చూసిన తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ కావడం, రాత్రి బస.
రాముడు పుట్టిన అయోధ్య
రాముడు పుట్టిన ప్రదేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఆలయాన్ని ఆద్యంతం కనువిందు చేస్తుంది. కళ్లు వి΄్పార్చుకుని చూస్తే తప్ప తృప్తి కగలదు. ఆలయ ప్రాంగణం అంతా తిరిగి చూసిన తర్వాత క్యూలో వెళ్లి బాలరాముడిని దర్శించుకున్నప్పుడు భక్తులు తమ ఇంటి బిడ్డను చూసిన అనుభూతిని పొందుతారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత సరయు నదిని తప్పకుండా చూడాలి.
సరయు నది గుప్త ఘాట్‌లో మునిగి రాముడు అంతర్థానమయ్యాడని చెబుతారు. ఇక్కడి కనకభవన్ భారీ నిర్మాణం కాదు కానీ ప్రాచీన కాలం నాటి నిర్మాణశైలి గొప్పగా ఉంటుంది. రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన త్రేతా కీ ఠాకూర్ ప్రదేశాన్ని, సీత వంటగది, దశరథ్ భవన్‌లను చూడడం మరువద్దు. హనుమాన్ గరి నుంచి చూస్తే అయోధ్య నగరం మొత్తం కనిపిస్తుంది.
ఆరోరోజు..
ఉదయం హోటల్ గది చెక్ అవుట్ చేసి రైల్వేస్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ఏడు గంటలకు రైలు బాలామావ్ వైపు సాగి΄ోతుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాలామావ్ రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. రైలు దిగి ఆ రోజంతా నైమిశారణ్య సందర్శనం. చక్రతీర్థ, హనుమాన్ టెంపుల్, వ్యాసగద్ది చూసుకుని తిరిగి రైల్వేస్టేషన్‌కి వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి పదకొండు గంటలకు బాలామావ్ నుంచి ప్రయాగ్‌రాజ్ వైపు సాగిపోతుంది.
పురాణాల పుట్టిల్లు
నైమిశారణ్యం అంటే మన పురాణాల్లో కనిపిస్తుంటుంది. దాదాపు ప్రతి పురాణమూ శుక మహర్షి నైమిశారణ్యంలో సనకసనందాది మునులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు అనే ఉపోద్ఘాతంతో మొదలవుతుంది. ఇక్కడి ప్రధాన పర్యాటక ప్రదేశం నైమిశనాథ్ విష్ణు టెంపుల్. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో ఉంది. వైష్ణవ అళ్వారులు చెప్పిన 108 దివ్యదేశాలలో ఇదొకటి. ఈ ఆలయ నిర్మాణం దక్షిణాది ఆలయ నిర్మాణశైలిలో ఉంటుంది. లోపలి మందిరం, గర్భాలయం మాత్రం ఉత్తరాది నిర్మాణశైలిలో ఉంటుంది.
మూడు గర్భాలయాలుంటాయి. అందులో ఒకటి విష్ణువు, ఒకటి లక్ష్మీదేవి కోసం ఉండగా మరొకటి రామానుజాచార్యుల గర్భాలయం. దేవీదేవతలతోపాటు సమాజానికి సమానత్వం, ఆధ్యాత్మికత మార్గదర్శనం చేసిన గురువుకి కూడా స్థానం లభించడం గుర్తించాల్సిన విషయం.
ఆలయం ఆవరణలోని చక్రతీర్థాన్ని పుణ్యతీర్థంగా భావిస్తారు. గోమతి నది స్నానం చేయవచ్చు. ఆదిశంకరాచార్యుడు, మహర్షి సూరదాసు కూడా ఇక్కడ స్నానమాచరించి చక్రతీర్థాన్ని దర్శించుకున్నారని చెబుతారు. ఇక ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం వ్యాసగద్ది. వేదవ్యాసుడు ఇక్కడ నివసించిన సమయంలో ఇక్కడ ఉన్న మర్రిచెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చునేవాడని నమ్ముతారు. వ్యాసుని గౌరవార్థం ఆ ప్రదేశంలో చిన్న నిర్మాణం చేశారు. ఈ మర్రిచెట్టు ఐదువేల ఏళ్ల నాటిది.
ఏడో రోజు
ఉదయం ఏడు గంటలకు ప్రయాగ సంగమం చేరుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్ కావడం రిఫ్రెష్‌మెంట్ తర్వాత త్రివేణి సంగమానికి చేరాలి. నదిలో విహారం, స్నానమాచరించడం, నీటిని బాటిళ్లలో పట్టుకోవడం, ఇతర క్రతువులు పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న హనుమాన్ మందిర్, ఆదిశంకరాచార్య విమానమంటపాలకు వెళ్లాలి. మధ్యాహ్న భోజనం తరవాత రోడ్డు మార్గాన శృంగ్వేర్‌పూర్‌కు వెళ్లాలి. ఇది ప్రయాగ్‌రాజ్ నుంచి 40 కి.మీ.ల దూరాన ఉంది. ఓ గంట ప్రయాణం. ఆ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి ప్రయాగ్‌రాజ్‌కి వచ్చి రైలెక్కాలి. రాత్రి ఏడున్నరకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
అరణ్యవాసానికి దారి
శృంగ్వేర్‌పూర్ పెద్దగా ప్రచారం సంతరించుకోని యాత్రాస్థలం. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంది. రామలక్ష్మణులు సీతాదేవి అయోధ్య నుంచి అరణ్యవాసం వెళ్లేటప్పుడు గంగానదిని దాటింది ఇక్కడేనని చెబుతారు. ఈ ప్రదేశాన్ని పాలిస్తున్న నిషధరాజు మత్స్యకారుడు.
అతడు రామలక్ష్మణసీతాదేవికి తన రాజ్యంలో ఆతిథ్యమిచ్చి మరుసటి రోజు పడవ ఎక్కించి సాగనంపాడు. ఇది ఇలా ఉంటే ఈ ప్రదేశానికి ఈ పేరు శృంగి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకోవడం వల్ల వచ్చింది. ఇతిహాస కథనం ఇలా ఉంటే చారిత్రక ఆధారాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. పురాతన శృంగ్వేర్‌పూర్ నిర్మాణాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ ప్రదేశం అయోధ్య నగరానికి 170 కిమీల దూరాన ఉంది.
ప్యాకేజ్ వివరాలు
గంగారామాయణ పుణ్యక్షేత్ర యాత్ర (ఎస్‌సీజెడ్‌బీజీ44). భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్యాకేజ్‌లో ఇది (గంగారామాయణ పుణ్యక్షేత్ర యాత్ర) తొమ్మిది రోజుల యాత్ర. ఈ టూర్‌లో వారణాసి, అయోధ్య, నైమిశారణ్యం, ప్రయాగ్‌రాజ్, శృంగ్వేర్‌పూర్ క్షేత్రాలు కవర్ అవుతాయి.
టికెట్ ధరలు కంఫర్ట్ కేటగిరీ (సెకండ్ ఏసీ)లో ఒక్కొక్కరికి 35 వేల రూపాయలు, స్టాండర్డ్ కేటగిరీ (థర్డ్ ఏసీ)లో 26,500, ఎకానమీ కేటగిరీ (స్లీపర్ క్లాస్)లో 16,200 రూపాయలవుతుంది. ఈ ప్యాకేజ్‌లో ట్విన్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ అవకాశం లేదు.
కంఫర్ట్ కేటగిరీకి ఏసీ హోటల్ గది, లోకల్ జర్నీకి ఏసీ వాహనాలు. స్టాండర్ట్ కేటగిరీకి ఏసీ గదులు, నాన్ ఏసీ వాహనాలు. ఎకానమీకి నాన్ ఏసీ గదులు, నాన్‌ఏసీ వాహనాలలో ప్రయాణం. అన్ని రోజులూ ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న, రాత్రి శాకాహార భోజనాలు ఉంటాయి.
ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ ఎస్కార్ట్, ట్రైన్‌లో సెక్యూరిటీ ఉంటుంది. పర్యాటకులకు అవసరమైన సర్వీసుల సహాయం ఏర్పాటు చేయడం కోసం టూర్ మేనేజర్ ఆద్యంతం ప్రయాణిస్తారు. పైన చెప్పుకున్నవన్నీ ప్యాకేజ్ ధరలో వర్తిస్తాయి. ఇక ఇప్పుడు చెప్పుకునేవి ఆ ధరలో వర్తించవు. బోటు విహారం, స్పోర్ట్స్, పర్యాటకప్రదేశాల ఎంట్రీ టికెట్‌లు, ప్యాకేజ్‌లో ఇచ్చిన భోజనం కాకుండా వేరే ఆర్డర్ చేసుకుంటే ఆ ఖర్చులు, ప్యాకేజ్‌లో లేని ఇతర పానీయాలు తీసుకున్నా విడిగా డబ్బు చెల్లించాల్సి
ఉంటుంది. మరిన్ని వివరాల కోసం.https://www.irctctourism.com/pacakage_description?package
– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే.. )