‘లైఫ్‌లో ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి బ్రో..’ | International Day of Happiness 2025 | Sakshi
Sakshi News home page

‘లైఫ్‌లో ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి బ్రో..’

Published Thu, Mar 20 2025 9:37 AM | Last Updated on Thu, Mar 20 2025 1:15 PM

International Day of Happiness 2025

పదేళ్లనాటి 12వ స్థానం నుంచి టాప్‌ 10లోకి చేరిక 

కోవిడ్‌ తర్వాత మారిన ఆలోచనా ధోరణి కూడా కారణమే.. 

అంతిమ లక్ష్యం సంతోషమే అంటున్న సిటిజనులు 

నేడు ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ హ్యాపీనెస్‌

‘లైఫ్‌లో ఏమున్నా లేకున్నా హ్యాపీగా ఉండాలి బ్రో..’ ఇలాంటి మాటలు నగరవాసుల రోజువారీ సంభాషణల్లో సర్వసాధారణంగా మారాయి. సంతోషాన్ని మించిన సంతృప్తి లేదనే ఆలోచన రోజురోజుకూ బలం పుంజుకుంటోంది. ఎన్ని కష్టనష్టాలున్నా సంతోషం కోసం వెతుకుతూనే ఉన్నారు. ఉన్నదాంట్లో హ్యాపీగా లైఫ్‌ గడిపేస్తున్నారు.  

పదేళ్ల క్రితం ఐఎమ్‌ఆర్‌బీ అధ్యయనంలో 190 పాయింట్లు దక్కించుకున్న చత్తీస్‌ఘడ్‌ తొలి స్థానంలో నిలిచింది. లక్నో, చెన్నై, బెంగళూర్‌లు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మన హైదరాబాద్‌ 75 పాయింట్లను దక్కించుకుని 12వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఆ తర్వాత నిదానంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తోంది. 5 ఏళ్ల క్రితం గురుగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో స్ట్రాటజీ ప్రొఫెసర్‌ డా.రాజేష్‌ పిలానియా టీమ్‌ ఇండియా హ్యాపీనెస్‌ రిపోర్ట్‌ రూపొందించింది. 

దీని కోసం 34 నగరాల్లో అధ్యయనం నిర్వహించగా.. లూథియానా, అహ్మదాబాద్, చండీగఢ్‌ సంతోషకరమైన నగరాలుగా అవతరించాయి. గురుగ్రామ్, విశాఖపట్నం, రాయ్‌పూర్‌ చివరి స్థానాలు దక్కించుకున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్‌ను టైర్‌–2 నగరాలుగా విభజించి నిర్వహించిన అధ్యయనంలో.. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్‌ మొదటి మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. మొత్తంగా చూస్తే హైదరాబాద్‌ టాప్‌–10లో నిలిచింది. అప్పటి నుంచి హైదరాబాద్‌ 5 నుంచి 10లోపు ర్యాంకింగ్‌లో ఉంటూ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌లో ప్రముఖంగా ఉంటోంది.  

కోవిడ్‌ తర్వాత కొలత మారింది.. 
ఈ అధ్యయనాలు విశ్లేషిస్తున్న ప్రకారం.. నగరాల్లోని హ్యాపీనెస్‌ ట్రెండ్స్‌లో కోవిడ్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అసలైన సంతోషానికి కొలమానం తెలిసి వచి్చంది. కరోనా మహమ్మారి కారణంగా అనూహ్యంగా ప్రపంచం స్తంభించిపోవడం ఉరుకులు పరుగుల జీవనంలోని డొల్లతనాన్ని పట్టిచి్చంది. దాంతో తమ తమ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూనే సంతోషానికి కూడా తమ డైలీ రొటీన్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం పెరిగింది. విభిన్న రకాల హాబీలకు సానపెట్టడం, టూర్లకు, పిక్నిక్‌లకు వెళ్లడం మరింత 
ఎక్కువైంది. అంతేకాకుండా ఆధ్యాత్మిక భావనలు, తాతి్వక చింతనలూ పెరిగి ప్రశాంత జీవనం వైపు ఆలోచనలు మళ్లిస్తున్నారు.  

ట్రావెలింగ్‌.. ఫొటోగ్రఫీ.. 
ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? ఎన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం అనేదాని కన్నా.. ఎంత సంతోషంగా ఉన్నాం.. అనేదే ముఖ్యమని నేను నమ్ముతాను. అందుకు అనుగుణంగానే నా లైఫ్‌స్టైల్‌ ఉంటుంది. ఒకప్పుడు ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌గా కొంత కాలం పనిచేశాను. ఆ తర్వాత సినిమా నటుడిగా మారాక అదే ఫొటోగ్రఫీ నాకు సంతోషాన్ని అందించే హాబీగా మారింది. అలాగే ట్రావెలింగ్‌ కూడా నాకు చాలా ఆనందాన్ని అందిస్తుంది.  
– కృష్ణుడు, సినీనటుడు

 

పాజిటివ్‌ మైండ్‌.. 
ఏదో ఒక రోజు అని కాదు.. ప్రతీ రోజూ సంతోషంగానే ఉంటాను. సంతోషం అనేది ప్రత్యేకంగా ఒక మార్గంలో తెచ్చుకోవడం అనేది కాదు. ముఖ్యంగా నేను దేనికీ టెన్షన్‌ పడను.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏడవను.. హ్యాపీగా ఉండాలి అని నా మనసును ట్యూన్‌ చేసుకున్నాను కాబట్టి ఎప్పుడూ ఆనందంగా ఉంటాను.  
– సుధ, సినీ నటి

మ్యూజిక్‌ కిక్‌.. రైడింగ్‌ బైక్‌.. 
కొన్ని హాబీస్‌ నాకు హ్యాపీనెస్‌ని అందిస్తాయి. అలాంటి వాటిలో మొదటిది మ్యూజిక్‌ అని చెప్పాలి. నా ఉదయం ఎప్పుడూ సంగీతంతో ప్రారంభిస్తా.. నచ్చిన మ్యూజిక్‌ వింటూ డే స్టార్ట్‌ చేస్తే ఆ కిక్కే వేరు. రోజులో ఏ మాత్రం డల్‌గా అనిపించినా నా చూపులు బైక్‌ మీదకు వెళ్తాయి. చిన్నప్పటి నుంచీ బైక్‌ రైడింగ్‌ బాగా ఇష్టం.  
– ప్రిన్స్, సినీనటుడు  

హ్యాపీ హార్మోన్లు.. కీలకం.. 
రోజువారి కొన్ని అలవాట్లు చేసుకుంటే మెదడు సంతోషకర హార్మోన్లను విడుదల చేస్తుంది. ఉదాహరణకుక్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేసే వారిలో ఎండార్ఫిన్స్‌ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి ప్రతికూల భావాలు దరిచేరవు. అలాగే బరువు తగ్గడం, శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచుకోవడం లాంటి చిన్నా, పెద్దా లక్ష్యాలను మనం చేరుకోగలిగినప్పుడు ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ డోపమైన్‌.. అధికంగా ఉత్పత్తి అవుతుంది. జీవితంలో మనకున్న వాటితో సంతృప్తి చెందడం, కృతజ్ఞతాభావం కలిగి ఉండటం కూడా మనసులో సానుకూల భావాలను నింపుతుంది. ఫలితంగా సెరటోనిన్‌ స్థాయి పెరిగి జీవితం ఆనందమయంగా కనిపిస్తుంది. మనసుకు దగ్గరైన వారితో సరదాగా గడపడం చేస్తే మెదడు ఆక్సిటోసిన్‌ను విడుదల చేస్తుంది. మూడ్‌ మెరుగుపరచడంలో ఆహారం పాత్ర కూడా కీలకం. వారంలో రెండుసార్లు 50 నుంచి 100 గ్రాముల వరకు డార్క్‌ చాక్లెట్‌ని తినడం వల్ల మనలో హ్యాపీ హార్మన్లు విడుదలవుతాయి.  అయితే ఆ డార్క్‌ చాక్లెట్‌లో 70 నుంచి 85 శాతం కొకొవా మాత్రమే ఉండాలని గుర్తుంచుకోవాలి. ట్రిఫ్టోఫాన్‌ అధికంగా ఉండే టర్కీ కోడి, గుడ్లు, బాదంపప్పులు వంటి ఆహారాలతో సెరటోనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఓమెగా3 ఫ్యాటీ యాసిడ్‌ అధికంగా ఉండే చేపలు కూడా డోపమైన్‌ స్థాయిల్ని పెంచి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. 

వనజా శ్రీపెరంబుదూరు కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement