Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!

Inspirational story of Radhika Gupta, CEO of Edelweiss Asset Management - Sakshi

కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో.

అర్హతలు ఉన్నప్పటికీ, పుట్టుకతో ఉన్న శారీరక సమస్యను సాకుగా చూపుతూ ఉద్యోగానికి పనికిరావని చీత్కారాలకు గురైంది. దీంతో 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ కొన్నాళ్లకు ఎడారిలో వర్షంపడినట్లుగా రాధిక జీవితంలో ఉద్యోగ అవకాశం రావడం.. దానిని అందిపుచ్చుకుని నేడు ఏకంగా ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యింది. ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక కూడా ఒకరిగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.

యోగేష్, ఆర్తీ గుప్తా దంపతుల ముద్దుల కూతురు రాధికా గుప్తా. యోగేశ్‌ వృత్తిరీత్యా దౌత్యవేత్త కావడంతో రాధిక చిన్నతనం మొత్తం పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, ఇటలీలలో గడిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో ..‘‘బాగా చదువుకో జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతావు’’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండేవారు. దీంతో రాధిక కూడా చక్కగా చదువుకుంటూ స్కూల్లో టాప్‌–ఫైవ్‌ జాబితాలో ఉండేది.

అంతా బాగానే ఉన్నప్పటికీ రాధికకు పుట్టుకతో కొన్ని సమస్యల కారణంగా మెడ వంకరగా ఉండేది. వంకర మెడతో స్కూలుకెళితే మిగతా విద్యార్థులంతా.. ఆమెను చూసి గేలి చేసేవారు. నువ్వు మీ అమ్మకంటే అందవిహీనంగా ఉన్నావు’’ అంటూ  తరచూ మాటలతో హింసించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం.. వెళ్లిన ప్రతి కొత్త స్కూల్లో అవమానాలు వెన్నంటి వేధిస్తుండేవి. అయినప్పటికీ తనని తాను నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడేది .

డ్యూయల్‌ డిగ్రీ ఉన్నప్పటికీ..
ప్రతిష్టాత్మక వార్టన్‌ బిజినెస్‌ స్కూల్లో కంప్యూటర్‌ సైన్స్, ఎకనామిక్స్‌లలో డ్యూయల్‌ డిగ్రీ చేసింది. రెండు డిగ్రీలు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. ఆమె విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలను పక్కనపెట్టేసి ‘నీ మెడ వంకరగా ఉంది నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేము’’ అని వెనక్కి తిప్పి పంపేవారు. ఇలా వరుసగా ఏడుసార్లు జరగడంతో రాధిక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటే ఏబాధ ఉండదు అనిపించింది ఆమెకు.

కౌన్సిలింగ్‌తో...
నిరాశనుంచి బయటపడేందుకు కొంతమంది స్నేహితుల సాయంతో సైకియాట్రిస్ట్‌ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్‌ తీసుకుంది. ఆ తరువాత మెకిన్సేలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, ఏక్యూఆర్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా చేరింది. తరువాత తన భర్తతో కలిసి ఇండియా వచ్చింది. సొంతంగా ‘ఫోర్‌ఫ్రంట్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌’ కంపెనీని ప్రారంభించింది. కంపెనీ క్యాపిటల్, పనితీరు బావుండడంతో ఎడిల్వీజ్‌ ఫోర్‌ఫ్రంట్‌ను కొనేసింది.

ఇదే సమయంలో రాధిక పనితీరుని మెచ్చి ఎడిల్వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు సీఈవోని చేసింది. అనేక అవమానాలు, కష్టాల తరువాత సీఈవోగా రాణిస్తోన్న రాధిక ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘దట్‌ గర్ల్‌ విత్‌ ఏ బ్రోకెన్‌ నెక్‌’ వీడియోలో తన కథను వివరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవమానాలనుంచి అందనంత ఎత్తుకు ఎదిగి నేను ఇది అని నిరూపించి చూపిస్తోంది రాధిక.

నాన్నే ప్రేరణ..
నాన్న ..ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. కష్టపడి చదివి సివిల్‌ సర్వీసెస్‌లో ఏడో ర్యాంక్‌ సాధించారు. నిరుపేదరికం నుంచి వచ్చిన ఆయన అన్నిసాధించ గలిగినప్పుడు, నాకున్న ఒక సమస్యతో ఎందుకు వెనుకబడిపోవాలి అనుకుని, బాగా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. అందం, అనుమానాలను పక్కనపెట్టి, నేను ఎదుర్కొన్న ప్రతిసమస్యను అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగాను. దాంతోనే ఈ స్థాయిలో నిలబడిగలిగాను.
 – రాధికా గుప్తా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top