రూబిక్స్‌ క్యూబ్స్‌తో వి‘చిత్రాలు’ | Hyderabad’s 13-Year-Old Hriday Creates Stunning Rubik’s Cube Portraits and Records | Sakshi
Sakshi News home page

రూబిక్స్‌ క్యూబ్స్‌తో వి‘చిత్రాలు’

Nov 13 2025 10:25 AM | Updated on Nov 13 2025 11:42 AM

Hriday Patel an 11 year old boy creates Rubik’s Cube mosaic of Lord Ram

మనలో చాలా మంది రూబిక్స్‌ క్యూబ్‌ను ఓ పజిల్‌లా పరిష్కరించడంలో ఆనందం పొందుతుంటారు. హైదరాబాద్‌లో ఉంటున్న హృదయ్‌ మాత్రం వాటిని కాన్వాస్‌లా మార్చి, పోర్ట్రయిట్‌లను రూపొందిస్తున్నాడు. మన జాతీయ జెండా, అయోధ్య రాముడు, గణేశుడు, వివిధ రంగాలలోని ప్రముఖుల ముఖచిత్రాలను రూబిక్స్‌ క్యూబ్‌ ద్వారా చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రికార్డులనూ సాధిస్తున్నాడు. పదమూడేళ్ల హృదయ్‌ తన రూబిక్స్‌ క్యూబ్‌ ఆర్ట్‌తో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంటున్నాడు..

ఇటీవల మహిళల వరల్డ్‌ కప్‌ సాధించిన సందర్భంగా 900 రూబిక్స్‌ క్యూబ్‌క్‌ తో క్రికెటర్‌ స్మృతి మంధాన మొజాయిక్‌ ఆర్ట్‌ను రూపొందించాడు. దీనిరూపకల్పనకు 3 రోజులు పట్టిందని చెప్పాడు హృదయ్‌. హంగేరియన్‌ కల్చరల్‌ సెంటర్, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియం, మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌ సంయుక్తంగా న్యూఢిల్లీలోని నేషనల్‌ సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించిన ‘రూబిక్‌ 50’ కార్యక్రమంలో హృదయ్‌ పాల్గొన్నాడు. ఒక రోజులో 704 క్యూబ్‌లను ఉపయోగించి మొజాయిక్‌ ఆర్ట్‌ సృష్టించి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ కార్యక్రమంలో హృదయ్‌కి ‘ఎక్స్‌లెన్స్‌ అవార్డు’నూ ప్రదానం చేశారు. ప్రశంసాపత్రాన్ని కూడా ఇచ్చారు.

నిమిషంలో... 
కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో రూబిక్స్‌ క్యూబ్‌ పరిష్కరించడంలో మునిగిపోయేవాడు. ఆ తర్వాత వాటిని నిమిషాలలో సాల్వ్‌ చేస్తూ, మొజాయిక్‌ ఆర్ట్‌ను రూపొందించడం మొదలుపెట్టాడు. ఐదేళ్లుగా అనేక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో  మొజాయిక్‌ ఆర్ట్‌ను ప్రదర్శించాడు. అయోధ్యలో రామ మందిర్‌ ప్రాంరంభోత్సవం సందర్భంగా రాముడి చిత్రం రూబిక్స్‌ క్యూబ్‌తో చిత్రించాడు. 

కిందటేడాది అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో రూబిక్స్‌ క్యూబ్‌తో బిఎపిఎస్‌ స్వామినారాయణ సంస్థ సువర్ణ మహోత్సవం లోగోను తయారు చేశాడు. మదర్స్‌ డే, ప్రధాని మోడీ, హర్‌ఘర్‌ తిరంగ, శ్రీకృష్ణ, దీపావళి వేడుకలకు సంబంధించిన చిత్రాలను రూబిక్స్‌ క్యూబ్‌తో తయారు చేశాడు.  నిమిషంలో 8 రకాల రూబిక్స్‌ క్యూబ్‌ను పరిష్కరించడం, రాముని మొజాయిక్‌ చిత్రానికి అతి ఎక్కువ రూబిక్స్‌ క్యూబ్‌లను ఉపయోగించిన రికార్డులు హృదయ్‌ ఖాతాలో ఉన్నాయి.

చిన్న వయసు... పెద్ద కలలు
సుచిత్ర అకాడమీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న హృదయ్‌ ఐదేళ్లుగా ఈ కళను సాధన చేస్తున్నాడు. ఇప్పటివరకు రూబిక్‌ క్యూబ్స్‌ నుండి 40 మొజాయిక్‌ ఆర్ట్‌ పీస్‌లను రూపొందించాడు. తన సృజనాత్మకతతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్స్‌లోనూ చోటు సంపాదించాడు. 

హృదయ్‌ సృష్టించిన రూబిక్స్‌ క్యూబ్‌ పోర్ట్రెయిట్లు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. వీటిని చూసి అనేకమంది కళాకారులు హృదయ్‌ని అభినందించారు. హృదయ్‌ ఏం చెబుతున్నాడంటే.. ‘ప్రతి క్యూబ్‌ రంగు ఒక ఆలోచనను కలిగిస్తుంది. వాటన్నింటినీ కలిపితే ఒక కథ పుడుతుంది’ అంటాడు. భవిష్యత్తులో ప్రపంచస్థాయి క్యూబ్‌ ఆర్టిస్ట్‌గా భారతదేశం తరపున పాల్గొనాలనేది తన కలగా వివరించాడు.

ప్రోత్సాహమే బలం
‘హృదయ్‌ ఏడేళ్ల వయసు నుంచి రూబిక్స్‌ క్యూబ్స్‌పై ఆసక్తి చూపేవాడు. ఒక క్యూబ్‌ రంగులను సెట్‌ చేయడానికి మాకు రోజంతా పట్టేది. అలాంటిది తను వాటితో పోర్ట్రయిట్స్‌ సృష్టిస్తుంటే ఆశ్చర్యమేసింది. తన ఆసక్తిని గమ నించి మేం కొన్ని థీమ్స్‌ ఇస్తూ వచ్చాం. 

ఎంతో ఏకాగ్రతతో చేయాల్సిన ఆర్ట్‌. హృదయ్‌కి ఇలాంటి కళ అబ్బడం, చదువులోనూ చురుకుగా ఉండటం మాకెంతో ఆనందంగా ఉంది’ అని వివరించారు హృదయ్‌ తల్లి కాజల్‌. సృజనాత్మకతతో మనసు పెట్టి చేస్తే ఏ వయసులోనైనా ప్రపంచాన్ని ఆశ్చర్యపరచవచ్చని నిరూపిస్తున్న హృదయ్‌ ఆర్ట్‌ చిన్నారులకు ఒక స్ఫూర్తి.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement