రష్యా దుస్థితి చూసి..ప్రపంచ నాయకుల రియాక్షన్‌ ఎలా ఉందంటే.. | How World Leaders Reacted To The Wagners Mutiny Against Putin | Sakshi
Sakshi News home page

రష్యాకి తగిలిన వాగ్నర్‌ సైన్యం షాక్‌కి..ప్రపంచ నాయకుల రియాక్షన్‌ ఎలా ఉందంటే..

Jun 25 2023 4:21 PM | Updated on Jun 25 2023 4:44 PM

How World Leaders Reacted To The Wagners Mutiny Against Putin - Sakshi

ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో యుద్ధం వద్దు చర్చలే ముద్దు అని పిలుపునిచ్చిన రష్యా ఖాతారు చేయలేదు. ఊహించని విధంగా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి సై అంటూ.. బాంబులతో దద్ధరిల్లే చేసింది రష్యా. దీంతో ఒక్కసారిగా దేశాలన్ని విస్తుపోయాయి. అక్కడికి ప్రపంచ నాయకులంతా ముందుకు వచ్చి రష్యాకు హితవు పలికిన ససేమిరా అంది. పైగా తమను తాము రక్షించుకునేందుకు చేస్తున్న ప్రత్యేక సైనిక యుద్ధంగా సమర్థించుకుంది. చివరికి రష్యానే ఊహించని రేంజ్‌లో ప్రైవేట్‌ సైనిక సంస్థ వాగ్నర్‌ గ్రూప్‌ ఇచ్చిన ఝలక్‌కి గడగడలాడింది. దీంతో రష్యా ఎదుర్కొన్న ఈ అసాధారణ పరిస్థితి గురించి  ప్రపంచ నాయకులు ఏమన్నారంటే..

ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అండదండగా ఉన్న ప్రైవేట్‌ సైనిక సంస్థ వాగ్నర్‌ గ్రూప్‌ రష్యాపై తిరుబాటు జెండా ఎగరేసింది. ఈ వాగ్నర్‌ గ్రూప్‌ అనేది కిరాయి సైన్యం. ఈ సంస్థకి చీఫ్‌ యెవ్‌గెనీ ప్రిగోజిన్‌. ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ సంస్థ సైనికులే. అయితే తమ సైనికులకు తగిన గుర్తింపు లేదని పైగా తమ సైనికులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోందంటూ రష్యా మిలటరీపై ఆరోపణలు చేస్తూ ప్రిగోజిన్‌ రష్యాపై దాడి చేసేందుకు సన్నద్ధమయ్యారు. అంతేగాదు మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతని పేరే ఎత్తకుండకునే దేశద్రోహి, ఇలాంటి వాళ్లకు ఎప్పటికైనా శిక్షపడుతుందంటూ మీడియా ముందు పెడబొబ్బలు పెట్టారు పుతిన్‌.

ప్రిగోజిన్‌పై తీవ్రవాదం వంటి నేరాలు మోపేందుకు రెడీ అయ్యారు కూడా. ఇలా ప్రకటించారో లేదో వాగ్నర్‌ సైన్యం రష్యాలో కల్లోలం సృష్టించింది. అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపు వస్తున్నట్లు ప్రకటించాడు ప్రిగోజిన్‌. దెబ్బకి రష్యా వెనక్కి తగ్గి.. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోతో మంతనాలు జరిపించి పరిస్థితిని చక్కబెట్టుకుంది. పైగా ప్రిగోజిన్‌పై మోపిన నేరాన్ని ఎత్తివేయడమే గాక తిరుబాటులో పాల్గొన్న సైనికులపై కూడా ఎలాంటి విచారణ ఉండదని, యథావిధిగా విధులకు హాజరవ్వచ్చని ‍రష్యా ప్రకటించడం విశేషం. 

పుతినే కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ని పెంచి పోషించినట్లు సమాచారం. దీని అండ చూసుకునే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగాడు. చివరికి అదే శూలంలా మారి గుండెల్లో గుచ్చుకుంది. ఈ ఘటన అతని దీర్ఘకాల నాయకత్వానికి పెను సవాలుగా మారడమేగాక సందిగ్ధంలో పడేసింది. ఇక రష్యా పని అయిపోయిందనకునేలా మచ్చెమటలు పట్టించింది వాగ్నర్‌ సైనిక సంస్థ. రష్యా తాను ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధం కరెక్ట్‌ అని సమర్థించుకుంటే..తానే పెంచి పోషించి.. రంగంలోకి దింపిన కిరాయి సైన్యమే ఎదురు తిరిగి ద్రోహం చేసేందుకు రెడీ అయ్యింది. 

తన వరకు వస్తేగానీ బాధ అంటే ఏంటో తెలియదంటే ఇదే కాబోలు. ఈ ఘటనతో రష్యా బలం, బలహీనతో ఏమిటో ప్రపంచ దేశాలకు అర్థమైపోయాయి. ఈ పరిణామాలన్నింటిని నిశితంగా గమనిస్తున్న కూటమి దేశాలకు కూడా ఈపాటికే అక్కడి పరిస్థితి అర్థమైపోయింది.  ఈ పరిణామాలపై దేశాధి నేతల స్పందించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షడు జో బైడెన్‌ కూడా రష్యా పరిస్థితిని గమనిస్తున్నారని, మిత్ర దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఆడమ్ హాడ్జ్ తెలిపారు.

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలన్‌స్కీ కూడా రష్యా బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది, దాడి చేసేందుకు ఈ కిరాయి సైన్యంపై ఆధారపడితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవన్నారు. అంతేగాదు నాటో ప్రతినిధి ఓనా లుంగెస్కు కూటమి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలపడం విశేషం. ఇక బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌ సైతం పరిస్థితిని పర్యవేక్షించడమే గాక ఈ సమయంలో అన్ని దేశాలు సంయమనంతో వ్యవహరిస్తున్నాయన్నారు. 

కాగా, ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ సైతం రష్యా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అలాగే జీ7 దేశాల భాగస్వామ్యాలతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది రష్యా అంతర్గత సమస్య అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో  ఉక్రెయిన్‌ మద్దతు విషయంలో మార్పు ఉండదని దృఢంగా తెలిపారు.

(చదవండి: తిరుగుబాటు సైన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్న స్థానికులు.. )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement