 
													ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ తగ్గించడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నీ, జంక్ ఫుడ్‌నీ తీసుకోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి.
అందుకే సరైన బరువును మెయింటెయిన్ చేయడం అవసరం. బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోనవసరం లేదు. కొన్ని రకాల కూరగాయలని డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.
బ్రకోలీ
బ్రకోలీలో ఉండే కెరోటినాయిడ్ అనే మూలకం  వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. 

క్యాబేజీ
 క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

పాలకూర 
పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

క్యాప్సికమ్
క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

కాలీఫ్లవర్ 
కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు. వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. 


 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
