
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నే లేని మైమరపున.. ఏమో అన్నానేమో..నువ్వు విన్నావేమో..విన్న మాటేదో నిన్నడగనా.. అలా సాగిపోతున్న నాలోన.. ఇదేంటిలా కొత్త ఆలోచన.. అవును కాదు తడబాటుని.. అంతో ఇంతో గడి దాటనీ.. విడి విడిపోని పరదాని.. పలుకై రాని ప్రాణాన్ని.. అని బాణం చిత్రంలో రామజోగ్య శాస్తి రాసిన పాట మనందరికీ సుపరిచితమే.. ఇదే పాటను అనుకరిస్తూ.. పలువురు నగర వాసులు సోలో డేట్‌కు సై అంటున్నారు. కొందరు పర్సనల్ స్పేస్ వెతుక్కుంటూ.. లాంగ్ డ్రైవ్స్, టూర్స్‌కు వెళ్తున్నారు.. మరికొందరు తమకు నచి్చన ఆహారంతో.. ఇంకొందరు పుస్తకాలు, మ్యూజిక్‌తో సావాసం చేస్తున్నారు.. నేనూ నా నీడ.. ఇద్దరమే చాలంటూ పలువురు నగరవాసులు పాశ్చాత్య దేశాల నుంచి విస్తరిస్తున్న ట్రెండ్‌కు ఊతమిస్తున్నారు.
‘డేట్‌కి వెళదామా? అని ప్రశ్నిస్తే.. ఏ ఆన్సర్ వస్తుందో అనే ఆందోళన ఉండదు. ‘డేటింగ్’ కోసం మరొకరిని మెప్పించాలనే తాపత్రయమూ ఉండదు. నచ్చని పనులు చేయాల్సిన అవసరమూ ఉండదు.. నచి్చన పనులు మానాల్సిన అవసరం అస్సలే ఉండదు.
అంత అద్భుతమైన అనుభవమా? అదెక్కడ? అది ఎలా? అనే ప్రశ్నలకు నగర యువత ఇప్పుడు కనుగొన్న సమాధానమే సోలో డేటింగ్. ‘సారీ రేపు ఎవరినీ కలవదలచుకోలేదు. ఏకాంతంగా రోజంతా గడపదలచుకున్నాను...’ ఇలాంటి మాటలు ఇప్పుడు నగరంలో తరచూ వినబడుతున్నాయి. ‘సోలో డేటింగ్’ అనే అనుభవం పట్ల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతున్న ఆసక్తే దీనికి కారణం.
అలా పుట్టింది..
పొద్దున్న లేస్తే.. ఎవరికి కాల్ చేయాలి? ఎవరిని కలవాలి? ఎవరితో చర్చించాలి.. ఏ మీటింగ్‌కి అటెండవ్వాలి? ఎవరికి పనులు అప్పజెప్పాలి.. ఎవరు చెప్పిన పనులు చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని మెప్పించాలి?..
బయటకు వెళ్లడం మాత్రమే కాదు కమ్యూనికేషన్ పుణ్యమాని ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి.. రోజువారీ షెడ్యూల్ మొత్తం ఇలాగే మరొకరితో ముడిపడిపోతున్న నగర వాసంలో.. తనను తాను కోల్పోతున్నామనే భావన చాలా మందిలో పెరుగుతోంది. దాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనల నుంచి పుట్టిందే సోలో డేటింగ్ సంస్కృతి.
ఇలా విస్తరించింది..
తొలుత అమెరికా, యూరప్ దేశాల్లో అంకురించిన సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్‌గా మారింది. మీ టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్‌ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్‌లో అయితే ‘ఒంటరి డైనింగ్’ (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్‌గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ‘సోలో ట్రావెల్ – డేటింగ్’ ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా యువత, ముఖ్యంగా హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో, వీకెండ్ సోలో డేట్స్‌ని ట్రెండ్‌గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో ‘సెల్ఫ్ కేర్’ అనే భావనకు కొత్త రూపంగా దీన్ని పేర్కొంటున్నారు.
సోలో డేటింగ్.. ఇలా!
ఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. సోలోగా గడపడం అంటే ఏదో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. ఒక రొమాంటిక్ పార్ట్నర్‌తో కలిసి వెళ్లినట్టు అలా వెళ్లినప్పుడు వారి ఆనందం కోసం మనం ఏవైతే చేస్తామో, చేద్దాం అనుకుంటామో.. అలా మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం.
ఆ రోజు మొత్తం మనకు నచ్చిన పనులు చేస్తూ గడిపేయడం. మనకు నచి్చన టైమ్‌కి నిద్ర లేవడం మొదలుకుని ఏదైనా కాఫీ షాప్‌లోనో కల్చరల్ స్పేస్ లోనో కాసేపు గడపడం, సినిమానో, నాటకమో, స్టాండప్ కామెడీయో.. ఏది చూడాలనుకుంటే అది చూడటం, పార్కులో వాకింగ్ లేదా పర్వతాల్లో ట్రెక్కింగ్ ఇలా ఏదైనా సరే.. రోజంతా మనం ఎంజాయ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నవి చేస్తూ గడిపేయడం..
కొన్ని సూచనలు..
దీని వల్ల ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది.
దీంతో ఆనందం కోసం ఇతరులపై ఆధారపడడం తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోవాలి.
రోజూ తప్పక చేసే పనులకు ఒక్కరోజు పూర్తిగా వీడ్కోలు పలకాలి.
సోలో డేటింగ్ అంటే ఏదో ఒంటరిగా స్తబ్ధుగా గడిపేయడం కాదు. ప్రణాళికా బద్దంగా, రాజీ పడకుండా మనం కోరుకున్నట్టుగా ఎంజాయ్ చేయడం.
ఒత్తిడి నుంచి సామాజిక బాధ్యతల నుంచి కూడా విరామం లభిస్తుంది.
ఆ డేట్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు.. ఎవరు చెప్పిందీ ఫాలో అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం మనసు మాట మాత్రమే వినాలి.
నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చింది ఏంటో తెలుసుకునే సెల్ఫ్ అవేర్‌నెస్ కలుగుతుంది.
(చదవండి: వాన వెలిసినా... ముసిరే వ్యాధులు)