మా నాన్న గారికి 64 ఏళ్లు. చిన్న వయసు నుంచే మందుకు బాగా అలవాటు పడ్డారు. ఆయనకు బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మందు మానడు. ఏమంటారంటే డాక్టర్లే చెబుతారు కదా... రోజుకి రెండు పెగ్గులు తీసుకోమని అని వాదిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో మేము గమనించింది ఏమిటంటే ఆయన చెప్పే వాటిలో చాలా వరకు అబద్ధాలు ఉంటున్నాయి, కానీ ఆయనకి ఆ విషయం అర్థం కావట్లేదు. ఆయన బాగా తూలుతున్నారు. మాటిమాటికి పడిపోవడం, దెబ్బలు తగిలించుకోవడం జరుగుతోంది. మూత్రంపై అదుపు ఉండట్లేదు. గత ఆరు నెలల నుంచి నిద్ర సరిగ్గా పోవట్లేదు. ఇట్లా ఉండి కూడా మందు మాత్రం మానలేదు. మేము దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్‌కి, న్యూరాలజిస్ట్‌కి కూడా చూపించాము. వాళ్లు మందులు రాసిస్తున్నారు కానీ ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మీరు దీని గురించి ఏమైనా సలహా ఇవ్వగలరా?
– రమేష్, యానాం
మీ సమస్య విన్నాక చాలా బాధగా ఉంది. ముందుగా ఈ డాక్టర్లు రెండు పెగ్గుల గురించి చెప్పుకునే విషయం ఎలా వచ్చిందంటే, దీనికి ఒక ‘మెడిటెరేనియన్స్ డైట్’ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ డైట్‌లో ΄పాశ్చాత్యదేశాల్లో ప్రజలు ఎక్కువగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం తీసుకుంటారు. అంటే తాజాపండ్లు, ఆకుకూరలు, సముద్రపు చేపలు లాంటివి. వీటిలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వాటితోపాటు కొందరు రోజుకు 30 నుంచి 60 ఎం.ఎల్. వరకు మాత్రమే వైన్ తీసుకుంటారు.
అంతకంటే ఎక్కువ కాదు. అలాగే రోజూ వ్యాయామం కూడా చేస్తుంటారు. ఈ మొత్తం జీవనశైలిని కలిపి ‘మెడిటేరియన్స్ డైట్’ అంటారు. దీనివల్ల గుండెజబ్బులు తగ్గుతాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. కానీ మన దగ్గర చాలామంది ఈ మొత్తం విషయాన్ని పక్కన పెట్టేసి ‘‘రోజుకి రెండు పెగ్గులు మంచిదట’’ అన్న ఒక్క మాటనే పట్టుకుంటారు. దీనినే సైకాలజీలో ‘సెలక్టివ్ అబ్‌స్ట్రాక్షన్’ అంటారు.
నిజానికి మన దగ్గర చాలామంది ఒకటి లేదా రెండు పెగ్గులతో ఆగరు. సరైన డైట్ కూడా తీసుకోరు. తాగిన తర్వాత భోజనం మానేస్తారు. దాంతో శరీరంలో విటమిన్ బీ1 లోపం వస్తుంది. అలా వచ్చినప్పుడు మొదట్లో అయోమయం, నడకలో తేడా, తూలడం లాంటివి వస్తాయి. ఇవన్నీ మీ నాన్నగారిలో కనిపిస్తున్న లక్షణాలే. ఈ దశలోనే మందు పూర్తిగా ఆపి సరైన వైద్యం తీసుకుంటే చాలా వరకు కాంప్లికేషన్స్ తగ్గించవచ్చు. కానీ చాలామంది ఆల్కహాల్ తాగుతూనే ఉంటారు, మందులు సరిగా వాడరు.
దానివల్ల మెదడుకి శాశ్వతంగా నష్టం కలుగుతుంది. మెదడులో జ్ఞాపకశక్తి , సమతుల్యతకి సంబంధించిన భాగాలు దెబ్బ తింటాయి. దీనివల్ల మతిమరపు వస్తుంది. గుర్తు లేక΄ోయినా, ఖాళీలను నింపడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇవి కావాలనే చెప్పే అబద్ధాలు కాదు. ప్రస్తుతం దీనిని తగ్గించేందుకు ప్రత్యేకించి మందేం లేదు కానీ అధిక మోతాదులో విటమిన్లు ముఖ్యంగా విటమిన్ బీ1 ఇవ్వాలి. నిద్ర కోసం కూడా కొంతవరకు మందులు అవసరం కావచ్చు.
ముఖ్యంగా ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. ఇవన్నీ చేస్తే కొంతవరకు రికవరీ కనిపిస్తుంది. ఇంటి దగ్గర ఆయన్ని ఆపడం కష్టమైతే, మంచి రీహాబిలిటేషన్ కేంద్రంలో చేర్పించండి. అక్కడ క్రమపద్ధతిలో చికిత్స ఉంటుంది కాబట్టి ఆయన బాగుపడే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.
సమస్య నుంచి రిలీఫ్‌కని కొందరు; సంతోషాన్ని సెలబ్రేట్ చేసేందుకని కొందరు ఏదో ఒక వంకతో డ్రింక్ తీసుకోవటం తరచుగా మనందరం చూసే విషయమే! వారందరికీ తాగటం ముఖ్యం. దానికోసం ఏదో ఒక కారణం వెతుక్కుంటారు కాబట్టి ఆల్కహాల్ ఏ రూపంలోనూ తీసుకోకుండా పూర్తిగా దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది.
(డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com )
(చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే)


