
ఎవరికైనా శరీరంలోని ఏ భాగంలోనైనా దెబ్బతగిలినప్పుడు అక్కడ ఎర్రగా మారి, వాపు వచ్చి మంట వస్తుంది. ఇలా జరగడాన్నే ఇంగ్లిష్‌లో ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఇది చర్మం పై వచ్చినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు దేహభాగాల్లో లోపలి దెబ్బలకూ, గాయాలకు ఇన్‌ఫ్లమేషన్ రావచ్చు. ఇలా కేవలం దెబ్బలు తగిలినప్పుడు మాత్రమే కాకుండా... సాధారణంగా ఏదైనా ఇన్ఫెక్షన్ దేహంలోని ఆ భాగంలోనైనా వస్తే అక్కడ కూడా ఇన్‌ఫ్లమేషన్ రావచ్చు. ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కీళ్ల వద్ద, కీళ్ల మధ్య కూడా ఇన్‌ఫ్లమేషన్ రావడం జరగవచ్చు. దెబ్బలూ, గాయాలూ, ఇన్ఫెక్షన్లు, ఆర్థరైటిస్ వంటి కేసుల్లో గాయాలూ, కీళ్లలోనే కాకుండా అనేక సందర్భాల్లో అనేక అవయవాల్లోనూ ఇన్‌ఫ్లమేషన్లు రావచ్చు. ఉదాహరణకు... గుండెకు సంబంధించిన కార్డియోవాస్క్యులార్ జబ్బుల్లోనూ ఇన్‌ఫ్లమేషన్ కనిపించవచ్చు. ఈ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, గాయాలూ, ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి మందుల్ని వాడినప్పటికీ... కొన్ని రకాల ఆహారాలు సైతం ఇన్‌ఫ్లమేషన్‌ను వేగంగా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఆ ఆహారాలేమిటో చూద్దాం...
సాధారణంగా ఇన్‌ఫ్లమేషన్ వచ్చినప్పుడు అది వేగంగా తగ్గడానికి, గాయంగానీ లేదా ఇన్ఫెక్షన్‌గానీ నయం కావడానికి కొన్ని మందులు ఇస్తారు. వీటినే ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ మందులుగా చెబుతారు. అయితే యాంటీఇన్‌ఫ్లమేటరీ మందులు, ఎన్‌ఎస్‌ఏఐడీ (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) వంటి ఔషధాలతోపాటు... దేహంలో ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌తో ప్రభావితమైన చోట అది తగ్గడానికీ, అలాగే అక్కడ వచ్చే నొప్పి తగ్గడానికి ఇచ్చే నొప్పి నివారణ (పెయిన్ కిల్లర్స్) మందులు... వీటన్నింటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఉదాహరణకు సుదీర్ఘకాలం పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినడం జరగవచ్చు.
అలాగే ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే మందులను సైతం సుదీర్ఘకాలం పాటు వాడటమూ అంత మంచిది కాదు. అలా ఆ మందుల్ని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల దేహంలో వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, దేహం ఆ మందుల పట్ల నిరోధకత (రెసిస్టెన్స్) పెంచుకోవడం లాంటి పరిణామాలు జరగవచ్చు.
చేపలు : చేపల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. మరీముఖ్యంగా సాల్మన్ చేపల్లోని ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ స్వాభావికమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ స్వభావాన్ని కలిగి ఉండి, మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.
కెల్ప్ : ఇది ఆల్గే ప్రజాతికి చెందిన ఒక రకం ఆహారం. ప్రస్తుతం మన దగ్గర (మనదేశంలో) అంత విస్తృతంగా దొరకదు. అయితే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాల్లో ఇది చేపల తర్వాత అంత సమర్థమైనది.
పైగా ఇది కేవలం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా... కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తగ్గించే నేచురల్ యాంటీ ట్యూమర్, యాంటీ ఆక్సిడేటివ్ గుణాలున్న ఆహారం కావడంతో దీన్ని వాడటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఆలివ్ ఆయిల్ : మధ్యధరా (మెడిటెరేనియన్ సీ) ప్రాంతపు వాసులు చాలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించడానికి వాళ్ల వంటకాల్లో ఆలివ్ ఆయిల్‌ను విస్తృతంగా వాడటం అని మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఇక వాళ్ల సంస్కృతిలో తాజా పండ్లతోపాటు ఆలివ్ నూనెను వారి సంప్రదాయ వంటకాల్లో వాడటం వల్ల ఆ ప్రాంత వాసులు మరింత ఆరోగ్యంగా జీవిస్తున్నారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
ఇందుకు కారణమేమిటంటే... ఈ ఆలివ్ నూనెలో కొవ్వులు ఎంత మోతాదులో ఉండాలో అంతే మోతాదులో ఉంటాయి. దాంతో పాటు ఆలివ్ ఆయిల్‌లో కేవలం ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం మాత్రమే కాకుండా... ఆస్థమానూ, ఆర్థరైటిస్‌నూ తగ్గించే గుణమూ ఉంది. గుండెకూ, రక్తనాళాలకూ మేలు చేసే స్వభావం కూడా ఈ ఆలివ్ ఆయిల్‌లో ఉండటం విశేషం.
క్రూసిఫెరస్ వెజిటబుల్స్ : కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకలీలను క్రూసిఫెరల్ వెజిటబుల్స్‌గా పేర్కొంటారు. మొదట్లో మన దగ్గర కేవలం కాలీఫ్లవర్, క్యాబేజీ మాత్రమే లభ్యమవుతూ ఉండగా... ఇటీవల బ్రాకలీ లభ్యత కూడా బాగా పెరిగింది. ఈ క్రూసిఫెరస్ వెజిటిబుల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటంతో పాటు... మన శరీరంలోని విషాలను (టాక్సిన్స్‌ను) స్వాభావికంగానే హరించే శక్తి ఉంది. ఇలా శరీరం నుంచి స్వాభావికంగా విషాలను తొలగించే శక్తి కారణంగానే ఇవి ప్రభావవంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారంగా గణుతికెక్కాయి.
బ్లూ బెర్రీస్ : ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను స్వాభావికంగానే పూర్తిగా ప్రభావవంతంతో తగ్గించడమే కాదు... వయసు పెరుగుతున్న కొద్దీ మెదడుతోపాటు దేహంలోని అన్ని అవయవాల్లో కలిగే నష్టాలూ / అనర్థాలను తగ్గించే గుణాలూ ఉన్నాయి. వయసు పెరిగాక వచ్చే మతిమరపు (డిమెన్షియా)ను ఇవి సమర్థంగా అరికడతాయి. ఇక బ్లూబెర్రీస్‌లో యాంటీ క్యాన్సర్ గుణాలూ ఎక్కువే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఎరువులు వాడి పండించిన బ్లూ బెర్రీస్‌తో ΄ోలిస్తే... స్వాభావికంగా పండించిన బ్లూ బెర్రీస్ మంచివి.
పసుపు : పసుపుకు ఔషధ గుణాలు (మెడిసినల్ ప్రోపర్టీస్) ఉన్నాయన్న విషయం మనకు చాలా కాలం కిందటి నుంచే తెలుసు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పోషకం / పదార్థం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాన్ని కలిగి ఉంటుంది.
అందువల్లనే ఆహారంలో పసుపు వాడినప్పుడు అది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలతోపాటు సమర్థమైన నొప్పి నివారణిగా కూడా పనిచేస్తుంది. మనం మెడికల్ షాపుకు వెళ్లి ఆన్ కౌంటర్ మెడిసిన్‌గా కొనుగోలు చేసే కొన్ని మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపవచ్చు. కానీ పసుపు వేసి వండిన ఆహారాలు ఎలాంటి దుష్ప్రభావాలూ చూపకుండానే మంచి ప్రయోజనాన్ని ఇస్తూ మెడిసిన్ ఇచ్చే ప్రభావాన్ని చూపుతాయి.
అల్లం : అల్లానికి కూడా ఔషధ గుణాలూ, వైద్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం కూడా ఒకటి. ఒక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం మాత్రమే కాకుండా అల్లానికి... రక్తంలో చక్కెర మోతాదులను తగ్గించే గుణం కూడా ఉంది.
వెల్లుల్లి : వెల్లుల్లిలో ఎన్నో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నట్టు ఇప్పటికే అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలూ, దీనితో కలిగే ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతూనే ఉన్నాయి. ఇది సమర్థమైన నొప్పి నివారిణి మాత్రమే కాదు... ఇది చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తుంది. అంతేకాదు... శరీరంలో ఇన్ఫెక్షన్లతోనూ ΄ోరాడుతుంది. రక్తంలోని చక్కెరనూ సమర్థంగా నియంత్రిస్తుంది.
చిలగడదుంప : తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోరంగడ్డ, గెణుసుగడ్డ అని పిలిచే ఈ దుంపలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థాలు, బీటా కెరోటిన్, మాంగనీసు, విటమిన్ బి6, విటమిన్– సి వంటి అనేక కీలకమైన పోషకాలు ఉంటాయి. వీటి కారణంగా చిలగడదుంపకు ఇన్‌ఫ్లమేషన్‌ను త్వరగా మానేలా చేసే గుణం ఉంది.
గ్రీన్ టీ : గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ అనే పోషకాలు గ్రీన్–టీ కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను ఇస్తాయి. చాలా రకాల క్యాన్సర్లకు గ్రీన్–టీ మంచి విరుగుడుగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించేందుకు ఉపయోగపడే ఆహారాలు కాగా... కొన్ని రకాల ఆహారాలు ఇన్‌ఫ్లమేషన్ పెంచుతాయి కూడా.
ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే పని ఆహారమే చేస్తే...
ఒకవేళ మందుల్ని కేవలం పరిమితంగానే తీసుకుంటూ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల సదరు ఆహారాలలోని పోషకాల వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్నకు అది సాధ్యపడుతుందనే అంటున్నారు డాక్టర్లు, ఆహార నిపుణులు. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే ఆహారాల గురించి తెలుసుకుందాం.
ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలతో ప్రయోజనాలివి...
ఒకవేళ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి ఆహారాల మీదే ఆధారపడటం వల్ల నొప్పి నివారణ మందుల తాలూకు దుష్ప్రభావాన్ని తగ్గించడమే కాదు... వాటి వల్ల కోల్పోయే రోగనిరోధక శక్తినీ పెంపొందించుకోవచ్చు.
అనవసరంగా వాడే మందుల మోతాదులు తగ్గించడంతోపాటు... వ్యాధినిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసేలా దేహానికి అవసరమైన స్వాభావికమైన పోషకాలనే తీసుకోవడంతో శరీరానికి అవసరమైన విటమిన్లు, లవణాలు సమకూరతాయి. దాంతో నేచురల్ పదార్థాల వల్ల స్వాభావికంగానే ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది.
రిఫైన్డ్ ధాన్యాలు : ధాన్యంపై ఉండే పొట్టును తొలగించి తీసుకునే ఆహారాలు ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి.
కొన్ని రకాల ఆహారంపై పెంచే జంతువుల మాంసం: ఆహారంగా ఉపయోగపడే జంతువులను పెంచే క్రమంలో కొన్నిచోట్ల వాటికి సోయా, కార్న్ వంటివి తినిపిస్తుంటారు. ఇలా సోయా, కార్న్ వంటివి తింటూ పెరిగిన ఆ జంతువుల మాంసం తిన్నప్పుడు దేహంలోని ఇన్‌ఫ్లమేషన్ ఒక పట్టాన తగ్గదు. అలాగే... ఇంకొన్ని జంతువులు త్వరగా లావెక్కి, వేగంగా కొవ్వు పట్టడానికి హార్మోన్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తారు. ఇలాంటి జంతువుల మాంసం కూడా ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది.
రెడ్‌మీట్, ప్రాసెస్‌డ్ మీట్ : కొవ్వు ఎక్కువగా ఉండే గొడ్డు మాంసంలో ఎన్‌ఈయూ5జీసీ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోకి చేరగానే ఇన్‌ఫ్లమేటరీ గుణానికి పెం΄÷ందిస్తుంది. అందుకే ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నవారు రెడ్‌మీట్‌ను తీసుకోవాల్సి వస్తే దాన్ని చాలా పరిమిత మోతాదుల్లో మాత్రమే తినాలి. ఒకవేళ రెడ్‌మీట్‌కు బదులు కోడిమాంసం, చేపలు తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుకోకుండా... తగ్గించుకునే అవకాశాలూ పెరుగుతాయి.
చక్కెరలు : చక్కెరతోపాటు చక్కెరను వాడి తయారు చేసే అన్నిరకాల తీపి పదార్థాలూ ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి.
వంటనూనెలు : ఒక్క ఆలివ్ నూనె మినహాయించి... కుసుమ, సోయా, పొద్దుతిరుగుడు, కార్న్ నూనెలతోపాటు, పత్తినూనె సహా అన్ని రకాల వంట నూనెలూ ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి.
ట్రాన్స్‌ఫ్యాట్స్ (కొవ్వులు): స్వాభావికంగా పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా... కృత్రిమంగా తయారు చేసే నెయ్యి లాంటి డాల్డా వంటి వాటిని ట్రాన్స్‌ఫ్యాట్స్‌గా పేర్కొంటారు. ఇక కొన్ని ఆహారాల్లో నూనెలు, నెయ్యి వంటివి వాడితే త్వరగా పాడవుతాయనీ, అలా పాడు కాకుండా ఉంచేందుకు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకూ (షెల్ఫ్ లైఫ్ పెంచేందుకు) మార్జరిన్ వంటి నూనెలు వాడతారు.
ఈ ట్రాన్స్‌ఫ్యాట్స్ అన్నీ దేహంలొ చెడు కొవ్వులనూ, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దాంతో అన్ని రకాల కొవ్వులూ, వేపుళ్లు, ఫాస్ట్‌ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ మాత్రమే కాకుండా మార్జరిన్ వంటి నూనెను ఉపయోగించిన అన్ని ఆహారాలూ దేహంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచేందుకు కారణమవుతాయి.
పాలలో అలర్జీని తెచ్చిపెట్టే కారకాలు / పోషకాలు : పాలలోని అలర్జీ కలిగించే పదార్థాలు దేహంలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచతారు. ఉదాహరణకు పాలు సరిపడని కొందరిలో వాటిని తాగినప్పుడు వాళ్ల ఒంటిపై ర్యాష్ వస్తుంది. దేహంలో ఇన్‌ఫ్లమేషన్ రావడం వల్లనే ఇలా జరుగుతుంది. (అయితే పాల అలర్జీ కారణంగా అవి సరిపడనివారికి మినహా మిగతా వారందరికీ పాలు మంచి ఆహారం).
ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు : కొన్ని రకాల ఆహారాలకు ఆస్పార్టమ్, ఎమ్‌ఎస్‌జీ అనే అడెటివ్స్ కలుపుతారు. ఇవి కలిపిన ఆహారం ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతుంది.
మనకు సరిపడని అన్ని రకాల ఆహారాలు : కొందరిలో కొన్ని రకాల ఆహారాలు అలర్జీని కలిగిస్తాయి. ఇలా సరిపడని ఆహారాల వల్ల కూడా ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది.
ఆల్కహాల్ : ఆల్కహాల్ దేహంలోని చాలా భాగాల్లో ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ను మరింత పెరిగేలా చేస్తుంది. దేహంలో ఇన్‌ఫ్లమేషన్ ఉండి, క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకుంటుంటే ఆ ఇన్‌ఫ్లమేషన్‌నే కాలక్రమంలో కేన్సర్‌గా మారే ప్రమాదమూ ఉంటుంది. అందుకే ఇన్‌ఫ్లమేషన్ ఉన్నవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఆ మాటకొస్తే ఇన్‌ఫ్లమేషన్ లేనప్పుడూ ఆల్కహాల్ ముట్టుకోకపోవడమే మంచిది.
డాక్టర్ రాజీబ్ పాల్, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్
నిర్వహణ: యాసిన్
(చదవండి: బాధించిన శారీరక ఎత్తునే చిత్తుచేసి.. ఐఏఎస్ స్థాయికి..)