
అమెరికాలోని డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 350కి పైగా కుటుంబాలు ఫార్మింగ్టన్ హిల్స్‌లోని శియావాసీ పార్క్‌లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ ఛాప్టర్ ఆధ్వర్యంలో పల్లెవంట కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, గేమ్స్, సామూహిక చర్చలు వంటి ఎన్నో ఆసక్తికర కార్యకలాపాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ పాల్గొని ఉల్లాసంగా గడిపారు.
పల్లెవంటలో వడ్డించిన తెలంగాణ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బగారా అన్నం, చికెన్, పాలకూర, మామిడికాయ పప్పు, పచ్చిపులుసు, మటన్, రోకటి పచ్చళ్లు, పెరుగన్నం, బీట్‌రూట్ రైతా, వెరైటీ స్నాక్స్, మిఠాయిలు భోజన ప్రియులకు రుచికరమైన విందును అందించాయి. రంగురంగుల వేసవి దుస్తుల్లో వచ్చిన మహిళలు, పిల్లలు పార్క్‌ను పూలతోటలా మార్చారు.
యువతులు, మహిళల కోసం అందమైన బ్యూటీ, ఫ్యాషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రవాసుల్లో ఐక్యతా భావనను, ఆనందాన్ని పెంపొందించేలా వేడుక నిర్వహించినట్లు జీటీఏ యూఎస్‌ఏ అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఉత్సవంగా మాత్రమే కాదు, విలువలు, పరస్పర గౌరవం, ఐక్యతను కలిగిస్తాయన్నారు.
(చదవండి: పెళ్లి బరాత్‌తో దద్దరిల్లిన వాల్‌స్ట్రీట్..! వీడియో వైరల్)