కాలేయ వ్యాధి నివారణకు విశ్రాంతి మాత్రమే ఏకైక మార్గం అనేది ఒక సాధారణ అపోహ. కానీ అధ్యయనాలు,ఆధారాలు అందుకు విరుద్ధంగా చెబుతున్నాయి. సిర్రోసిస్ ఉన్నవారిలో, ఏరోబిక్,స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లను కలిపి చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు తగ్గుతాయి జీవన నాణ్యత అవకాశాలు మెరుగుపడతాయి. ఇది వ్యాధి పురోగతికి ఒక ప్రధాన కారణమైన కండరాల క్షీణత నుంచి కూడా రక్షిస్తుంది.
కాలేయ పనితీరుకు తీవ్రమైన వర్కవుట్స్ అవసరం లేదు. నడవడం, బరువులు ఎత్తడం, శరీరాన్ని సాగదీయడం చిన్నపాటి శ్రమ వంటివి అన్నీ అది కోలుకోవడానికి సహాయపడే సంకేతాలను పంపుతాయి. అయితే తీవ్రత కంటే నిలకడ ముఖ్యం. ఒక వారం పాటు మాత్రమే సాగే పరిపూర్ణ ప్రణాళిక కంటే, నెలల తరబడి పాటించగలిగే దినచర్య ఎల్లప్పుడూ ఉత్తమమైనది.
ఆహారాన్ని జీర్ణం చేయడం, రక్తం వడపోతతో పాటు కాలేయం మరెన్నో పనులు చేస్తుంది. అది శరీరంలోని ఇతర భాగాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నిరంతరం సర్దుబాటు చేసుకుంటుంది. దానికి అత్యంత సన్నిహిత భాగస్వాములలో ఒకటైన కండరాలు క్రమం తప్పకుండా సంకోచించినప్పుడు, అవి కొన్ని సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఇవి కాలేయం కొవ్వును సరైన విధంగా నిర్వహించడానికి వాపును నియంత్రించడానికి సహాయపడతాయి. కండరాల కదలిక తగ్గినప్పుడు, ఆ మద్దతు కూడా తగ్గిపోతుంది,
కాలేయంపై పనిభారం పెరిగి దాని విధుల నిర్వహణ కష్టమవుతుంది. ఈ విషయాన్ని ప్రముఖ హెపటాలజిస్ట్, ‘ది లివర్ డాక్టర్‌గా పేరొందిన సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఒక వివరణాత్మక పోస్ట్‌లో తెలియజేశారు.
వివిధ రకాల వ్యాయామాలు కాలేయానికి నిర్దిష్ట సంకేతాలను ఎలా పంపుతాయో, ప్రతి వ్యాయామానికి క్లినికల్ ట్రయల్స్ ద్వారా నిరూపితమైన ప్రయోజనాలు ఏవేం ఉంటాయో ఆయన వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం... మనం ప్రతిరోజూ కండరాలను ఉపయోగించే విధానమే, కాలక్రమేణా కాలేయం పనితీరును తీర్చిదిద్దుతుంది. కండరాలు కేవలం బలం లేదా అందం కోసం మాత్రమే కాదు. అవి జీవక్రియకు యంత్రంలా పనిచేస్తాయి. అవి సంకోచించినప్పుడు, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరిచే కాలేయంలో కొవ్వు నిల్వను తగ్గించే అణువులను విడుదల చేస్తాయి.
ఒకే బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులకు కాలేయ ఆరోగ్యం చాలా భిన్నంగా ఉంటుంది. ఇద్దరిలో బలమైన, చురుకైన కండరాలు ఉన్నవారికి మాత్రమే ఆరోగ్యకరమైన కాలేయం ఉంటుంది. రోజువారీ కదలిక పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం బాగా తగ్గుతుందని యూకేలో జరిగిన ఒక పెద్ద అధ్యయనం దృవీకరిస్తోంది.
నడక: అత్యంత సులభమైన ఔషధం. వేగంగా నడవడం ఒక మంచి అలవాటు. వారానికి సుమారు 150 నిమిషాలు అలా నడిస్తే, కాలేయంలోని కొవ్వును దాదాపు మూడింట ఒక వంతు తగ్గించవచ్చుననేది ఎంఆర్‌ఐ స్కాన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. చిన్న మార్పులు కూడా ముఖ్యమైనవే. రోజుకు 1,000 అదనపు అడుగులు వేయడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం సుమారు 12 శాతం తగ్గుతుంది. దీనికి జిమ్ అవసరం లేదు, పరికరాలు అవసరం లేదు. కేవలం నిలకడ ఉంటే చాలు.
కార్డియో...కూడా...
స్థిరమైన వేగంతో జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం వంటివి కార్డియోలో ఉంటాయి. మనం సరైన వేగంతో చేస్తున్నామా లేదా అనేది తెలుసుకునేందుకు ఓ సులభమైన పరీక్ష ఏమిటంటే... చేసే సయమంలో మాట్లాడటం సులభంగా అనిపించాలి, పాడటం మాత్రం కష్టంగా అనిపించాలి.
వారానికి కొన్ని రోజులు, 30–45 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల కాలేయంలోని కొవ్వును తగ్గించి, కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను మెరుగుపరచవచ్చు. బరువు తగ్గకపోయినా ఈ ఆరోగ్య ప్రయోజనాలు కనిపించడం గమనార్హం. ఇది మన ఆలోచనల్ని కేవలం బరువు తగ్గడం నుంచి అత్యంత కీలకమైన జీవక్రియ ఆరోగ్యం వైపు మళ్లిస్తుంది.
స్ప్రింట్ ఇంటర్వెల్స్
స్ప్రింట్ ఇంటర్వెల్ శిక్షణ సెష¯Œ లు 15 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టవచ్చు. కేవలం ఆరు వారాల పాటు దీనిని చేయడం వల్ల, ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నవారిలో, కాలేయ కొవ్వు అంతర్గత అవయవాల కొవ్వును గణనీయంగా తగ్గించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. సమయం దొరక్క ఇబ్బందిపడేవారికి, అలాగే కఠిన శ్రమను తట్టుకోగలవారికి ఇది సరిపోతుంది.
హై–ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, (హెచ్‌ఐఐటి) అంటే చిన్న విరామాలలో తీవ్రమైన శ్రమ చేసి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం. సుమారు 12 వారాలలో ఈ పద్ధతి కాలేయంలోని కొవ్వును 37 శాతం వరకు తగ్గించగలదు. ఇది గుండెను కూడా బలపరుస్తుంది కార్డియోతో సమానమైన ప్రయోజనాలు, దానికి పట్టే సమయంతో పోలిస్తే దాదాపు సగం సమయంలోనే లభిస్తాయి.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్
బరువులు ఎత్తడం లేదా బాడీవెయిట్ వ్యాయామాలు చేయడం కండరాలను పెంచుతాయి, అది నేరుగా కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.శరీర బరువు మారకపోయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాలేయంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఇది కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను కూడా తగ్గిస్తుంది. సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ముఖ్యమైనది. ఇది కండరాల క్షీణతను నివారించడంలో సహాయపడుతుంది,
రెండింటినీ కలపడం ఓ చక్కని విజయ సూత్రం
కార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లను కలపడం ఉత్తమమైన మార్గం. ఈ కలయిక, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది కాలేయం కోలుకోవడానికి మరింత బాగా తోడ్పడుతుంది. ఇది గుండె, కండరాలు కాలేయం అన్నీ కలిసి మెరుగుపడే సంపూర్ణ పరిస్థితిని శరీరంలో కల్పిస్తుంది.
యోగా...
సూర్య నమస్కారం మరికొన్ని యోగా పద్ధతులు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని క్రమం తప్పకుండా సాధన చేస్తే, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో యోగా ద్వారా కాలేయ కొవ్వును తగ్గించవచ్చు. అయితే, కేవలం తేలికపాటి స్ట్రెచ్ ఎక్సర్‌సైజ్‌లు ఏరోబిక్ వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదు. హార్ట్ బీట్‌ను పెంచే కదలికలు ఎప్పటికీ ప్రధాన పాత్ర పోషిస్తాయి


